పొత్తూరి సుబ్బారావు ‘సుమ సోయగాలు’లో ఎటు చూసినా పువ్వులే

పొత్తూరి సుబ్బారావు ‘సుమ సోయగాలు’లో ఎటు చూసినా పువ్వులే

పొత్తూరి సుబ్బారావు ‘సుమ సోయగాలు’లో ఎటు చూసినా పువ్వులే. పుస్తకం తెరవగానే మరుమల్లెల పరిమళాలు, గులాబీల గుబాళింపులు, కనకాంబర సంబరాలు, చామంతుల విలాసాలు, విరజాజుల వయ్యారాలు, ఎర్రని మందారాలు అగుపిస్తాయి.  మల్లెలు... వసంత గానానికి బాణీలు కట్టి సరికొత్త రాగాలు తీస్తాయి. లిల్లీల నయనానందకర దృశ్యాలు జీవన రాగాల నాలపిస్తాయి. గడ్డిపూలు పాదచారులకు తమ తలలనూపుతూ స్వాగత వచనాలు పలుకుతాయి. దిల్బహార్ పూలు హృదయమంతా స్వచ్ఛతతో నింపుతాయి. గుల్​మొహర్ పూలు దిల్​ను జరూర్​గా ఖుష్ చేస్తాయి. మెట్ట తామరలు సౌందర్యోపాసకులను ఆనంద డోలికల్లో తేలియాడిస్తాయి. 

డాలియా పువ్వులు అరచేతి పరిమాణంలో అందమైన ఆకృతిలో కొలువు దీరుతాయి. రామబాణం పూలు లక్షణంగా మనసుకు హత్తుకుపోతాయి. జాజిపూలు ఆలుమగల విరాగగానానికి సరాగ బాణీలు కట్టి ఇరువురిలో కాంక్షల వెల్లువను ప్రవహింపజేస్తాయి. ఇంతులు ముళ్ల గోరింటపూల చెంతకెళితే చాలు తుంచి సిగలోన ముడుచుకొమ్మంటాయి. ఇల్లు సంపెంగల సరాగాలకు తావిస్తే అనురాగాల హరివిల్లవుతుంది. గులాబీ అనే పేరే ఒక రంగుగా అవతరించడం గులాబీదెంత భాగ్యం ! వుడ్​రోజ్​ గులాబికి పోటీగా పూసే పువ్వా అనిపిస్తుంది. తంగేడు తెలంగాణ రాష్ట్ర పుష్పమై విలసిల్లుతోంది. నిద్రగన్నేరు మహారాష్ట్రకు అధికార పుష్పంగా విరాజిల్లుతోంది.

కొన్ని పూలు వింత గొలుపుతాయి. అత్తిపత్తి పూలు ముట్టుకోబోతే ముడుచుకుంటాయి, ఆకుతో సహా అందాలను దాచుకుంటాయి. “పొన్షిటియా పూల సరాగాలు / ఆకులే పువ్వులుగా మారే / వింతైన రూప వైచిత్రులవి”. చెంగల్వ “నయనాలకు విందైనంత మాత్రాన / అందాన్ని ఛిద్రము చేయనెంచితే / అదే చురకత్తై పొడుచుకుంటుంది”. అసలు – పూల ప్రాధాన్యం లేనిదెక్కడ? పూలు ఆలయంలోని దేవుళ్లకు అర్పితమౌతాయి. అత్తరు భాయీలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మగువల అందాలను ఇనుమడింపజేస్తాయి. అందాలు చిందిస్తాయి. మకరందాన్ని అందిస్తాయి. తేనెటీగలను ఆహ్వానిస్తాయి. ప్రేమకానుకలవుతాయి. గుమ్మాలకు పండుగ తోరణాలౌతాయి. వాకిటి ముగ్గులపై రేకలవుతాయి. బతుకమ్మలుగా పేర్చబడుతాయి. పరిసరాలకు వన్నె తెస్తాయి. పర్యావరణానికి విందు చేస్తాయి. పూలగానం అలలు అలలై చెవులకు సోకుతూనే ఉంటుంది. “గాలి తరంగాలలో / అలలు అలలుగా వ్యాపించే /పూల పరిమళాలను / ఆఘ్రాణించట మొక భాగ్యం”. కొమ్మలూ రెమ్మలూ విరిసిన కుసుమాలతో కళకళలాడుతాయి. కోసిన పూలను రాశులుగా పోస్తే అవి కూడ అందాల కుప్పలే.

