కోళ్ల పెంపకం చార్జీలు పెంచాలి

కోళ్ల పెంపకం చార్జీలు పెంచాలి
  • గ్రోయింగ్​ చార్జీలు పెంచే దాకా కోళ్లు పెంచం
  • కార్పొరేట్​ కంపెనీలకు తేల్చిచెప్పిన పౌల్ట్రీ రైతులు
  • చికెన్​ ధరలపై ఎఫెక్ట్‌‌!

కోడి పిల్లలను దించుకోబోమని రైతులు ప్రకటించినందున ఆ ప్రభావం చికెన్​ ధరలపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్‌‌లో కిలో చికెన్​  రూ.300 వరకు పలుకుతున్నది. తాజాగా పెంపకం నిలిపివేస్తుండడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు అంటున్నాయి. 


హైదరాబాద్‌‌ : కోళ్ల పెంపకం చార్జీలు పెంచాలనే డిమాండ్‌‌తో రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లను ఎన్నిసార్లు కార్పొరేట్​ కంపెనీల దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పౌల్ట్రీ షట్​​డౌన్​కు నిర్ణయం తీసుకున్నారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని నిలిపివేయాలని, కంపెనీల కోడి పిల్లలను దించుకోవద్దని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్‌‌ విధానంతో కార్పొరేట్​ కంపెనీలు తమ పొట్టకొడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే 1 నుంచే ఆందోళనకు పిలుపునిచ్చినప్పటికీ.. ఇప్పుడు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. గత 25 రోజుల నుంచి ఇప్పటి వరకు దాదాపు కోటి వరకు కోడి పిల్లల (చిక్స్)ను దించుకోవడం ఆగిపోయినట్లు తెలుస్తున్నది. శుక్రవారం నుంచి జనగామ జిల్లాలో పౌల్ట్రీ రైతులు కూడా కోడి పిల్లలను దించుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. గ్రోయింగ్‌‌ చార్జీలను కిలోకు రూ.10 నుంచి 12 వరకు చెల్లించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.  

 

ఏ మూలకూ సరిపోని గ్రోయింగ్​ చార్జీలు
గతంలో పౌల్ట్రీ రైతులు సొంత ఖర్చుతో స్వయంగా కోళ్లను పెంచి, మార్కెట్లో హోల్ సేల్​కు అమ్ముకునేవారు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. కోడి పిల్లలను, దాణాను, మందులను రైతులకు అందించి , వాటిని పెంచినందుకు కిలోకు రూ. 4.50 గ్రోయింగ్ చార్జీగా చెల్లిస్తున్నాయి. మొదట్లో రైతు చెప్పిన ధరకు కోళ్లను కొని మార్కెటింగ్ చేసిన వ్యాపారులు, క్రమంగా మార్కెట్ పై పట్టు సాధించి హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయారు. కార్పొరేట్ శక్తులు కోళ్ల పరిశ్రమలను గుప్పిట్లో పెట్టుకుని హోల్​సెల్ , రిటైల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. కార్పొరేట్‌‌‌‌ కంపెనీలు అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌‌‌‌ విధానంతో పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారు. కోళ్లను పెంచేందుకు రైతులకు కంపెనీలు చిక్స్‌‌‌‌, ఫీడ్‌‌‌‌, మెడిసిన్స్‌‌‌‌  సరఫరా చేస్తున్నాయి. గ్రోయింగ్‌‌‌‌ చార్జీల రూపంలో  కిలోకు రూ.4.50 చెల్లిస్తున్నప్పటికీ కోళ్లకు దాణా ఎక్కువ ఫీడ్‌‌‌‌ చేసినా, ఎక్కువ మెడిసిన్స్‌‌‌‌ ఇచ్చినా, కోళ్లు నిర్ణీత వెయిట్‌‌‌‌ రాక పోయినా ఆ లాస్‌‌‌‌ను రైతులపైనే కంపెనీలు మోపుతున్నాయి. మార్కెట్‌‌‌‌లో కిలో చికెన్‌‌‌‌ ధర రూ. 300 పలికినా రైతులకు రూ. 4.50కు మించడం లేదు. ఒక్కోసారి అవి కూడా రావడం లేదు. మెయింటెనెన్స్‌‌‌‌ ధరలు పెరిగిపోయాయని, కంపెనీలు ఇచ్చే గ్రోయింగ్​ చార్జీలు ఏ మూలకూ సరిపోవడం లేదని రైతులు అంటున్నారు.  

 

రైతుల డిమాండ్స్‌‌‌‌ ఇవే..

  • గ్రోయింగ్​ చార్జీ కిలోకు రూ.12 ఇవ్వాలి.
  • బ్యాచ్​ ఫెయిల్‌‌‌‌ అయిన రైతులకు కనీసం 
  • కిలోకు రూ.8 చొప్పున చెల్లించాలి.
  • ప్రతి బ్యాచ్‌‌‌‌కు 70% మేల్‌‌‌‌ చిక్స్‌‌‌‌, 30% ఫీమేల్‌‌‌‌ చిక్స్‌‌‌‌ సరఫరా చేయాలి.
  • అనుభవమున్న సూపర్‌‌‌‌వైజర్లను నియమించాలె.
  • 40 నుంచి 45 రోజుల్లోపు లిఫ్టింగ్‌‌‌‌ పూర్తిచేయాలి.
  • ఫామ్‌‌‌‌ రేట్‌‌‌‌ ధర రూ.110 మించితే ఆ తర్వాత వచ్చే లాభంలో రైతుకు 50% చెల్లించాలి.
  • వేసవిలో కోడికి రూ.2 అదనంగా చెల్లించాలి.
  • నాణ్యమైన దాణా అందించాలి. సంచి పైన సోయా, మక్కలు, ఇతర పోషకాలు ఏవేవి ఎంత శాతం కలుపుతున్నారో ముద్రించాలి.
  • అనుభవం కలిగిన డాక్టర్లతో వారానికి ఒకసారి పర్యవేక్షణ చేయించాలి. 

బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నం
బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కొందరు.. ఆస్తులను అమ్మి కొందరు కోళ్ల ఫారాలు మొదలుపెట్టారు. మొదట్లో సొంతంగా కోళ్లను పెంచుకోవడం, మార్కెటింగ్‌‌‌‌  చేసుకోవడం వల్ల కొంత లాభసాటిగా ఉండేది. కొన్నేళ్లుగా కార్పొరేట్లు ఇంటిగ్రేటెడ్‌‌‌‌ విధానం తెచ్చాయి. మెజారిటీ రైతులు ఈ విధానం ద్వారానే కోళ్లను పెంచుతున్నారు. పెరిగిన వ్యయంతో గ్రోయింగ్ చార్జీలు  ఏమాత్రం సరిపోతలేవు. ఏండ్ల తరబడి గ్రోయించ్‌‌‌‌ చార్జీలు పెంచడం లేదు. దీంతో బ్యాంకుల లోన్లు కట్టలేకపోతున్నామని సిద్దిపేట జిల్లాకు చెందిన పౌల్ట్రీ రైతు వంగ కిరణ్‌‌‌‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం : -
ఎస్సీ వర్గీకరణ కోసమే మాదిగ సంగ్రామ యాత్ర

ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు