Kalki 2898 AD: మహాభారతం అశ్వత్థామ.. కల్కి కాలానికి ఎలా వచ్చాడు?

Kalki 2898 AD: మహాభారతం అశ్వత్థామ.. కల్కి కాలానికి ఎలా వచ్చాడు?

డైనోసార్ ప్రభాస్ కొత్త సినిమా కల్కి 2898 A.D. సినిమా జూన్ 27న  రిలీజ్ కు రెడీ కాబోతుంది. సూపర్ హిట్ సిరీస్ స్టార్ వార్స్ తరహాలో ఇండియన్ సినిమా రావడం ఇదే మొదటిసారి కావడంతో  వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ వచ్చింది.  ట్రైలర్ రిలీజ్ కావడంతో సినిమా ఎలా ఉంటుంది? స్టోరీ లైన్ ఏంటన్నది కొంత క్లారిటీ వచ్చింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య ఫైట్ సీన్లే ట్రైలర్లో హైలైట్. బిగ్ బి తెలుగు సినిమాలో అశ్వత్థామగా నటిస్తున్నట్లు చాలాముందే మూవీ మేకర్స్ ప్రకటించారు. హీరో భైరవ రోల్ తర్వాత అశ్వత్థామ పాత్రే కీలకం అని అర్థమవుతుంది. అయితే మన భవిష్యత్ కాలానికి సంబంధించిన కథలో అశ్వత్థామ ఎందుకున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

పురాణాల ప్రకారం విష్ణువు దశావతారాల్లో చివరిది కల్కి అవతారం. కలియుగంలో పాపాలు పూర్తిగా పండినప్పుడు కల్కి అవతారం వస్తుందని నమ్ముతారు. అయితే ఆ కాలం ఇంకా రాలేదని కొందరు, పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని మరికొందరు చెబుతారు. అసలు అవతారం ఇంకా రాకున్నా తానే కల్కి అని చెప్పుకుంటూ తిరిగేవాళ్లు మాత్రం ఇప్పుడు చాలామందే ఉన్నారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే.. కల్కి అవతారం కాలానికి అశ్వత్థామ ఎందుకున్నాడన్నదే. 

మహాభారతంలోనే లింకుందా?

చాలామందికి తెలిసిన మహాభారతం సినిమా కథలు మాత్రమే. కురుక్షేత్రం తర్వాత దుర్యోధనుడి మరణంతో భారతం పూర్తయిపోయిందని అంతా అనుకుంటారు. అట్లాగే కృష్ణుడి మరణం గురించి మరికొన్ని కథలున్నాయి. అయితే కురుక్షేత్రం యుద్ధం తర్వాత ఏం జరిగిందన్నది చాలామందికి తెలియదు. నిజానికి యుద్ధం తర్వాత భాగంలో అశ్వత్థామ పాత్రే కీలకంగా ఉంటుంది. ఎందుకంటే యుద్ధంలో రెండు పక్షాల నుంచి దాదాపుగా చాలామంది చనిపోతే... కౌరవుల పక్షంలో అశ్వత్థామ, కృపాచార్యుడు లాంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగులుతారు. 

అశ్వత్థామ ఎవరు? తలకు మణి ఉంటుందా?

మహావీరుడైన అశ్వత్థామ పాండవులకు ఆయుధ విద్యలు నేర్పిన ద్రోణాచార్యుడి కొడుకు. అతని తల్లి కృపి. ద్రోణుడి తపస్సు వల్ల శివుని వరంతో నుదుటిపై చిన్న మణితో అశ్వత్థామ పుడతాడు. దీని శక్తితో అతను ఆకలిదప్పులు లేకుండా బలంగా ఉండే శక్తి కలిగి ఉంటాడు. అతను పుట్టినప్పుడు గుర్రంలా సకిలించడం వల్ల అశ్వత్థామ అని పేరు పెడతారు. పాండవులకు తండ్రి ఆయుధ విద్యలు నేర్పుతున్నప్పుడే అతను కూడా నేర్చుకుంటాడు. అర్జునుడికి దీటుగా అశ్వత్థామను ద్రోణుడు విలువిద్యలో తీర్చిదిద్దుతాడు. అడవి బిడ్డ ఏకలవ్యుడి నైపుణ్యం చూసి బొటనవేలు కోరిన ద్రోణుడు తన కొడుకును మాత్రం అర్జునుడికి సమానంగా తయారుచేయడం విచిత్రమే. 

