కరెంట్ కోతలు.. ఎండిన పంటలు..

కరెంట్ కోతలు.. ఎండిన పంటలు..

 

  • కాంగ్రెస్ పాలనలో రైతుల గోస : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట టౌన్, వెలుగు : 'రేవంత్ రెడ్డి హామీలన్నీ ఎగవేతలే, రుణమాఫీ, రైతుబంధు ఎగ్గొట్టి దేవుడి పేరిట మోసం చేశారు' అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఆదివారం పట్టణంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీశ్ రావు హాజరై మాట్లాడారు. 

ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తానని సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద కొమురవెల్లి మల్లన్నపై ఒట్టు వేసిన రేవంత్ రెడ్డి... జిల్లాలో 60 శాతం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని ఆరోపించారు. 45 రోజుల్లో రైతుబంధు వేస్తామని నర్మెట సభలో చెప్పినా 200 రోజులు దాటినా అతీగతీ లేదన్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాస్తా ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు.

 కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ నిలో ప్రభావం వల్ల కరువు వచ్చిందని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. 

బొగ్గు నిల్వ చేసుకోలేక, థర్మల్ కేంద్రాలు నడపలేకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని, కాళేశ్వరం, దేవాదుల, కల్వకుర్తి మోటార్లు సరిగ్గా నడపకపోవడం వల్లే చెరువులు, రిజర్వాయర్లు ఎండిపోయి రైతులు గోసపడుతున్నారని మండిపడ్డారు. 

సిద్దిపేటపై కక్ష సాధిస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన సిద్దిపేట గడ్డపై నుంచే కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం ప్రారంభమవుతుందని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

అనంతరం బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సర్ పేరిట ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో యువత శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కర్ఫ్యూ విధించడం, రైల్వే, మెట్రో, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింల కోసం చేసిందేమీ లేదన్నారు.

 కార్యక్రమంలోఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీశ్ కుమార్, వొంటేరు ప్రతాప్ రెడ్డి , వెంకట్రామిరెడ్డి, సంపూర్ణేశ్ బాబు పాల్గొన్నారు.