Prabhas: 'కల్కి 2' లో ప్రభాస్ పాత్రే కీలకం.. విడుదలపై నాగ్ అశ్విన్ క్లారిటీ

Prabhas: 'కల్కి 2' లో  ప్రభాస్ పాత్రే కీలకం.. విడుదలపై నాగ్ అశ్విన్ క్లారిటీ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 AD' మూవీ ఒక విజువల్ ట్రీట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పడు ఈ చిత్రానికి సంబంధించి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ఎదురుచూపు ఇంకా చాలా కాలం కొనసాగే అవకాశం ఉందని దర్శకుడు నాగ్ అశ్విన్ లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో వెల్లడించారు. కల్కి 2 పూర్తవడానికి మరో రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ఈ జాప్యానికి కారణాలను వివరించారు నాగ్ ఆశ్విన్. మొదటి భాగంలో కేవలం ఒక చిన్నపాటి యుద్ధం మాత్రమే చూపించాము. కానీ రెండో భాగంలో దానికి మించి అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాలు, యుద్ధాలు ఉంటాయని నాగ్ అశ్విన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్, ప్రభాస్ పాత్ర భైరవ, అలాగే అమితాబ్ బచ్చన్ పాత్ర అశ్వత్థామ మధ్య జరిగే సంఘర్షణ ప్రధానాంశం కానుందన్నారు.  ఈ స్టార్ క్యాస్ట్ షెడ్యూళ్లను ఒకేసారి సమన్వయం చేయడం చాలా కష్టమైన పని అని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది కాబట్టి..  షూటింగ్ కంటే పోస్ట్-ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం పడుతుందని నాగ్ అశ్విన్ వివరించారు.

ఈ సారి 'కల్కి 2'లో ప్రభాస్ పాత్రకు ప్రాధాన్యత గురించి నాగ్ అశ్విన్ స్పష్టత ఇచ్చారు. మొదటి భాగంలో ప్రభాస్ పాత్రకు తక్కువ స్క్రీన్ టైమ్ ఉందంటూ వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చారు. మొదటి భాగంలో ప్రపంచాన్ని, పాత్రల నేపథ్యాలను పరిచయం చేయడానికే ఉద్దేశించబడింది అని చెప్పారు. అయితే, 'కల్కి 2' పూర్తిగా ప్రభాస్ పాత్ర కర్ణుడి ప్రయాణంపై దృష్టి పెడుతుందని వెల్లడించారు.  కర్ణుడికి, అశ్వత్థామ పాత్రల మధ్య బంధాన్ని మరింత లోతుగా చూపించే విధంగా ఉంటుందని తెలిపారు.

ఇక ఈ సారి కల్కి2 నుంచి దీపికా పదుకొణె పాత్రపై రకరకాల ఊహాగాహాలు తెరపైకి వచ్చాయి. మాతృత్వం కారణంగా తన పనివేళలను తగ్గించుకోవాలన్న భావనలో ఆమె ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. దీంతో ఆమె పాత్రను తగ్గించడం లేదా తొలగించడం వంటి నిర్ణయాలను మూవీ మేకర్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అటు దీనిపై నిర్మాణ సంస్థ కూడా ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు.
  
ఈ కల్కి2 సినిమా పూర్తి కావాలంటే మరో రెండు మూడేళ్లు పడుతుందని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. అభిమానుల అంచాలనకు మించి ఈసారి చిత్రం ఉండబోతుందని చెప్పారు. దీంతో మరో కురుక్షేత్రం చూడాలంటే అభిమానులు  కొంత కాలం వేచి చూడకతప్పదు మరి.