అక్షింతలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నరు: పొన్నం ప్రభాకర్

అక్షింతలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నరు: పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్​, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని బీజేపీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రజలకు రాముడి అక్షింతలు ఇచ్చి ఓట్లు అడుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాముడి పేరుతో రాజకీయం తప్ప ఆ పార్టీ తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. రాష్ట్రంలో పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ కూడా ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇప్పుడు ఓడిపోగానే లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.500కే వంట గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీంను మంగళవారం నుంచి ప్రారంభించబోతున్నామన్నారు. తమ సర్కార్ ఏర్పడి 80 రోజులు కూడా పూర్తి కాకుండానే బీఆర్ ఎస్ లీడర్లు శాపనార్థాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎన్ని హామీలు నెరవేర్చారో గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉండి బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ప్రజాహిత యాత్ర పేరుతో హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్న ఎంపీ బండి సంజయ్ ఇన్నేళ్లు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ప్రజలపై బాధ్యత ఉంటే కేంద్రం నుంచి సిలిండర్​కు రూ.500 సబ్సిడీ తీసుకురావాలని సవాల్​చేశారు. ఆ పార్టీ లీడర్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు ఓట్లు వేయరన్నారు .

యువత ఆటలపై దృష్టి పెట్టాలి

ఎల్కతుర్తి, వెలుగు: యువత క్రీడల్లో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ సోమవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఆటల్లో గెలుపోటములు సహజమేనని, ఓడిపోయిన వారు మళ్లీ కష్టపడి విజయం సాధించాలని సూచించారు. అనంతరం ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన టీంకు రూ. 30 వేలు, రన్నరప్​కు రూ. 15 వేలు అందజేశారు. మ్యాన్​ఆఫ్​ద సిరీస్ గా అంబాల జీవన్ నిలిచారు. తహసీల్దార్ జగత్ సింగ్, సీఐ ప్రవీణ్​కుమార్, ఎస్సై రాజ్​కుమార్, పీసీసీ మెంబర్​బొమ్మనపల్లి అశోక్​రెడ్డి, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.