పూలజడ నుండి వచ్చే సువాసనలు మనిషిలోని జడత్వాన్ని తరిమివేస్తాయి. పూలదండ దేవుని విగ్రహాన్ని అలంకరిస్తుంది. వీధిలోని నాయకుని మెడలోనూ వాలుతుంది. రాకుమారి స్వయంవరంలో వీరుని కంఠాన్ని అలంకరిస్తుంది. విజయాన్ని వరించిన ధీరుడ్నైనా తనకు తలను వంచేలా చేస్తుంది. దండలు మార్చుకున్న వధూవరులకు పూలదండ తనలో ఇమిడిన రకరకాల పూలవోలె కలిసి వుండే వంతు.. మీదని సందేశమిస్తుంది. ప్రముఖులకు సత్కారమౌతుంది. పార్థివ దేహంపై ఉండి కడదాకా సాగనంపుతుంది. కొప్పుల్లో అర్ధచంద్రాకారమై సాక్షాత్కరించే పూల చెండు ఎదలెన్నింటినో ఆనందనందనం కావిస్తుంది. వధూవరులు పెళ్లిలో పూలచెండుతో బంతులాడుతారు.

“సంప్రదాయంతో వెలిగే పూలసజ్జ / పర్యావరణానికి అల్లుకుపోయే స్నేహలత”. గోడకో, కర్రకో, డాబాపైకి... “ఆసరా ఇచ్చేదేదైనా / దానినే నమ్ముకొని / పూలతీగె ముందుకు సాగుతుంది. కాని / మనుషుల్లాగా అందల మెక్కించిన వారినే / అణగదొక్కే ప్రయత్నం చేయదు” అంటూ సామాజికతనూ జోడిస్తాడీ కవి. ఇందులో పూలసోయగాలే కాదు. పొత్తూరి సుబ్బారావు కవిత్వ సొగసులూ ఉన్నాయి. ముద్ద చేమంతులను చూసి “రెమ్మ రెమ్మకూ నక్షత్రాలు పూసాయేమిటంటూ ఆకాశంలోని తారలు నివ్వెరపడతాయి”, “పొద్దుగుంకినా వాడని హోలీపూల అందాలకు తరించి చంద్రుడు కన్నుగీటుతుంటాడు”, “జాబిలి కిరణాలే వికసిత కలువల నేస్తాలు”, “పొగడ పూల పరవశాన్ని పొగడగ పదములు చాలవు”, “పెళ్లికూతురు తెల్లచీర కట్టుకున్నట్లు / ఎల్లవేళలా / ఆకుపచ్చని నందివర్ధనం చెట్టు / తెల్లని పూలను తొడుక్కొని / నిత్య పెళ్లికూతురిలా అగుపిస్తుంది”. పూలను చూసేటప్పుడు ఈ కవిది సునిశిత దృష్టి... “విప్పారిన మందారపు నాభి / పుప్పొడిని నిలబెట్టే ఊతాన్ని / తనలో ఇముడ్చుకొని / పూలకే ఒక కొత్త శోభను సంతరింప జేస్తుంది’’ అంటాడు.

ఈ రచయిత పూలకూ వైద్యానికీ గల సంబంధాన్ని చెప్తాడు. సంపెంగ లందించే తైలం కేశాలకు ఆరోగ్య ప్రదాయిని. ఉమ్మెత్త పూవు ఆస్తమాకు అద్భుతంగా పనిచేస్తుందనగానే, పోతున్న ఊపిరులు తేరుకుంటాయి. గునుగు పూల నుసి గాయాలను గాయబ్ చేసే ఔషధం. నందివర్ధనం పూలరసం కంటిచూపుకు, చర్మవ్యాధులకు ఔషధం. విప్పపూలు కీళ్ల నొప్పులకు ఔషధమై, చర్మ రక్షణకు తైలమై, సబ్బుల, కొవ్వొత్తుల తయారీలో భాగస్వాములవుతాయి. వేపపువ్వు పిత్త, వాత, కఫాలను తొలగించే దివ్యౌషధం.

“మనిషి జీవించినంత కాలమే రూపలావణ్యం”, “సహజత్వం ముందెప్పుడూ కృత్రిమత్వం దిగుదుడుపే” మొదలైన పంక్తులు ఇందులోని మంచి సూక్తులు. పూలను వస్తువుగా గ్రహించి, పుస్తకమంతా నింపి, మనిషికీ పూలకూ ఉన్న బంధాన్ని చెప్పి, పాఠకుల ఎదల నిండా పూల పరిమళాన్ని వ్యాపింపజేసిన పొత్తూరి సుబ్బారావు అభినందనీయుడు.

- ఎ. గజేందర్ రెడ్డి,
 9848894086