Prabhas Birthday Special : పాన్ ఇండియా స్టార్ అనే టైటిల్‌కు.. న్యాయం చేసేది ప్రభాస్ ఒక్కరే

Prabhas Birthday Special :  పాన్ ఇండియా స్టార్ అనే టైటిల్‌కు..  న్యాయం చేసేది ప్రభాస్ ఒక్కరే

ప్రభంజనమైన ప్రేక్షకుల హృదయాలను గెలిచిన నటుడు ప్రభాస్ (Prabhas). తన మంచి మనసుతో..మాట్లాడే తీరుతో ఇండస్ట్రీ ప్రముఖుల నుంచే కాకుండా..దేశ వ్యాప్తంగా అశేష అభిమాన బలాన్ని సంపాదించుకున్న నటుడిగా ఖ్యాతి పొందారు. బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత ప్రభాస్ స్థాయి శిఖ‌రం ఎత్తుకు అమాంతం పెరిగింది. ఇవాళ సోమవారం (అక్టోబర్‌ 23న) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనమిది.

ప్రస్తుతం ప్రభాస్ జ‌యాప‌జ‌యాల‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్నాడు. కేవ‌లం భారత దేశంలోనే కాకుండా..ప్ర‌పంచ దేశాల్లో ప్రభాస్ కు ఉన్న ఫాలోవ‌ర్స్ లిస్ట్ చాలానే ఉంటుంది. సూపర్ స్టార్ ప్రభాస్ తన ప్రత్యేకమైన శైలి..అతను దగ్గరికి వచ్చే గొప్ప పాత్రలతో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు. అలాగే పాన్ ఇండియా హీరో అనే టైటిల్ కు న్యాయం చేసే ఏకైక హీరో ప్రభాస్ కావడం విశేషం. 

ఒకప్పటి తెలుగు సినిమా అంటే కమర్షియల్. అడపాదడపా వచ్చే ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. నాటి తెలుగు సినిమాల కలెక్షన్లు కష్టంగా వంద కోట్ల రూపాయలు దాటేవి. ఈ లెక్కను పూర్తిగా మార్చేస్తున్నారు నేటి తెలుగు దర్శకులు, అగ్ర నటులు. ఓ అగ్ర హీరో అయితే మన తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులకు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చాడు. ప్రభాస్ అతి ముఖ్యమైన ఐదేళ్లని బాహుబలి మూవీకి అంకితం చేశాడు. ఇటువంటి నిర్ణయాన్ని ఏ హీరో కూడా తీసుకోలేడు కూడా. 

ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు. తెరపై ఆయన ఆహార్యం అలాంటిది. అలా ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ‘ప్రభాస్’ ఠీవీగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అనిపిస్తుంటుంది.ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్ల కలెక్షన్, కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కటౌట్ కి మైనపు ప్రతిమను బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు.

మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప మూవీలో శివుడి పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశాడు మంచు విష్ణు. ఇలా సినిమా సినిమాకి కొత్త ధనాన్ని చూపిస్తూ.. నేటి తరం హీరోల్లో అన్ని రకాల పాత్రలు చేస్తున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. పురాణ, సాంఘీక, జానపద, ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా, కథ ఏదైనా ఒకే ఆప్షన్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్ హీరో గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ సినీ ప్రస్థానం:

ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ..

నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న కృష్ణం రాజు తర్వాత వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో ప్రభాస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అనంతరం వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో లాంటి భారీ విజయాలని సాధించారు.

21 ఏళ్ళలో ప్రతి చిత్రానికి చాలా కష్టపడుతూ, తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ ముందుకెళుతున్నారు. రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానులని గెలుచుకున్నాడు. అసలు ప్రభాస్ లేకపోతే ‘బాహుబలి’ చిత్రమే లేదు అని దర్శధీరుడు రాజమౌళి స్వయంగా అన్నారంటే.. ఆయన డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఆప్యాయంగా 'డార్లింగ్‌' అని పిలుస్తూ..

 21 ఏళ్ళ పాటు ప్రేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా ఎదుగుతూ, అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగినా ప్రభాస్ గర్వం లేకుండా తన సహ నటులతో ఆప్యాయంగా 'డార్లింగ్‌' అని పిలుస్తూ పిలిపించుకుంటూ ఉంటారు. తన కెరీర్లో ఎలాంటి కాంట్రవర్సీ జోలికి పోలేదు. మళ్ళీ మళ్ళీ ప్రభాస్ తో పని చేయాలనిపిస్తుందని దిగ్గజ నిర్మాతలు, దర్శకులు చెబుతున్నారంటే నటుడిగా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది.

ప్రస్తుతం ‘ప్రభాస్’ మూవీ కోసం టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా  అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

క్యూలో ప్రభాస్ సినిమాలు..

‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘ప్రభాస్’ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీని వాడుతూ తెరకెక్కుతున్న చిత్రం 'సలార్'. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయట. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింసే ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. ‘శ్రుతీ హాస‌న్’ ఈ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. మలయాళ నటుడు ‘పృథ్వీ రాజ్’ కూడా నటిస్తున్నారు. ‘సలార్’ మూవీలో పృథ్వీరాజ్‌ `వర్ధరాజా మన్నార్‌` పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని 2023లో (డిసెంబర్ 22న) విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు నెగటివ్‌ రోల్ చేస్తున్నారు. 

వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD పై విపరీతమైన అంచనాలున్నాయి.  దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin) తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్(Deepika padukone) హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitab bachhan), లోకనాయకుడు కమల్ హాసన్(Kamal haasan) లాంటి లెజెండరీ నటులతో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల (2024) ముందుకు రానుంది.  

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఆయన తన తరువాతి సినిమాను కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో జాయిన్ కాబోతున్నట్టు ప్రకటించారు. ఇది కాక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో, దర్శకుడు మారుతితో కూడా ‘ప్రభాస్’ నటించిన భారీ చిత్రాలు త్వరలో మొదలవ్వనున్నాయి.

ప్రభాస్ బర్త్ డే స్పెషల్ అప్డేట్స్!

హ్యూమర్ టచ్తో తనదైన కామెడీ సినిమాలను తీసే..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి మూవీకు సంబంధించిన పోస్టర్..రిలీజ్ చేసే అవకాశం ఉండగా..అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న..సలార్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక సంక్రాంతి బరిలో ఉన్న కల్కి మూవీ నుంచి కూడా స్పెషల్ ట్రీట్ ఉండే ఉంటుందని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా..అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తోన్న స్పిరిట్ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక ప్రభాస్ బర్త్డే వేడుకలతో మేకర్స్..ఫ్యాన్స్ ఆశ‌లు తీరుస్తారా? లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. 

20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు..

గత 20 ఏళ్లుగా ‘ప్రభాస్’ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. వరదలు వచ్చినపుడు,  కొవిడ్ సమయంలోనూ భారీ విరాళాలు ఇచ్చారు. అలాగే 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకోవడమే కాక అందులో తన తండ్రి పేరు మీద ఎకోపార్క్ అభివృద్ధికి కావాల్సిన ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు.

ఇలా రెబల్ స్టార్ గా మాత్రమే కాక మంచి మనసున్న మహారాజుగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ‘ప్రభాస్‌’. ఆయన మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని కోరుతూ అక్టోబర్‌ 23న పుట్టినరోజు సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.

యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ స్టార్స్ తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల యూనిట్ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.