రాజకీయం, అధికారం శాశ్వతం కాదు : పొన్నం ప్రభాకర్

రాజకీయం, అధికారం శాశ్వతం కాదు : పొన్నం ప్రభాకర్

ఎల్కతుర్తి (భీమదేవరపల్లి), వెలుగు : రాజకీయం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అనవసరంగా ఎగిరిపడితే ప్రజలు ఇంట్లో కూర్చోబెడుతారని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో కొత్తగా కట్టిన పల్లె దవాఖానాను సోమవారం ప్రారంభించారు. అలాగే బోల్లోనిపల్లె నుంచి గట్ల నర్సింగాపూర్‌‌‌‌ వరకు, చంటాయపల్లిలో నిర్మించబోయే రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

గట్ల నర్సింగాపూర్, రసూల్‌‌‌‌పల్లి, మల్లారం గ్రామాల్లో కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్‌‌‌‌లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే పల్లె దవాఖానా ప్రారంభించినట్లు చెప్పారు. ఎండాకాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చి 60 రోజులు కూడా కాలేదని, కొందరు లీడర్లు మాత్రం సోయి తప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. ఆయా కార్యక్రమాల్లో హనుమకొండ అడిషనల్‌‌‌‌ కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వోలు యాకుబ్‌‌‌‌పాషా, ఉమాశ్రీ, మెడికల్‌‌‌‌ ఆఫీసర్ రాజశేఖర్, ముల్కనూర్ సర్పంచ్ మాడ్గుల కొమురయ్య పాల్గొన్నారు.