
ఒకటీ రెండు సంవత్సరాలుగా కాదు.. కొన్ని దశాబ్దాలుగా ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను సినిమాగా తీయాలని కలలు కంటున్నారు మణిరత్నం. ఇప్పటికి అది సాధ్యమయ్యింది. భారీ స్టార్ కాస్ట్ తో, అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ప్లాన్ చేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మణి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? అందరూ అనుకున్నట్టుగా కొత్త రికార్డుల్ని సృష్టించిందా? తెలుసుకుందాం.
కథేమిటంటే..
సుందరచోళుడు (ప్రకాష్ రాజ్) చాలా గొప్ప చక్రవర్తి. ఆయనకి ఇద్దరు కొడుకులు.. ఆదిత్య కరికాలుడు (విక్రమ్), అరుణ్ మొళి (జయం రవి). వీళ్లిద్దరూ మహా వీరులు. రాజ్యాన్ని విస్తరించేందుకు గాను ఇద్దరూ చెరో దిక్కుకూ వెళ్తారు. ఒక్కో రాజ్యాన్నీ చేజిక్కించుకుని విజయ కేతనం ఎగురవేస్తుంటారు. మరోవైపు వాళ్ల బాబాయ్ పెద్ద పల్వేట్టరాయుడు (శరత్ కుమార్) రాజ్యకాంక్షతో రగిలిపోతుంటాడు. సామంత రాజులతో కలిసి కుట్రలు పన్నుతుంటాడు. అది గ్రహించిన కరికాలుడు తనకెంతో నమ్మకస్తుడైన వల్లవరాయ వందిదేవుణ్ని (కార్తి) విషయం కనుక్కోమని పంపిస్తాడు. మారు వేషంలో వెళ్లిన వల్లవరాయుడు జరుగుతున్న కుట్రను కనిపెడతాడు. అయితే కరికాలుడికి ఆ విషయం చేరవేసేలోపు ఊహించనివి జరుగుతాయి. తన కొడుకు అరుణ్ మొళిని బంధించి తీసుకురమ్మని సుందరచోళుడు ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు పాండ్యరాజులు అరుణ్ మొళిని చంపేసి చోళ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తారు. అందరూ కలిసి మూకుమ్మడిగా అతనిపై దాడి చేస్తారు. వారి నుంచి అరుణ్ మొళి తప్పించుకున్నాడా, వల్లవరాయుడు అతన్ని కాపాడగలిగాడా అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
‘పొన్నియిన్ సెల్వన్’ అనేది తమిళంలో వచ్చి అత్యంత గొప్ప నవలల్లో ఒకటి. దాన్ని సినిమాగా మలచడమంటే చిన్న విషయం కాదు. అయితే ఆ పని చేస్తున్నది మణిరత్నం కావడం వల్ల అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. పైగా విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు వర్క్ చేస్తూ ఉండటంతో ఆ నమ్మకం మరింత పెరిగింది. ఇది తమిళ బాహుబలి అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ సినిమా చూశాక కానీ అసలు సంగతి అర్థం కాదు. నిజమే.. ఇండియన్ సినిమాని, ముఖ్యంగా సౌత్ సినిమాని బాహుబలికి ముందు, తర్వాత అంటూ విడదీసి చూడాల్సిన పరిస్థితి. హిస్టారిక్ బ్యాక్‌డ్రాప్‌తో తీసే సినిమాలకు వికీపీడియా లాంటిది బాహుబలి. ఈ కథలో వాస్తవం ఎంత, అసలు ఇదెలా సాధ్యపడుతుంది లాంటి లాజిక్కుల్ని పక్కనపెడితే.. అద్భుతంగా ఎంటర్‌టైన్ చేయగలగడం, అడుగడుగునా ఆశ్చరచకితుల్ని చేయడం ఎలాగో ఈ సినిమా ప్రూవ్ చేసింది. అందుకే బాహుబలితో పోల్చగానే పొన్నియిన్ సెల్వన్ రేంజే మారిపోయింది. కానీ సినిమా చూశాక కానీ దీని స్థాయి ఏమిటో అర్థం కాదు.
