
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ సహా మరి కొన్ని చోట్ల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అవినీతి అక్రమాలపై ఆరిజన్ మిల్క్ డైరీ పేరుతో పోస్టర్లు వెలిశాయి.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతిలో ఆర్థికంగా మోస పోయామని ఆరిజన్ డైరీ బాధితులు పోస్టర్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోరిక తీర్చడం కోసం అమ్మాయిలను పంపించాల్సి వచ్చిందని.. ఇదేంటని అడిగితే తమ మీద తప్పుడు కేసులు పెట్టి చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆడ పిల్లలలను ఆట బొమ్మలుగా చూస్తూ వారి జీవితాలతో ఆటలాడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటే బీఆర్ఎస్ మీద ప్రజల్లో నమ్మకం పోవడమే గాకుండా తీవ్రంగానష్టపోవాల్సి ఉంటుందని తెలిపారు.
స్కీమ్ ల పేరుతో స్కాంలు చేస్తూ పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను పక్కదారి పట్టిస్తూ అవినీతికి పాల్పడుతున్న వారికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే కామ వాంఛకు మరో సంస్థ బలి కాకుండా చూడాలన్నారు. దుర్గం చిన్నయ్య బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడాలని..తమకు న్యాయం చేయాలని కోరారు.