గండిపల్లి ఎత్తు పెంచితే నష్టమే ఎక్కువ : పొన్నం ప్రభాకర్

గండిపల్లి ఎత్తు పెంచితే నష్టమే ఎక్కువ : పొన్నం ప్రభాకర్
  •      రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గండిపల్లి ప్రాజెక్టు ఎత్తు పెంచితే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. ఉన్నది ఉన్నట్టుగానే పూర్తిచేసి, గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ఈ ప్రాజెక్టులోకి నీళ్లు నింపుతామన్నారు. సోమవారం ఆయన అక్కన్నపేట మండలకేంద్రంలో పల్లె దవాఖానా, వాటర్​ ట్యాంకును ప్రారంభించారు.

అనంతరం అంతకపేటలో ఐకేపీ భవనం, ఓపెన్​ జిమ్, అంతకపేట నుంచి గుబ్బడి వరకు నిర్మించబోయే పీఆర్​ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండిపల్లి ప్రాజెక్టు ఎత్తు పెంచితే ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదన్నారు. దీనిపై ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డికి ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి గండిపల్లి ప్రాజెక్టులోకి నీళ్లు నింపే పనులు చేపడతామన్నారు.

కాల్వల నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయినవారందరికీ పరిహారం ఇస్తూ, పునరావాసం కల్పిస్తామని చెప్పారు. గౌరవెల్లి, గండిపల్లి, దేవాదుల, శ్రీరా సాగర్ వరద కాల్వ ద్వారా నీళ్లువస్తే హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. 

మంత్రిని కలిసిన నాయి బ్రాహ్మణులు

చేర్యాల: తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ను ఉమ్మడి మద్దూరు మండల నాయి బ్రాహ్మణులు కలిసి వారి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలి వైద్యులుగా పిలిచే నాయి బ్రాహ్మణులకు అన్ని రంగాల్లో హక్కులను కల్పించాలని కోరినట్లు తెలిపారు. మహిళలకు ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ సెంటర్ల నియామకాల్లో అవకాశం కల్పించాలని కోరారు.

దేవాలయాలు, మార్కెట్​ కమిటీల పాలక మండల్లలో సభ్యలుగా గుర్తించాలని, అన్ని మండల కేంద్రాల్లో నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి మద్దూరు మండల అధ్యక్షుడు సతీశ్​కుమార్, సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాకర్, యాదనరేందర్, స్వామి, శ్రీనివాస్, కనకయ్య, వెంకటస్వామి పాల్గొన్నారు.