మణిరత్నం ఎప్పుడూ దేన్నీ వివరించి చెప్పరు ప్రేక్షకులకి. క్యారెక్టర్లని ఎలివేట్ చేస్తూ, కథని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతారు. అది ఆయన స్టైల్. అయితే అది రెగ్యులర్ సినిమాలకి వర్కవుటవుతుంది కానీ హిస్టారిక్ సినిమాలకి కాదు. పొన్నియిన్ సెల్వన్ ఎంత గొప్ప నవలైనా అందరూ దాన్ని చదివి ఉండరు. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు మణి. ఏదో అందరికీ తెలిసిన గాంధీ, నెహ్రూల గురించి చెప్పినట్టు చెప్పుకుంటూ పోవడంతో ఏ క్యారెక్టర్ ఏంటి, అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి. దానికి తోడు ఏమాత్రం పస లేని స్క్రీన్ ప్లే ప్రేక్షకుడి ఓపికకి పరీక్ష పెడుతూ ఉంటుంది. ఓపక్క కథ అర్థం కాక చస్తుంటే ఏవేవో పాత్రలు ఎంటరైపోతుంటాయి. ఏంటేంటో మాట్లాడేస్తుంటాయి. కథ ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంటుంది. ఓ అవునా, ఈ వ్యక్తి అతనా, వీళ్లిద్దరి రిలేషన్ ఇదా అంటూ లెక్కలేసుకోవడమే సరిపోతుంది ప్రేక్షకుడికి. వాళ్ల డైలాగ్స్ తో కథ అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలే తప్ప అసలు కథేమిటనేది కాస్త కూడా బోధపడదు. ఏదైనా పాయింట్ అర్థమవుతుంది అంటే అది ఒకటే.. చోళ రాజ్యాన్ని ఆక్రమించుకోడానికి కుట్రలు జరుగుతున్నాయి అని.
అసలు హిస్టారిక్ సినిమా అనగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎత్తులు పైఎత్తులు.. కుట్రలు కుతంత్రాలు.. భారీ యుద్ధాలు.. బీభత్సమైన ఎలివేషన్లు.. ఇవే కదా! అసలు ఏ టెక్నాలజీ లేని సమయంలో వచ్చిన బ్లాక్ అండ్ బైట్ సినిమాల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాలో కన్ను పొడుచుకుని చూసినా ఒక్క అందమైన ఎలివేషన్ కూడా కనిపించదు. మహా వీరుడైన ఆదిత్య కరికాలుడి ఎంట్రీ కూడా సింపుల్‌గా ఉంటుంది. టైటిల్ రోల్ అయిన పొన్నియిన్ సెల్వన్ కూడా ఏమాత్రం డైనమిక్‌గా లేకుండా నీరసంగా కనిపిస్తుంటాడు. ఈ రెండు పాత్రలూ వచ్చినప్పుడల్లా ఏదో సైడ్ క్యారెక్టర్ వచ్చి పోయినట్టే ఉంటుంది తప్ప వాళ్లు హీరోలని ఏమాత్రం అనిపించదు. ఇక అత్యంత కీలక పాత్ర అయిన నందిని గురించి. ఈమె మహా ఖిలాడి అని, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని వాళ్లూ వీళ్లూ చెబుతుంటే విని మనం ఓహో అనుకోవడమే. ఆమె అలాంటిది అని తెలిపేలా ఒక్కటంటే ఒక్క సీన్ లేదు సినిమాలో. పోనీ ఎమోషన్స్ బలంగా ఉన్నా జనం కాస్త ఓపికగా చూడటానికి ట్రై చేసేవారేమో. కథలో లీనమవడానికి, క్యారెక్టర్లతో కనెక్ట్ కావడానికి ప్రయత్నించేవారేమో. ఆ అవకాశం పొరపాటున కూడా ఇవ్వలేదు. నందిని తనను మోసం చేసిందనే వేదనతో కుమిలిపోతుంటాడు కరికాలుడు. ఆ సన్నివేశాల్లో కూడా పిచ్చి పట్టినవాడిలా అరుస్తాడే తప్ప.. ప్రేక్షకుడి కళ్లలో నీళ్లు తెప్పించేలా మాత్రం ప్రవర్తించడు.
ప్లస్సులూ మైనస్సులూ..
ఇదంతా ఆర్టిస్టుల ఫెయిల్యూర్ కానే కాదు. హండ్రెడ్ పర్సెంట్ నేరేషన్ సరిగ్గా లేకపోవడం వల్లనే. ఫ్లాట్‌గా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. సినిమాకి ఉండాల్సిన ట్విస్టులు, ఇన్‌వాల్వ్ చేసే డైలాగులు ఏవీ లేవు. పైగా ఎక్కువ పాత్రలు ఉండటంతో బ్యాలెన్స్ చేయడం కూడా కష్టమయ్యింది. ఎవరినీ పూర్తిగా చూపించలేదు. పాత్ర ప్రాధాన్యతను గుర్తించే చాన్స్ కూడా ఆడియెన్స్కి దొరకలేదు. అయితే ఈ మొత్తంలో మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది కేవలం కార్తి గురించే. ఈ సినిమాకి అతనే హీరో. కరికాలుడి మనిషిగా వేరే ప్రాంతానికి వేగుగా వెళ్తాడు. అక్కడి నుంచి అతని జర్నీ గమ్మత్తుగా సాగుతుంది. ఏ అమ్మాయి కనబడినా ఫ్లర్ట్ చేస్తుంటాడు. ఆ క్రమంలో కాస్త గొప్పలు పోయి బోల్తా పడుతుంటాడు. బేసిగ్గా కార్తి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. దాంతో ఈ పాత్రని అత్యద్భుతంగా పండించాడు. ‘నేను అమ్మాయిల కోసం ప్రాణమిస్తాను. నీలాంటి అమ్మాయి కోసమైతే నాలుగుసార్లు ఇస్తాను’ అంటూ ఐశ్వర్యతో చెప్తాడు. అతనో మహావీరుడు అని తన గురించి విక్రమ్ రాసినట్టు తనే లేఖ రాసుకెళ్లి త్రిషకి ఇస్తాడు. ఇలాంటి సీన్లు ఎంటర్‌టైన్ చేశాయి. నీరసించిన ప్రేక్షకుడు నిద్రలోకి జారుకోకుండా కాపాడింది అతనొక్కడే అంటే అతిశయోక్తి కాదు.
