కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నడుమ ‘పవర్’వార్.. నల్గొండ వేదికగా మాటల యుద్ధం

కాంగ్రెస్​, బీఆర్ఎస్​ నడుమ ‘పవర్’వార్.. నల్గొండ వేదికగా మాటల యుద్ధం
  • కాంగ్రెస్  మళ్లీ వస్తే అంధకారమే అని మంత్రుల సెటైర్లు
  • ఆ  పార్టీ నేతలు కరెంట్​ తీగలు పట్టుకోవాలని సవాళ్లు
  • ఎత్తుకెళ్లిన లాగ్​బుక్​లు పట్టుకరావాలని ఎంపీ వెంకట్ రెడ్డి ఎద్దేవా
  • త్రీ ఫేజ్ కరెంట్  వివరాలు ఎంటర్  చేయాలని ఎంపీ ప్రతి సవాలు

నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నేతల మధ్య కరెంట్​ వార్​ నడుస్తున్నది. నల్గొండ జిల్లా వేదికగా మంత్రులు కేటీఆర్, హారీశ్​రావు, జగదీశ్​ రెడ్డి  ఇటీవల కాంగ్రెస్​ నేతలే లక్ష్యంగా నిప్పులు చెరిగారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్​ స్కీంను రద్దు చేస్తారని, ప్రజలు మళ్లీ అంధకారంలోకి వెళ్లే రోజులు వస్తాయని విమర్శించారు. ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని మంత్రులు కేటీఆర్, హరీశ్ ​ చేసిన కామెంట్లు రాజకీయంగా పెద్ద దుమారం లేపాయి.

లాగ్​బుక్స్​తనిఖీలతో మొదలైన లొల్లి..

జూలై 12న ఎంపీ కోమటిరెడ్డి భువనగిరి మండలం బండసోమారం సబ్​స్టేషన్​ను సందర్శించి 24 గంటల ఉచిత విద్యుత్​ బండారాన్ని ఆధారాలతో బయటపెట్టారు.  వ్యవసాయానికి 11 గంటలకు మించి కరెంట్​ ఇవ్వట్లేదని, అది కూడా విడతల వారీగా సప్లై చేస్తున్నారని, సబ్​ స్టేషన్​లోని లాగ్​బుక్స్​ల ద్వారా ఈ విషయం తెలుస్తోందని కోమటిరెడ్డి మీడియాతో చెప్పారు. దీంతో అప్రమత్తమైన సర్కారు..​ హుటాహుటిన రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్​స్టే షన్లలో ఉన్న లాగ్​బుక్స్ ను మాయం చేసింది. 24 గంటల కరెంట్​పై సర్కారు​నిజస్వరూపం బయటపడటంతో మంత్రులు దిద్దుబాటు చర్యలకు దిగారు. నియోజకవర్గాల్లో ప్రగతి నివేదన సభల్లో పాల్గొంటున్న మంత్రులు తమ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నదని పదేపదే చెప్పుకుంటున్నారు. ఇటీవల నల్గొండ, సూర్యాపేట జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేసిన కేటీఆర్, హరీశ్ ​రావు కరెంట్​ గురించే పోటాపోటీగా మాట్లాడారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న మీటింగుల్లోనూ ఇదే విషయం మాట్లాడుతున్నారు.  కాంగ్రెస్​ నేతలు గ్రామాల్లోకి వెళ్లి కరెంట్​ తీగలు పట్టుకోవాలని, అప్పుడు 24 గంటల కరెంట్ ఉందో లేదో తెలుస్తదని సవాల్ విసురుతున్నారు.

