ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్​రావు ఏ1

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్​రావు ఏ1
  • గత బీఆర్​ఎస్​ సర్కార్​లో ఇంటెలిజెన్స్​ చీఫ్​గా బాధ్యతలు
  • ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్​ వెనుక ఈయనే కీలకం
  • రేవంత్​, ఆయన కుటుంబసభ్యుల ఇండ్ల చుట్టూ ట్యాపింగ్​ సెంటర్లు పెట్టి నిఘా
  • ప్రభాకర్​రావు చెప్తేనే ఫోన్లు ట్యాప్​ చేశామన్న ప్రణీత్​రావు, భుజంగరావు, తిరుపతన్న
  • ఆయన ఆదేశాలతోనే హార్డ్​ డిస్కులు, ట్యాపింగ్​ డివైజ్​లను ధ్వంసం చేసినట్లు వెల్లడి
  • కేసులో ఏ2గా ప్రణీత్​రావు, ఏ3గా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు
  • పరారీలో ప్రభాకర్​రావు, రాధాకిషన్​రావు.. లుకౌట్​ సర్క్యూలర్​ జారీ
  • భుజంగరావు, తిరుపతన్నకు 14రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది ఒక్కటొకటిగా తేలుతున్నది. పోలీసుల కస్టడీలో ఉన్న ఎస్ఐబీ (స్పెషల్​ ఇంటెలిజెన్స్​ బ్రాంచ్) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు విచారణలో గుట్టు బయట పెడుతున్నాడు. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్​గా గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్​ చీఫ్​ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పాడు. దీంతో ప్రభాకర్​రావును కేసులో ప్రధాన నిందితుడి(ఏ1)గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు.


ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారమంతా ప్రభాకర్​రావు దగ్గరుండి నడిపించారని, ప్రభుత్వం మారడంతో సాక్ష్యాలు మాయం చేసేందుకు హార్డ్​ డిస్కులు, డివైజ్​లు ధ్వంసం చేయించింది కూడా ఆయనేనని విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో నాటి ప్రతిపక్ష నేత రేవంత్​రెడ్డి సహా పలువురి కదలికలపై నిఘా పెట్టి, ఫోన్లు ట్యాప్​ చేసి సమాచారాన్నంతా అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలకు చేరవేసేవారని తేలింది. 

కేసులో ప్రణీత్ రావును ఏ2గా,  సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును ఏ3గా, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ(గతంలో ఇంటెలిజెన్స్​ అడిషనల్​ ఎస్పీ) భుజంగరావును ఏ4గా, హైదరాబాద్​ సిటీ సెక్యూరిటీ వింగ్​ అడిషనల్​ డీసీపీ (గతంలో ఇంటెలిజెన్స్​ అడిషనల్​ ఎస్పీ) తిరుపతన్నను ఏ6గా చేర్చారు. మరికొందరు ప్రైవేట్ వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, ఏ3 రాధాకిషన్ రావు  ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో.. వీరి కోసం లుక్ అవుట్ సర్క్యులర్​ జారీ చేశారు. 

రిమాండ్​ రిపోర్టు​లో కీలక వివరాలు 

ఎస్ఐబీ అడ్డాగా సాగిన ఫోన్ ట్యాపింగ్ గుట్టును ప్రణీత్ రావు బయటపెట్టాడు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసులో సూత్రధారులు, పాత్రధారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్  టీమ్ అరెస్ట్ చేస్తున్నది. ఇందులో భాగంగా భుజంగరావు, తిరుపతన్నను శనివారం అరెస్ట్ చేసి ఆదివారం జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. కొంపల్లిలోని జడ్జి ఇంట్లో ప్రణీత్​రావు, భుజంగరావు, తిరుపతన్నను ప్రొడ్యూస్ చేయగా.. భుజంగరావు, తిరుపతన్నకు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్  విధించారు. 