ఇంకా అశ్వత్థామకు ఇంకో ప్రత్యేకత ఉంది. మన పురాణాల ప్రకారం మరణం లేనివారు ఏడుగురు ఉన్నారనీ, వారిని సప్త చిరంజీవులుగా చెబుతారు. వారిలో బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు, కృపాచార్యుడితో పాటు అశ్వత్థామ ఉన్నారు. కల్కి కథలో అశ్వత్థామ కనిపించడానికి ఇదే పెద్ద లింక్. అయితే మహావీరుడైన అశ్వత్థామ ఆ రూపంలోనో, రుషి లాగానో కాకుండా రక్తపు మరకలతో, ఒంటినిండా కట్లతో ఎందుకు కనిపిస్తున్నాడన్నదే అసలు ట్విస్ట్. దీనికి కూడా భారతంలోనే ట్విస్ట్ ఉంది.

మహాభారత యుద్ధం తర్వాత ఏమైంది?

తండ్రి ద్రోణుడి బాటలోనే అశ్వత్థామ కౌరవుల పక్షంలో ఉన్నాడు. యుద్ధంలో ఎదురులేకుండా ఫైట్ చేశాడు. అయితే పాండవులకు విద్యనేర్పిన ద్రోణుడే పోరాటంలో ఉంటే అతన్ని ఎదిరించేదెవరు? ఇక్కడే సమస్య వచ్చింది. గురువును చంపనని అర్జునుడు అంటాడు. దీంతో కృష్ణుడు ఒక ఉపాయం చేస్తాడు. అశ్వత్థామ అనే పేరున్న ఏనుగును భీముడితో చంపిస్తాడు. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని, ఏనుగు అన్న మాటను వినిపించకుండా ద్రోణుడికి చెప్పాలని ధర్మరాజుకు కృష్ణుడు చెబుతాడు.

 ఈ ప్లాన్ ప్రకారం ద్రోణుడిని బలహీనం చేసి, కదలకుండా నిలబడిపోయిన అతన్ని దృష్ణద్యుమ్నుడు చంపేస్తాడు. తన తండ్రిని చంపిన పాండవులపై అశ్వత్థామ పగ పెంచుకుంటాడు. అప్పటికే యుద్ధం చివరికి వస్తుంది. దుర్యోధనుడిని భీముడు చంపడంతో ముగిసిపోతుంది. పగతో రగిలిపోతున్న అశ్వత్థామ అదేరోజు రాత్రి శిబిరంలో నిద్రపోతున్న పాండవుల కొడుకులు ఉపపాండవులు అందరినీ చంపేస్తాడు. యుద్ధంలో అభిమన్యుడు చనిపోవడం, ఉపపాండవులు కూడా పోవడంతో పాండవ వంశానికి వారసులే లేకుండా పోతారు.

అశ్వత్థామ చేసిన పాపాలేంటి?

ఉపపాండవులను చంపిన విషయం తెలుసుకున్న కృష్ణుడు, పాండవులు అశ్వత్థామను వెంటాడుతారు. అడవిలో కొంతదూరం పోయాక చంపే అవకాశం వచ్చినా గురువు కొడుకన్న కారణంతో చంపడానికి వెనకాడుతారు. తర్వాత అశ్వత్థామ వ్యాసుడి ఆశ్రమంలో తలదాచుకుంటాడు. పాండవులు అక్కడికి చేరుకుంటారు. వారిని ఎదుర్కోలేనని అర్థమైన అశ్వత్థామ తన తండ్రి తనకు నేర్పిన శక్తిమంతమైన ఆయుధం ‘బ్రహ్మశిరోనామకాస్త్రం’ ప్రయోగిస్తాడు. ఈ అస్త్రాన్ని వేసి పాండవ వంశమే లేకుండా పోవాలని (అపాండవీయం) అంటాడు. దీన్ని ఎదుర్కోవాలంటే అంతే శక్తిమంతమైన అస్త్రం వేయాలి. దీంతో అర్జునుడు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు.

