ఈసారి కప్ పోర్చుగల్‌దే.. రొనాల్డో కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు.. మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్యం

ఈసారి కప్ పోర్చుగల్‌దే.. రొనాల్డో కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు.. మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్యం

Cristiano Ronaldo: ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026 ప్రారంభమై ఆరు రోజులు గడుస్తున్నా.. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లతోనే టోర్నీ అప్పుడే హీటెక్కిపోయింది. ఈరోజు (జూన్ 17) ఉదయం జరిగిన మెగా ఫైట్‌లో అల్జీరియాపై అర్జెంటీనా 3–0 తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టడం, 39 ఏళ్ల వయసులోనూ లియోనెల్ మెస్సీ కెరీర్‌లోనే చారిత్రాత్మక హ్యాట్రిక్ గోల్స్ సాధించడం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. మెస్సీ ఫామ్ చూస్తుంటే అర్జెంటీనా వరుసగా రెండోసారి కప్ కొట్టేలా ఉందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. 

కప్ కొట్టాలనే కసితో కనిపిస్తున్న రోనాల్డో: 
మరోవైపు, మెస్సీ 2022లో చేసినట్లే.. తన కెరీర్‌లో ఇప్పటి వరకు అందుకోలేకపోయిన ఏకైక వరల్డ్ కప్ ట్రోఫీని ఈసారి ఎలాగైనా ముద్దాడాలని పోర్చుగల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో కసితో ఉన్నాడు. డీఆర్ కాంగో (DR Congo) తో పోర్చుగల్ తన ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్న తరుణంలో.. రొనాల్డో వరల్డ్ కప్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయనే దానిపై ఇంగ్లాండ్ మాజీ ఫుట్‌బాలర్, ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ పాల్ మేస్‌ఫీల్డ్ (Paul Masefield) కొన్ని క్రేజీ కామెంట్స్ చేశాడు. 

రొనాల్డో కోసం వాళ్ళు ప్రాణం పెడతారు: 
జీ (Zee)5 ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరిస్తున్న పాల్ మేస్‌ఫీల్డ్ స్పోర్ట్స్ నౌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి కప్ కొట్టేది పోర్చుగలేనని తేల్చి చెప్పాడు. పోర్చుగల్ టీమ్‌ను పేపర్‌పై చూస్తే అటాకింగ్, డిఫెండింగ్, టాలెంట్.. ఇలా అన్నింట్లోనూ వన్ ఆఫ్ ది బెస్ట్ సైడ్‌గా కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం అర్జెంటీనా ప్లేయర్లు మెస్సీ కోసం ఎలాగైతే ప్రాణం పెట్టి కప్ గెలిపించారో.. ఇప్పుడు పోర్చుగల్ టీమ్ కూడా రొనాల్డో కోసం అదే చేయబోతోంది. రొనాల్డో ట్రోఫీ క్యాబినెట్‌లో లేని ఆ ఒక్క వరల్డ్ కప్ కప్‌ను ఎలాగైనా చేర్చడానికి టీమ్ మొత్తం అతడిని ముందుకు నడిపిస్తుంది. గత 25 ఏళ్లుగా ఫుట్‌బాల్‌కు అతనొక అద్భుతమైన అంబాసిడర్.. నేనైతే పక్కాగా చెప్తున్నా.. ఈసారి పోర్చుగల్ వరల్డ్ కప్ గెలవబోతోందని మేస్‌ఫీల్డ్ జోస్యం చెప్పాడు.

స్పెయిన్‌కు కేప్ వర్దె షాక్: 
టోర్నీలో ఒక ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. వరల్డ్ కప్ ఆడుతున్న రెండో అతిచిన్న దేశమైన కేప్ వర్దె (Cape Verde), మాజీ యూరోపియన్ ఛాంపియన్స్ అండ్ హాట్ ఫేవరెట్ అయిన స్పెయిన్ జట్టును 0–0తో డ్రా చేసి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ డెబ్యూ టీమ్ ఆడిన ఆటకు మేస్‌ఫీల్డ్ ఫిదా అయిపోయాడు. 2002 వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్‌ను సెనెగల్ ఓడించిన తర్వాత.. ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద అప్‌సెట్ అని కొనియాడాడు.

►ALSO READ | 3 గోల్స్‌తో మెస్సీ మ్యాజిక్.. మమ్మల్ని ఆపడం అంత ఈజీ కాదు.. ప్రత్యర్థులకు కోచ్ స్కలోనీ స్ట్రాంగ్ మెసేజ్

క్యూరకో (Curaçao) లాగా కేప్ వర్దె కేవలం ఈవెంట్‌లో పాల్గొనడానికి రాలేదు, గెలవడానికే వచ్చింది. స్పెయిన్‌ వంటి తోపు టీమ్‌పై వాళ్ళు 6 షాట్లు కొట్టారంటే మామూలు విషయం కాదు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో 11 మంది వర్సెస్ 11 మంది ఆడతారు.. ప్రత్యర్థి టీమ్‌కు 99 శాతం బాల్ పొసెషన్ ఉన్నా పర్లేదు.. మనకు దొరికిన ఒక్క ఛాన్స్‌లో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపితే గేమ్ ఓవర్.. కేప్ వర్దె కేవలం నంబర్స్ కోసం ఇక్కడికి రాలేదని మేస్‌ఫీల్డ్ వెల్లడించారు. 

గోల్డెన్ బూట్ రేసులో జర్మనీ హీరో: 
ఈసారి వరల్డ్ కప్ లో ఎవరైనా సంచలనం సృష్టించవచ్చని పాల్ మేస్‌ఫీల్డ్ అభిప్రాయపడ్డాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఫ్రాన్స్, జపాన్‌తో 2–2తో డ్రా చేసుకున్న నెదర్లాండ్స్, క్యూరకోపై గెలిచిన జర్మనీ, ఈక్వెడార్‌ను 1–0తో ఓడించిన ఐవరీ కోస్ట్‌లు డేంజర్ టీమ్స్ అని హింట్ ఇచ్చాడు.

* గోల్డెన్ బూట్ రేస్: జర్మనీ ప్లేయర్ కై హవెర్ట్జ్ (Kai Havertz) గోల్డెన్ బూట్ రేసులో అందరికంటే ముందున్నాడని చెప్పాడు.

* ఆ స్వీడిష్ కుర్రాడు తోపు: స్వీడన్‌కు చెందిన యంగ్ మిడ్‌ఫీల్డర్ యాసిన్ అయారి (Yasin Ayari) ఆట తనను బాగా నచ్చిందని.. అతడు టాప్ క్లాస్ ప్లేయర్‌లా కనిపిస్తున్నాడని, నెక్స్ట్ మ్యాచుల్లో అతనిపై ఒక కన్నేసి ఉంచాలని సూచించాడు. కాగా ప్రతి ఒక్కరూ మెస్సీ, రొనాల్డో గురించే మాట్లాడుకుంటారు.. కానీ ఎక్కడి నుంచో ఒక కొత్త ముఖం వచ్చి టోర్నీపై కోలుకోలేని ఇంపాక్ట్ చూపిస్తే భలే ఉంటుంది కదా.. ఈ వరల్డ్ కప్‌లో అలాంటి సర్‌ప్రైజ్ పక్కాగా జరుగుతుందని పాల్ మేస్‌ఫీల్డ్ వెల్లడించారు.