
పొన్నం సత్తయ్య నేడొక స్ఫురణ. విలువల జీవనానికి ప్రేరణ. సమష్టి జీవన విధానానికి ప్రతీక. ఎదిగినకొద్దీ ఒదిగుండే తత్వానికి సందేశం. ఆయన పేరిట నెలకొల్పిన ‘జీవన సాఫల్య పురస్కారాల’ ప్రదానం అనగానే.. ఎన్నో జ్ఞాపకాలు, భావనలు, ఆలోచనల దొంతర కదులుతుంది. చిన్నో, పెద్దో.. ప్రతి మనిషి జీవితంలో మననం చేసుకోదగిన వివిధ పార్శ్వాలుంటాయి.
మనిషి తనకు తాను ఎంతో సంక్లిష్టం చేసుకున్న జీవితంలో సరళ జీవనానికి లభించే ప్రతి సంకేతమూ ప్రేరణే! అటువంటి పలు సంకేతాలు ఇచ్చిపోయిన పొన్నం సత్తయ్య మొన్న, నిన్న మన మధ్య నడయాడిన తీపి జ్ఞాపకం. ఆయన 15వ వర్ధంతి స్మరణకు ఒక సందర్భం.
ఎదలను కదిలించి, మానవతను పదిలపరచడం కంటే అపుడైనా, ఇపుడైనా, ఎపుడైనా..మనం ఆశించేది ఇంకేముంటుంది. అలా ఆశించిన పెద్దమనిషి పొన్నం సత్తయ్య. అన్నివేళలా, అన్నిట్లో మంచి చూసిన తత్వమాయనది. నిగర్వి, నిరాడంబరుడు, నిశ్చల మనస్కుడు.
దశాబ్దాల తరబడి ఒక పెద్ద కుటుంబం ఉమ్మడిగా సాగిస్తున్న జీవన రథానికి ప్రత్యక్ష, పరోక్ష రథికుడు సత్తయ్య. నేనాయనను ఎరుగుదును. పలు సందర్భాల్లో కలిసినపుడు, ఆయనలో నన్నాకర్షించిన అంశం, మానవ సంబంధాలకు ఇచ్చిన గౌరవం. తక్కువగా మాట్లాడే ఆయన చర్యల ద్వారా, తెలిపే ఆకాంక్షల ద్వారా, ఆశించే లక్ష్యాల ద్వారా తన మనసు వెల్లడించేది. ఈ తరం భవిష్యత్తరాలు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
‘ఇంటి’ని కేంద్రకం చేసి ఆయన నడిపిన సరళ, సౌహార్ద్ర, సమ్మిళిత జీవనశైలి ఒక గొప్ప స్ఫూర్తి. నిలకడ, నిరాడంబరతలో సంప్రదాయవాది. నలుగురు అన్నదమ్ములలో తానొక్కడే నిరక్షరాశ్యుడైన సత్తయ్య మట్టిని నమ్ముకుని, వ్యవసాయాన్నే తన జీవనాధారంగా మలచుకుని అహోరాత్రులు కష్టపడి, ఆ ఫల సాయంలోనే తన జీవన సాఫల్యతను వెదుక్కున్న భూమిపుత్రుడు ఆయన.
ఇల్లే సంగీతం, వంటిల్లే సాహిత్యం
వంటింటి ప్రధాన వ్యాసంగం వంట. అది కేవలం వంటిల్లు కాదు. కుటుంబాలను కట్టిపడేసే కనపడని తీయని బంధం. వంటింటి ప్రాధాన్యత తెలిసిన సత్తయ్య ఇంటి వంట ఒంటికి మంచిదని, కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయాలని చెప్పేవారు. ఇంటికొచ్చినవారు తమ ఇంట్లో చేయి కడిగి, తిని పోవాలని ఆయనకెంతో కోరికగా ఉండేది. ఇంటి వంట పౌష్టికాహారపరంగానే కాదు, అదొక ప్రేమ, బంధం, ‘ఒకరికొకరు చెందడం’ అనే భావనకు మూలాధారం. కుటుంబ సభ్యులంతా భోజనానికి టేబుల్ చుట్టూ చేరితే... ఎదలు చేరువౌతాయి,
ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు
సత్తయ్య తనయులు పొన్నం అశోక్, పొన్నం రవిచంద్ర, పొన్నం ప్రభాకర్‌లు తమ తండ్రి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి, ఆయన మంచితనాన్ని శాశ్వతీకరించే పని చేపట్టారు. మంచితనం వ్యాప్తికి సాహిత్యం, జానపద కళలు సముచిత వాహకాలు అనుకున్నారేమో, ఆ రెండు రంగాలలో విశేష కృషి చేసిన, చేస్తున్నవారికి ఏటా ‘జీవన సాఫల్య పురస్కారాలు’ ఇస్తున్నారు. రూ.51 వేల నగదుతో పాటు అందించే ఈ పురస్కారాలను 2022లో ప్రారంభించారు.
పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి రోజైన శనివారం (13 సెప్టెంబర్) జరిగే కార్యక్రమంలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ (సాహిత్యం), అంతడుపుల రమాదేవీ (జానపద కళలు)లకు 2025కి గాను అవార్డులు అందించనున్నారు. ఈ అవార్డులు లోగడ నాళేశ్వరం శంకరం, నలిమెల భాస్కర్, చంద్రబోస్ (సాహిత్యం), ఒగ్గు ధర్మయ్య, విమలక్క, ‘బలగం’ఫేమ్ కొమురమ్మ మొగిలయ్యలు (కళలు) పొందారు.
మంచితనానికి మారుపేరుగా నిలిచిన సత్తయ్య జీవన సందేశాన్ని ముందుతరాలకు అందించే లక్ష్యంతో ఈ అవార్డులను నెలకొల్పినట్లు పాత్రికేయ అనుభవం, సాహితీ వాసనలున్న రెండో తనయుడు పొన్నం రవిచంద్ర చెబుతారు. సంస్థలు, వ్యక్తుల పేర్ల మీద నెలకొల్పే వార్షిక- స్మారక అవార్డుల ద్వారా ఆయా సంస్థలు, వ్యక్తుల కృషి, సేవ, మంచితనం తాలూకు వారసత్వాన్ని ఈ అవార్డుల ద్వారా శాశ్వతీకరించడం ఒక లక్ష్యం.
మనిషి పోతె మాత్రమేమి.. మససు ఉంటది
వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన పొన్నం సత్తయ్యకు వ్యవసాయం మీద అపారమైన ప్రేమ. కరీంనగర్ ‘మంకమ్మతోట’లో ఆయనొక తులసి మొక్క! శ్రమైక జీవన సౌందర్యాన్ని ఇష్టపడ్డవాడు గనుక, ఇంటిల్లిపాదినీ ఏదో ఒక పని చేసుకోవాలని ప్రోత్సహించేవాడు. అరమరికలు లేకుండా, కలిసుండాలని, ఏం చేస్తున్నా నలుగురికి ఉపయోగపడుతుండాలని చెబుతుండేవారు.
పిల్లలు ఆ పెంపకంలోనే పెరిగి పెద్దయ్యారు. పొన్నం అశోక్ న్యాయవాదిగా వివిధ హోదాలకు ఎదిగారు. పొన్నం రవిచంద్ర జర్నలిస్టుగా, రచయితగా, కరీంనగర్ కళాబంధుగా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పొన్నం ప్రభాకర్ రాజకీయ రంగంలో రాణిస్తున్నారు.
విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, ‘మార్క్‌ఫెడ్’ చైర్మన్‌గా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ ఎంపీల జాతీయ కన్వీనర్‌గా, ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు.
తండ్రి పేర సామాజిక సేవ
ప్రభాకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు’ ద్వారా పలు అభివృద్ధి, సంక్షేమ, సేవా, ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ప్రత్యామ్నాయాల కల్పనకు ఇటీవలే ఒక పెద్ద కార్యక్రమం చేపట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 164 గ్రామాల్లో, 276 మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా రూ.2.54 కోట్ల విలువ చేసే ‘స్టీల్ బ్యాంక్’లను ఏర్పాటు చేశారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేత దీన్ని ప్రారంభింపజేశారు. ఈ ట్రస్టు ద్వారా పేదలకు విద్య, వైద్య కల్పించడంతోపాటు వేములవాడ దేవస్థానం ఆన్నదాన ట్రస్టుకు, హుస్నాబాద్ నియోజకవర్గంలో కొత్తకొండ దేవస్థాన ఆవరణలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలన్నది లక్ష్యమని పెద్దకొడుకు పొన్నం అశోక్ చెబుతారు. ప్రజల మేలు కోరిన సత్తయ్య స్ఫూర్తి నిరంతరం కొనసాగాలన్నది కుటుంబ సభ్యుల కోరిక. ‘మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది. జనమ జనమకూ అది.’
- దిలీప్ రెడ్డి,సీనియర్ జర్నలిస్ట్-