ప్రేమే నా డెస్టినీని రాసింది

ప్రేమే నా డెస్టినీని రాసింది

‘మైనే ప్యార్‌‌‌‌కియా’ అంటూ ముప్ఫై రెండేళ్ల క్రితం బాలీవుడ్‌‌లో ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్‌‌ను అందుకున్న భాగ్యశ్రీ.. ఆ తర్వాత తెలుగులోనూ ఓంకారం, యువరత్న రాణా లాంటి చిత్రాల్లో నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు ‘రాధేశ్యామ్‌‌’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. మార్చ్ 11న మూవీ రిలీజవుతున్న సందర్భంగా ఇలా ముచ్చటించారు.

‘‘లాంగ్‌‌ గ్యాప్‌‌ తర్వాత తెలుగులో నటించడం సంతోషంగా ఉంది. మొదట్లో కొంత నెర్వస్‌‌గా ఫీలయ్యాను. కానీ టీమ్‌‌లోని ప్రతి ఒక్కరి  ప్రేమ, గౌరవం చూసి సెట్‌‌కి వెళ్లిన ఐదు నిమిషాల్లోనే కంఫర్ట్ ఫీలయ్యాను. అందరికీ డార్లింగ్ అయిన ప్రభాస్‌‌ నాకూ డార్లింగ్‌‌ అయ్యాడు. తనో అద్భుతమైన యాక్టర్‌‌‌‌. ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా డౌన్‌‌ టు ఎర్త్. కో స్టార్స్‌‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఫ్యామిలీ రిలేషన్స్‌‌కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆశ్చర్యపరచింది. అతనికి మదర్‌‌‌‌గా, ఒక డ్యాన్సర్‌‌‌‌గా నటించాను. నాకు ట్రెడిషనల్‌‌ డ్యాన్స్ రాదు. భరతనాట్యం, కథక్, కూచిపూడి లాంటివి నేర్చుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. అందుకే ఐదారు రోజులు కష్టపడి ఓ పాటకు కావాల్సినంత నేర్చుకున్నాను. ఎవరైనా ప్రొఫెషనల్స్‌‌ తప్పులు పడతారనే భయం ఉండేది. పైగా ఈ ఏజ్‌‌లో నేర్చుకోవడం కష్టమే. కోల్డ్ వెదర్‌‌‌‌లో జార్జియాలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ పాట తీయడంతో చాలా ఫ్రీజ్ అయ్యాను. ఈ సినిమా విషయంలో నాకు ఎక్కువ కష్టం అనిపించింది ఇదే. గతంలో చాలా షూటింగ్స్ చేసినా ఈ సెట్‌‌ మాత్రం నాకు ఎంతో ప్రత్యేకం. చాలా గ్రాండ్‌‌గా, అందంగా ఉండేది. మరో లోకానికి వెళ్లినట్టు అనిపించేది. యాక్షన్ సినిమాలే కాదు రొమాంటిక్ సినిమాలు కూడా హాలీవుడ్‌‌ స్థాయిలో తీయొచ్చని ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. లవ్, డెస్టినీల చుట్టూ తిరిగే కథ. రెండింటిలో దేన్ని నమ్ముతాననేది నేనైతే చెప్పలేను. ఎందుకంటే లవ్‌‌ అనేది నా డెస్టినీని రాసింది. అందుకే ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలకు దూరమయ్యాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అందుకే మళ్లీ వచ్చేశాను. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు చాలా ముందంజలో ఉంది. బాలీవుడ్‌‌ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా తెలుగు, మలయాళ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొత్త తరహా సినిమాలొస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్ వల్ల వాటికి మరింత గుర్తింపు లభిస్తోంది. అదీకాక ఇక్కడి నుంచి ప్యాన్‌‌ ఇండియా సినిమాలు కూడా వస్తున్నాయి. నేనింత వరకు చాలా తక్కువ సినిమాల్లో నటించాను కనుక చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. లక్కీగా కొత్త తరహా పాత్రలు, సినిమాలు వస్తున్నాయి.’’