ఎవరెలా చేశారంటే..
విక్రమ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పడానికేముంటుంది! పాత్ర ఏంటి, నిడివి ఎంత లాంటివన్నీ అతని విషయంలో అనవసరం. విక్రమ్ యాక్ట్ చేశాడంటేనే ఆ క్యారెక్టర్ ప్రత్యేకం. కరికాలుడి పాత్రకి కూడా అతను ప్రాణం పోశాడు. కనిపించిన కాసేపైనా తన లుక్స్ తో, ఎక్స్ప్రెషన్స్ తో ఇంప్రెస్ చేశాడు. బహుశా వీరోచితమైన ఆ పాత్రని అంత స్థాయిలో చూపించి ఉంటే విజువల్ ఫీస్ట్ ఇచ్చి ఉండేవాడు. కానీ అతనికి ఆ చాన్స్ దొరకలేదు. జయం రవి కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. అతని ఆహార్యం కూడా బాగుంది. కానీ పేరుకే టైటిల్ రోల్. నిడివి చాలా తక్కువ. ఇక ఐశ్వర్యారాయ్ పాత్ర మీద అందరికీ చాలా ఆశలు ఉన్నాయి. కానీ దీన్ని కూడా ఆశించిన స్థాయిలో తీర్చిదిద్దలేదు. నర్మగర్భంగా నడచుకునే నందినిగా ఆమె అదరగొట్టినా.. ఎక్కువ స్కోప్ లేకపోవడం వల్ల అభిమానులు డిజప్పాయింట్ అవ్వక తప్పదు. అయితే ఆమె లుక్స్ అయితే చాలా బాగున్నాయి. కార్తి మాత్రం సినిమా అంతా ఉన్నాడు. తానే ఈ సినిమాకి మెయిన్ అన్నంత గొప్పగా పర్‌ఫార్మ్ చేశాడు. శరత్ కుమార్, త్రిష, పార్థిబన్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. త్రిష స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించింది. శోభిత కూడా ఓకే. మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు.
ఇక టెక్నికల్ అంశాలు చూసుకుంటే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ రిచ్‌గా ఉండి ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో సముద్రంలో జరిగే ఫైట్‌ని చాలా బాగా చూపించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ బెస్ట్ అనిపిస్తుంది. అయితే ఎలివేషన్లు ఎక్కువగా లేకపోవడంతో మరింత గొప్పగా ఇవ్వగలిగినా లిమిట్ చేసుకోవాల్సి వచ్చింది రెహమాన్‌కి. పాటలు మాత్రం ఆయన స్థాయిలో లేవు. తోట తరణి ఆర్ట్ వర్క్ అయితే అద్భుతంగా అనిపించింది. డైలాగ్స్ అంతంతమాత్రంగా ఉన్నాయి. గుర్తు పెట్టుకోవాల్సింది, గూజ్ బంప్స్ తెప్పించేది ఒక్కటీ లేదు. ఎడిటింగ్ కూడా ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. అవసరమైన సీన్లు టకటకా వెళ్లిపోయాయి. అనవసరమైన సీన్లు మాత్రం చాలాసేపు సా...గి విసిగించాయి. మొత్తంగా నేరేషన్ దెబ్బ తినడం వల్ల మిగతా టెక్నికాలిటీస్ కూడా దెబ్బ తిన్నాయి. ఐదు భాగాల నవలని రెండు భాగాల సినిమాగా మలచడంలో టీమ్ ఇబ్బంది పడిందనే విషయం సినిమా చూస్తే అర్థమైపోతోంది. టేకింగ్‌లోనూ మణి స్టైల్ మిస్సవడంతో మ్యాజిక్ జరిగే అవకాశమే లేకుండా పోయింది. సెకెండ్ పార్ట్ కోసం ఎదురు చూడాలనే ఆసక్తిని మొదటి పార్ట్ లేకుండా చేసింది.
కొసమెరుపు: పొన్నియిన్ సెల్వన్.. నిరాశే మిగిలెన్
నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయం రవి, కార్తి, త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్యలక్ష్మి, శరత్ కుమార్ తదితరులు
మాటలు: తనికెళ్ల భరణి
సినిమాటోగ్రఫీ: రవివర్మన్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాణం: మణిరత్నం, సుభాస్కరన్
దర్శకత్వం: మణిరత్నం