ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. 18ఏళ్లు నిండిన వారికే థియేటర్లోకి అనుమతి

ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్..  18ఏళ్లు నిండిన వారికే థియేటర్లోకి అనుమతి

డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది సలార్ మూవీ. యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్  నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ చూసేందుకు సినీ ప్రేక్షకులు, అభిమనులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుంది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో గుంటూరు నాజ్ సెంటర్ లోని పీవీఆర్ థియేటర్ యాజమాన్యం.. ప్రభాస్ ఫ్యాన్స్కు షాకిచ్చింది.  18 ఏళ్ల వయస్సు పైబడిన వారినే సినిమా చూసేందుకు లోనికి అనుమతిస్తామని నిబంధన పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులను థియేటర్ యాజమాన్యం  లోనికి అనుమతించలేదు.

సినిమా చూసేందుకు అనుమతించకుంటే మా డబ్బులు తిరిగి చెల్లించాలంటూ థియేటర్ సిబ్బందిని.. ఆన్ లైన్ లో టికెట్ బుక్  చేసుకున్న ప్రేక్షకులు నిలదీశారు. డబ్బు చెల్లించేది లేదని సిబ్బంది చెప్పటంతో థియేటర్ లో నిరసనకు దిగారు. విషయం తెలుసుకుని థియేటర్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.
అన్ లైన్ టికెట్ బుకింగ్ సమయంలోనే 18 ఏళ్ల నిబంధనను ఎందుకు స్పష్టంగా పేర్కొనలేదని పోలీసుల ఎదుటే థియేటర్ సిబ్బందిని ప్రేక్షకులు ప్రశ్నించారు.

వారం రోజుల వ్యవధిలో ప్రేక్షకుల సొమ్ము తిరిగి వారి అకౌంట్లలో పడేలా చూస్తామని పోలీసుల ఎదుట థియేటర్ యాజమాన్యం హామీ ఇచ్చారు. దీంతో  వివాదం సద్దుమణిగింది. అయితే, డబ్బులు వెనక్కి ఇవ్వకుంటే ధియేటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు, వినియోగ దారుల కోర్టులో కేసు వేస్తామని  ప్రేక్షకులు హెచ్చరించారు.