గాల్లో ఆలు పంట పండించిన్రు

గాల్లో ఆలు పంట పండించిన్రు

పొలం దున్ని, విత్తనాలు నాటి, పంట బాగా పెరగడానికి  ఎరువులు, రసాయనాలు చల్లుతుంటారు. పంట పండి చేతికొచ్చే వరకు చాలా కష్టపడుతుంటారు రైతులు. కానీ ఆ క​ష్టం లేకుండా... అంటే చేతికి మట్టి అంటకుండానే ఇకనుంచి పంటలు పండించొచ్చు అంటున్నారు హర్యానా, కర్నల్‌‌ జిల్లాలోని పొటాటో టెక్నాలజీ సెంటర్‌‌‌‌ సైంటిస్ట్‌‌లు. అదెలాగంటే! ఏరోఫోనిక్‌‌ ఫార్మింగ్‌‌తో. మామూలుగా చేసే వ్యవసాయానికి అయ్యే ఖర్చు కంటే ఏరోఫోనిక్‌‌లో అయ్యే ఖర్చు చాలా తక్కువ. ప్రస్తుతం పొటాటో టెక్నాలజీ సెంటర్ సైంటిస్ట్‌‌లు ఆలు గడ్డ సాగును ఈ పద్దతిలో చేసి సక్సెస్‌‌ అయ్యారు. 

ఏరోఫోనిక్ ఫార్మింగ్‌‌ అంటే..

పంట పండేందుకు అవసరమైన పోషకాలు ఎక్కువ శాతం మట్టి నుంచే వస్తాయి. కానీ,  ఏరోఫోనిక్‌‌ పద్ధతిలో మట్టి మాటే ఉండదు. ఏరోఫోనిక్‌‌ ఫార్మింగ్ ఎలా చేస్తారంటే.. గాలిలో వేర్లను వేలాడదీస్తూ మొక్కను ఒక క్లోజ్డ్‌‌ కంటైనర్‌‌‌‌లో పెంచుతారు. ఆ వేర్లకు నీళ్లను, కావాల్సిన పోషకాలను పిచికారీ చేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ఒక దానికింద ఒక ప్లేట్‌‌ చొప్పపున రెండు ప్లేట్స్‌‌ ఉంటాయి. ఆ  రెండింటి మధ్యలో నుంచి మొక్క పైకి, వేర్లు కిందికి పెరుగుతాయి. ప్లేట్‌‌ కింది భాగంలో రెండువైపులా చిన్న పైపులు ఉంటాయి. వాటి నుంచి నీళ్లు  వేర్లపై పిచికారీ అవుతాయి. అంటే భూమి నుంచి అందే పోషకాలు అన్నీ పిచికారీ ద్వారా మొక్కకు అందుతాయి. 

పది శాతం ఎక్కువ

ఈ టెక్నాలజీ సెటప్‌‌కు ఖర్చు ఎక్కువే అవుతుంది. దానికి తగ్గట్టే దిగుబడి కూడా వస్తుంది. అంటే దాదాపు పది శాతం దిగుబడి పెరుగుతుంది. ఇవి నీళ్లు, పోషకాలను తక్కువ తీసుకుంటాయి. దానివల్ల వ్యవసాయ ఖర్చు బాగా తగ్గిపోతుంది. దీంతో రైతులు మంచి లాభాలు పొందొచ్చు.

‘ఏరోఫోనిక్ వ్యవసాయం ద్వారా మంచి పంట దిగుబడి వస్తుంది. ప్రస్తుతానికి కంద, ఆలు, క్యారెట్‌‌, బీట్‌‌రూట్‌‌ వంటి పంటలనే ఏరోపోనిక్ పద్ధతిలో పండించాం. ఇదే ప్రయోగాన్ని వేరే పంటల పైన కూడా చేయాలి. అందులోనూ విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది.  ఈ పద్ధతి పైన వేరే రాష్ట్రాల  రైతులకు కూడా అవగాహన కల్పిస్తాం. దీనివల్ల కలిగే లాభాలను వివరించి ఏరోఫోనిక్‌‌ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం’ అని ఏరోఫోనిక్ సైంటిస్ట్‌‌ అనిల్ తడాని చెప్పాడు.