దీంతో వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రణీత్​రావు కస్టడీ ఆదివారంతో ముగియడంతో జ్యూడీషియల్​ రిమాండ్​ కోసం చంచల్​గూడ జైలుకు తరలించారు. ప్రణీత్ రావు కస్టడీ స్టేట్ మెంట్ తో పాటు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఓఎస్డీ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్​లు జరిగాయని పేర్కొన్నారు. దీంతో పాటు అప్పటి సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్​రావు నేతృత్వంలో సీక్రెట్ ఆపరేషన్స్ జరిగినట్లు విచారణలో తేలింది. ఈ  వ్యవహారంలో మరికొంత మంది పోలీస్ అధికారులు అరెస్ట్  అయ్యే అవకాశం ఉంది. 

బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీస్​గా ఎస్ఐబీ

స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ బ్రాంచ్​(ఎస్ఐబీ) అనేది బీఆర్ఎస్ పార్టీకి బ్రాంచ్ ఆఫీస్ గా గత ప్రభుత్వ హయాంలో పనిచేసినట్లు స్పెషల్ టీమ్ దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్రంలో మావోయిస్టులు, టెర్రరిస్టుల డేటా సేకరణ, వారి కదలికలపై నిఘా పెట్టాల్సిన ఎస్ఐబీ.. ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులే టార్గెట్ గా పనిచేసినట్లు తేలింది. అప్పటి సీఎం కేసీఆర్​ను, ఇతర బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించినవాళ్ల ఫోన్స్​ను ఎస్​ఐబీలోని కొందరు కీలక అధికారులు ట్యాప్​ చేశారని బయటపడింది. 

ఇందులో నాడు సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేసిన రాధాకిషన్ రావును స్పెషల్ ఆపరేషన్లకు వినియోగించేవాళ్లని తేలింది. ఎలక్షన్స్ సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసి, అందులోని సమాచారాన్ని నాటి సర్కారులోని కీలక వ్యక్తులకు చేరవేసేవాళ్లని... బీఆర్ఎస్ నేతలు మినహా ఇతర పార్టీలకు చెందిన డబ్బును మాత్రమే సీజ్ చేసేవాళ్లని విచారణలో ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు.

త్వరలో మరిన్ని అరెస్టులు!

ఇంటెలిజెన్స్ లో కీలక విధులు నిర్వహించిన అధికారులు అరెస్ట్ కావడంతో ఈ కేసులో మరికొంత మంది పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, మీడియా వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులకు ఉచ్చుబిగుస్తున్నది. ఇప్పటికే ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో మరికొన్ని రోజులు కస్టడీ కోసం కోర్టును స్పెషల్ ఇన్వెస్టిగేషన్​ టీమ్  కోరనుంది. భుజంగరావు, తిరుపతన్నను కూడా 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. భుజంగరావు, తిరుపతన్న కస్టడీ విచారణలో రాజకీయ ప్రముఖుల పేర్లు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే గత ప్రభుత్వంలోని అక్రమాలకు సాక్ష్యాలు లభిస్తాయని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా,  ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో రెండు రోజుల కింద ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్​కుమార్​రావు ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రవణ్​కుమార్​రావు ప్రస్తుతం అందుబాటులో లేరని పోలీసులు గుర్తించారు. 

పైవాళ్లు నంబర్లు పంపితే.. వీళ్లు ట్యాప్​ చేసెటోళ్లు

ఫోన్ ట్యాపింగ్ జరిగిన విధానాన్ని విచారణలో దర్యాప్తు అధికారులకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వెల్లడించారు. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్​గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు, ప్రభాకర్ రావు నుంచి అందిన ఫోన్​ నంబర్ల ఆధారంగా  ట్యాపింగ్ చేసేవాళ్లమని తెలిపారు. వందల సంఖ్యలో ఫోన్ నంబర్స్ అందేవని చెప్పారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల పరిసరాల్లో ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఫోన్‌‌ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్‌‌రావుకు అందించేవాళ్లమని తెలిపారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన వెంటనే  ప్రభాకర్‌‌రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైజ్‌‌లు, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్లు ఆ ముగ్గురు విచారణలో అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు  ప్రణీత్‌‌రావు ధ్వంసం చేసిన హార్డ్‌‌ డిస్క్‌‌లను ఇన్వెస్టిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకొని..  రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..