ఉద్రిక్తత నడుమ తల్లీకూతుళ్ల పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం

ఉద్రిక్తత నడుమ తల్లీకూతుళ్ల పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం
  •     యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ కాదు.. హత్య అంటూ కుమారి బంధువుల ఆందోళన
  •     మధ్యాహ్నం తర్వాత పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం నిర్వహణకు ఒప్పుకున్న కుటుంబ సభ్యులు 
  •     బందోబస్త్‌‌‌‌‌‌‌‌ మధ్య అంత్యక్రియలు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాలో మంగళవారం చనిపోయిన బోడ కుమారి, కృషిక, కృతిక పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం, అంత్యక్రియలు బుధవారం ఉద్రిక్తత నడుమ సాగాయి. కుమారి భర్త ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, భార్య పిల్లలను హత్య చేశారంటూ మృతుల బంధువులు ధర్నాకు దిగారు. భార్య, పిల్లల మృతదేహాలను చూసేందుకు ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ ఎందుకు రావడం లేదని, ప్రమాదం జరిగి ఉంటే చనిపోయిన వారి శరీరాలపై గాయాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కు అదే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కుమారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. ఇద్దరు ఆడపిల్లలే కావడంతో మగ పిల్లాడు లేడంటూ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ కుమారిని చిత్ర హింసలు పెట్టేవాడని, ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ కుటుంబ సభ్యులు బాధ్యత వహిస్తూ సంతకం చేస్తేనే పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టానికి అంగీకరిస్తామని పట్టుబట్టారు. 

ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ తరఫు కొందరు పెద్దమనుషులు వచ్చి రూ. 13 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకోవడంతో మధ్యాహ్నం తర్వాత మూడు మృతదేహాలకు పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం చేశారు. అనంతరం మృతదేహాలను తీసుకెళ్తున్న అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ను మరికొందరు అడ్డుకున్నారు. తర్వాత పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతదేహాలను ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ స్వగ్రామం రఘునాథపాలెం బావోజీతండాకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.