 ఒక అస్త్రమే చాలా ప్రమాదకరం అనుకుంటే.. రెండు అస్త్రాలు తలపడితే ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది. దీంతో వ్యాసుడు, నారదుడు లాంటి మునులంతా కలిసి వాళ్లను హెచ్చరిస్తాడు. అస్త్రాలను వెనక్కి తీసుకోవాలని చెబుతారు. దీనికి ఒప్పుకున్న అర్జునుడు వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామ ఒప్పుకున్నట్లు చెబుతూనే.. అస్త్రం దిశను మార్చి పాండవ మహిళల గర్భాలు పోయేలా శాపాన్ని మారుస్తాడు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంతో ఉంటుంది. ఆమెకు పుట్టబోయే బిడ్డే ఈ వంశానికి మిగిలే వారసుడు. అశ్వత్థామ అస్త్రం వల్ల ఉత్తర గర్భంలోనే బిడ్డ చనిపోతాడు. అయితే కృష్ణుడు తన యోగశక్తితో చనిపోయిన బిడ్డను బతికించి పాండవ వంశాన్ని నిలబెడతాడు. అభిమన్యుడు, ఉత్తరకు పుట్టిన కొడుకు పరీక్షిత్తే చివరికి మిగిలిన ఏకైక వారసుడు.

అశ్వత్థామకు దక్కిన శాపం

సర్వనాశనం అయిపోయినా అశ్వత్థామ వేస్తున్న కుయుక్తులతో కృష్ణుడు ఆగ్రహిస్తాడు. అతని తలపై ఉన్న మణిని తీసేసి ఘోరమైన శాపాన్ని ఇస్తాడు. రక్తం కారుతూ, కంపు కొడుతూ, ఆకలిదాహాలతో నకనకలాడుతూ బతకడమే ఆ శాపం. ఇక్కడితో మహాభారతంలో అశ్వత్థామ పాత్ర ముగుస్తుంది. 

భారతం ముగింపే కల్కి ఆరంభమా?

కల్కి కథను నాగ్ అశ్విన్ పూర్తిగా అశ్వత్థామ పాత్ర ఆధారంగా, కొంత భారతం కథను వాడుకుంటూ ఫ్యూచరిస్టిక్ గా రాసుకున్నాడు. తన పాపాలకు శిక్ష అనుభవిస్తూ రక్తంతో, మురికి శరీరంతో ఉన్నవాడిగా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ ను చూపించాడు. మహాభారతంలో అతని వల్ల పాండవ వంశం నశించిపోయే పరిస్థితి కల్పించాడు. ఇదే పాయింట్ ఆధారంగా కల్కి కథలో లోకాన్ని కాపాడడానికి పుట్టబోయే బిడ్డను కాపాడే బాధ్యత అశ్వత్థామ తీసుకున్నట్లు చూపించాడు. అంతే అశ్వత్థామ మహాభారతంలో చేసిన పాపానికి పరిహారం చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. కృష్ణుడు తీసేసుకున్న మణి ప్రస్తావన కూడా కనిపిస్తుంది. 

అశ్వత్థామకు చావులేదు కాబట్టి ముగింపు విషాదంగా ఉండే అవకాశం లేదు. పాప పరిహారంతో మణిని తిరిగి దక్కించుకుంటే అశ్వత్థామ శాపం నుంచి బయటపడి, ప్రశాంతంగా జీవించేవాడిగా మారిపోవచ్చు. లేదంటే పుట్టబోయే కల్కిని కాపాడే ప్రయత్నంలో కొత్త ట్విస్ట్ ఏమైనా ఇస్తారా అన్నది చూడాలి. పురాణాన్ని, భవిష్యత్ ను కలుపుతూ, భారతీయ కథను స్టార్ వార్స్ తరహా ప్రజెంటేషన్ తో చేసిన ప్రయోగం ఎంత సంచలనం రేపుందన్నది చూడాలి.