మా పాలనలోనే ఉచిత విద్యుత్​: కాంగ్రెస్​

బీఆర్ఎస్​మంత్రుల సవాళ్లకు కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో కౌంటర్​ఇస్తున్నారు. తన సర్​ప్రైజ్​ విజిట్​తో లాగ్ బుక్​లు ఎత్తికెళ్లిన సర్కారు.. మళ్లీ వాటిని సబ్​ స్టేషన్​లో పెట్టేందుకు ధైర్యం చేయట్లేదని ఎంపీ కోమటిరెడ్డి ఇటీవల ఎద్దేవా చేశారు. దమ్ముంటే అన్ని స్టేషన్​లో లాగ్ బుక్​లు తెచ్చి పెట్టాలని, త్రీఫేజ్​ కరెంట్​ సప్లై వివరాలు ఎంటర్​ చేయాలని ఆయన చాలెంజ్​విసిరారు. సింగిల్ ఫేజ్ గురించి తాను ప్రస్తావించ లేదని, 24 గంటల కరెంట్ వస్తుందన్న నమ్మకంతో కౌలు రౌతులు సైతం భూములు కౌలుకు తీసుకుని నష్టపోయారని, నల్గొండ జిల్లాతోపాటు కరీంనగర్​ జిల్లాల నుంచి కూడా రైతులు కాల్స్​ చేస్తున్నారని ఆయన చెప్పారు.మరోవైపు ఉమ్మడి ఏపీలో ఉచిత విద్యుత్​ స్కీంను ప్రవేశపెట్టింది తమ  ప్రభుత్వమే అని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు.  వైఎస్​ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యుత్​ బకాయిలు మాఫీ చేయడమే కాకుండా వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్​  స్కీంను ప్రవేశపెట్టామని, ఆ తర్వాత దానిని 9 గంటలకు పెంచామని గుర్తుచేస్తున్నారు.  తమ పాలనలోనే ప్రతి గ్రామంలోనూ సబ్​ స్టేషన్​ ఏర్పాటైందని, తెలంగాణ వచ్చాక పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ రేటుకు విద్యుత్​ కొని కరెంట్​ సప్లై చేస్తున్నారని, దీంట్లో సీఎం కేసీఆర్​ సాధించిన ఘనత ఏమీ లేదని విమర్శిస్తున్నారు.  

ఏ గ్రామానికైనా వెళ్లి తీగలు పట్టుకోండి

మేమే ఖర్చులు భరిస్తం. వాహనాలు ఏర్పాటు చేస్తం. కాంగ్రెస్​లో మంచి మంచి నాయకులు అందరూ కలిసి రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్లి కరెంట్​ తీగలు పట్టుకోండి. దెబ్బకు దేశానికి పట్టిన దరిద్రం పోతది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల జీవితం అంధకారం అవుతది. మళ్లీ మూడు గంటల కరెంటే దిక్కవుతది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మైండ్​ దొబ్బింది. అందుకే కరెంట్​పై అనవసరమైన కామెంట్లు చేస్తున్నడు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్​ పవర్​ ప్లాంట్​ మూసేస్తామని అంటున్నడు. కేసీఆర్​ పాలనలో కరెంట్​ పోతే వార్త. కాంగ్రెస్​ పాలనలో కరెంట్​ వస్తే వార్త. దేశంలో రైతులకు ఉచిత కరెంట్  ఇచ్చేది మా ప్రభుత్వమే. - కేటీఆర్, ఐటీ మంత్రి

కరెంటు తీగలు పట్టుకునేందుకు నేను రెడీ

గ్రామాల్లోకి వెళ్లి కరెంట్​ తీగలు పట్టుకునేందుకు నేను సిద్ధం. అంతకు ముందు 70 ఏళ్లుగా సబ్​ స్టేషన్​లో మెయింటెన్​ చేస్తున్న లాగ్​ బుక్​లను ప్రభుత్వం ఎందుకు ఎత్తుకెళ్లిపోయిందో చెప్పాలి. మళ్లీ వాటిన్నింటినీ సబ్​ స్టేషన్లకు తెప్పించి అవుట్​ గోయింగ్​ ఎంత, సింగిల్​ ఫేజ్, త్రీ ఫేజ్​ కరెంట్​ ఎంత వస్తుందో రికార్డు చేయాలి. అప్పుడు కేటీఆర్​ సవాల్​ను స్వీకరిస్తా. వ్యవసాయానికి 24 గంటల కరెంట్  వస్తున్నదని రుజువైతే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తా. ఇప్పటికీ చాలెంజ్​ చేస్తున్నా. 10 గంటలకు మించి కరెంట్  రావట్లే. అది కూడా మూడు గంటలకోసారి కట్  చేస్తున్నరు. 24 గంటల కరెంట్​ రాలేదని తేలితే కేటీఆర్  కూడా రాజీనామా చేయాలి. ఇద్దరం మళ్లీ పోటీ చేస్తాం. ఇక యాదాద్రి థర్మల్​ పవర్​ ప్లాంట్​ నేను మూస్తేస్తా అని చెప్పలే. ప్లాంట్​లో మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్​రావు టెండర్లు లేకుండా రూ.4, 5 వేల కోట్ల పనులను కమీషన్లకు అమ్ముకున్నరు. ఈ ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తా. ప్లాంటులో స్థానికులకు ఉద్యోగాలు ఇయ్యలే. రైతులకు పరిహారమూ చెల్లించలే. పదేళ్లయినా ప్లాంటు​ పూర్తికాలేదు. రూ.30 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లకు అంచనాలు పెంచిర్రు. ప్లాంటులో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తా అని చెప్పిన.