హైదరాబాద్ ఇమేజ్​ పెంచుదాం కలసికట్టుగా పనిచేద్దాం : పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ ఇమేజ్​ పెంచుదాం కలసికట్టుగా పనిచేద్దాం : పొన్నం ప్రభాకర్
  • బల్దియా, వాటర్​బోర్డు సమస్యలపై రిపోర్టులు రెడీ చేయండి
  •  ఆయా విభాగాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ
  • రోడ్లపై చెత్త ఎందుకు ఉంటోందని ప్రశ్నించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: “ డస్ట్ బిన్ లెస్ సిటీ అంటూ ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తుంటే.. రోడ్లపై ఎందుకు  ఉంటుంది?  పొద్దుపొద్దున హుస్సేన్​సాగర్​లో కూడా చెత్త వేస్తున్నరెందుకు’’?  అంటూ బల్దియా అధికారులను హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వేసవి సమీపిస్తుండగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూసేందుకు సిద్ధంగా ఉండాలని వాటర్​బోర్డును ఆదేశించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి, బల్దియా, వాటర్​బోర్డు అధికారులతో కలిసి బుధవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బల్దియా శానిటేషన్, ఇంజనీరింగ్, ప్రాజెక్టులు తదితర అంశాలతో పాటు వాటర్ బోర్డుకు సంబంధించిన తాగునీరు. మురుగునీటిపై రివ్యూ చేశారు. ముందుగా ప్రస్తుత పనులు, రెండు డిపార్ట్​మెంట్లలోని పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగారు. కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని, ఇంటింటి చెత్త సేకరణ చేస్తుంటే కూడా రోడ్లపై ఎందుకు వేస్తున్నారని, ఏజెన్సీలకే అప్పగించిన మెయిన్ రోడ్లపై వర్కర్లు ఎందుకు పని చేస్తున్నారని, స్వీపింగ్ మెషీన్లు ఏమయ్యాయని మంత్రి ప్రశ్నించారు.

డీ సెంట్రలైజేషన్ పేరుతో జోనల్ అధికారులపై వదిలేయకుండా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని, ఏ సమాచారమైనా అందరి వద్ద ఉండాలని ఆదేశించారు. డీ సెంట్రలైజేషన్ అంటే ఆ జోన్ ని వారికి అప్పగించినట్లు కాదని ప్రజలకు పాలన చేరువయ్యేందుకే జోనల్ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు.  సమస్యలు రెగ్యులర్​గా ఉంటాయని, వాటిని అధిగమించేందుకు అధికారులు పని చేయాలని సూచించారు. మేయర్, కమిషనర్ తో కలిసి త్వరలో సీఎంతో సమావేశమై జీహెచ్ఎంసీపై చర్చిస్తామని తెలిపారు. 

కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 

బల్దియాలోని పనులను విభాగాల వారీగా కమిషనర్ రోనాల్డ్ రాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. వచ్చే వర్షాకాలంలో  సిటీలో వరద ముంపు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎస్ఎన్డీపీ ద్వారా నాలా పనులు చేసినట్లు తెలిపారు. కోర్టు కేసుల ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల పనులు పూర్తి చేశామని చెప్పారు.జీహెచ్ఎంసీ సిబ్బంది, పార్కులు, రోడ్లు ఇలా శాఖల వారీగా అన్ని వివరాలు మంత్రికి వివరించారు. 

సీవరేజ్ అభివృద్ధికి ఎస్టీపీల నిర్మాణాలు

సిటీలో  సీవరేజ్ అభివృద్ధికి తీసుకునే చర్యలపైమంత్రికి మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి వివరించారు. సీవరేజ్ అభివృద్ధికి గతంలో 25 ఎస్టీపీలు ఉండగా మరో 31ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టమన్నారు. అందులో5  పూర్తయ్యాయన్నారు.  కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీమ్ ద్వారా మరో 35 ఎస్టీపీలకు ప్రతిపాదనలు పంపామని వివరించారు. దేశంలో 40 శాతం మురుగునీటి శుభ్రతలో హైదరాబాద్ పేరు పొందిందని గుర్తుచేశారు. ఎస్టీపీలతో మూసీ నది అభివృద్ధికి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.  

అడ్వర్టయిజ్ మెంట్ పాలసీలో మార్పులు చేస్తే..

జీవో 68 స్థానంలో అడ్వర్టయిటైజ్​మెంట్ పాలసీలో  మార్పులకు కొత్తగా డిజైన్ చేసి ప్రభుత్వానికి పంపామని, దీనిపై నిర్ణయం తీసుకుంటే కొంత మేర రెవెన్యూ వచ్చే అవకాశం ఉందని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్​రెడ్డి మంత్రికి వివరించారు. ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని, 421 మంది ఏఈల స్థానంలో 200 మంది మాత్రమే ఉన్నారని సీఈ దేవానంద్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. జవహర్ నగర్​లో డంపింగ్ యార్డుపై లోడ్ పెరిగిందన్నారు.  దుండిగల్ ప్లాంట్ పూర్తయిందని, త్వరలో ప్రారంభించాలని మంత్రికి వివరించారు. సిటీలో జంక్షన్ల వద్ద ఎక్కడ కూడా లైట్ల సమస్య లేదని,  విద్యుత్ ఏజెన్సీలు సరిగా పనిచేయకపోగా కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. 

ఓఎస్డీని నియమిస్తం: మంత్రి పొన్నం ప్రభాకర్ 

 హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరిగే విధంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు కో ఆర్డినేషన్​తో  ముందుకెళ్లాలని.. ఇందుకు ప్రత్యేకంగా ఓఎస్డీని నియమిస్తామని, ఏ సమస్య ఉన్న తన దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. రివ్యూ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.  సమ్మర్​లో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్లాన్ రెడీ చేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు.

బల్దియా అభివృద్ధి పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసీతో ముందుకెళ్లనుందన్నారు. మూసీ అభివృద్ధికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు ఉంటాయన్నారు.  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్​కు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తామన్నారు.  కేంద్రంతో ఎలాంటి విబేధాలు లేవని, గత ప్రభుత్వం నిధులను తేవడంలో విఫలమైందని, తాము ప్రతిదీ అడుగుతామని, ఇందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా సహకరించాలన్నారు. సిటీ అభివృద్ధిపై రోజూ వారీగా సమీక్షలతో పాటు సమస్యలపై రిపోర్ట్ తయారీ ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్​గా ఉండాలని సూచించారు. అప్పులు, -ఆస్తులపై సీఎం  నివేదిక ఇస్తామన్నారు. బల్దియా సమస్యలపై ప్రత్యేక రిపోర్ట్ రూపొందించాలని ఆదేశించామన్నారు.