సీషెల్స్‌లో భారీ పేలుడు.. 100 మందికి పైగా గాయాలు

సీషెల్స్‌లో భారీ పేలుడు.. 100 మందికి పైగా గాయాలు

చిన్న ద్వీప దేశమైన సీషెల్స్‌లో పేలుడు పదార్థాల డిపోలో భారీ పేలుడు సంభవించింది, ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. దేశంలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే ఘోరమైన వరదల మధ్య డిసెంబర్ 7న అత్యవసర పరిస్థితిని జారీ చేశారు. వరదల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు సీషెల్స్ ప్రెసిడెంట్ వేవెల్ రాంకలవాన్ తెలిపారు.

సీషెల్స్ రాజధాని విక్టోరియాకు సమీపంలోని ప్రొవిడెన్స్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దెబ్బకు సమీపంలోని భవనాలు, చెట్లు ధ్వంసమయ్యాయి. పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ ఈ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు. ప్రెసిడెంట్ ప్రకారం, దేశంలో వరదలు విధ్వంసం కలిగించగా.. పేలుడు భారీ నష్టాన్ని మిగిల్చింది. పేలుడు పదార్థాలతో కూడిన నాలుగు కంటైనర్లు పేలుడుకు కారణమయ్యాయని, నిర్మాణ సంస్థ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామని రామ్‌కళవాన్ చెప్పారు. ప్రస్తుతానికి నిజంగా ఏం జరిగిందో తమకు తెలియడం లేదని, ఇది చాలా పెద్ద పేలుడని అన్నారు. ఈ పేలుడులో ఎటువంటి మరణాలు నమోదు కాలేదని.. ఇది ఒక విపత్తులా సంభవించిందని.. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని మంత్రి జీన్-ఫ్రాంకోయిస్ ఫెరారీ అన్నారు.

దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిలో భాగంగా, అన్ని పాఠశాలలను మూసివేయాలని, ప్రజలు తమ ఇళ్లలో ఉండాలని అధికారులు ఆదేశించారు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందని, భద్రతా కారణాల దృష్ట్యా చాలా కుటుంబాలు ఇప్పటికే తమ ఇళ్లను విడిచిపెట్టాయని సీషెల్స్ ప్రెసిడెంట్ చెప్పారు. ప్రొవిడెన్స్‌లో జరిగిన పేలుడు పరిణామాలను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఈ పేలుడులో కనీసం దాదాపు 125మంది గాయపడ్డారని ఆయన తెలిపారు.