సలార్ రివ్యూ : ప్రభాస్ బాడీ కట్స్, రౌడీయిజమే హీరోయిజంగా

సలార్ రివ్యూ : ప్రభాస్ బాడీ కట్స్, రౌడీయిజమే హీరోయిజంగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ థియేటర్లోకి వచ్చేసింది. బాహుబలి తరువాత హిట్ ఖాతా తెరవని ప్రభాస్.. ఆ రేంజ్ హిట్ కోసం సలార్ తో  ఫ్యాన్స్ ముందుకు వచ్చేసాడు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాష్ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మాస్ కాంబో వర్కవుట్ అయ్యిందా? ప్రభాస్ కట్ అవుట్ కి తగ్గ కథ పడిందా? ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ కి ఎలివేట్ చేశాడు? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ఖాన్సార్ అనే మహా సామ్రాజ్యంలో దేవా (ప్రభాస్), వరద రాజమన్నారు(పృధ్విరాజ్ సుకుమారన్) ప్రాణ స్నేహితులు. ఎంతంటే ఒకరికోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునేంతలా. కానీ... అనుకోని ఓ సంఘటనతో దేవా తన తల్లితో కలిసి ఖాన్సార్ ను  వదిలి వెల్లాల్సి వస్తుంది. వరద రాజమన్నార్ చేసిన సహాయానికి.. నీకోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా అని చెప్పి వెళ్లిపోతాడు దేవా. పాతికేళ్ల తరువాత ప్రాణమిత్రుడు కోసం ప్రభాస్ ఎర అయ్యాడా? సొర అయ్యాడా? ఇద్దరు స్నేహితులు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఖాన్సార్ కథను మలుపు తిప్పడంలో శృతి హాసన్ పాత్ర ఏంటి? ప్రభాస్ తన తల్లి గీసిన గీత ఎందుకు దాటడు? దేవాకు సలార్ అనే పేరు ఎందుకు వచ్చింది? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ: 
సలార్ సినిమాలో దేవా పాత్రలో ప్రభాస్ ను తప్ప మరో స్టార్ ను ఊహించుకోలేం. సలార్ కథ ప్రభాస్ కట్ అవుట్ కి టైలర్ మేడ్ అని చెప్పొచ్చు. ప్రభాస్ బాడీని ఈ సినిమాలో చూపించినంతగా.. మరే సినిమాలో చూపించలేదు అనడంలో ఎలాంటి ఆతిశయోక్తిలేదు. బాహుబలిలో రాజమౌళి సైతం ఈ రేంజ్ లో చూపించలేదు. సినిమా మొదటి నుంచీ సైలెంట్ గా కనిపించిన ప్రభాస్.. సడన్ గా యాక్షన్ మోడ్ లోకి రావడం నెక్స్ట్ లెవల్లో ఎలివేట్ అయ్యింది. డైలాగ్స్ తక్కువ.. యాక్షన్ పీక్స్ అన్నట్లుగా అనిపిస్తాడు ప్రభాస్. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ లో పూనకాలు తెప్పించాడు ప్రభాస్.
 
సినిమాలో ప్రభాస్ తరువాత అదే రేంజ్ లో క్యారెక్టర్ ను పండించాడు పృధ్వి రాజ్ సుకుమారన్. వరద పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక శృతి హాసన్ విషయానికి వస్తే.. ఆమె ఓ చిన్న పాత్రగా చూపించారు. ప్రబాస్ తల్లి పాత్రలో ఈశ్వరి రావు ఎమోషన్స్ బాగా పండించారు. జగపతి బాబు, ఝాన్సీ, బాబీ సింహా, శ్రియా రెడ్డి, మైమ్ గోపి.. తదితరులు పాత్ర మేరకు నటించారు. 

టెక్నీషియన్స్:
సాలార్ సినిమాకు ప్రధాన బలం అంటే రవి బస్రూర్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఆయన ఆడించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ ఆయన అందించిన మ్యూజిక్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇక అన్బరివ్ స్టంట్స్ యాక్షన్ లవర్స్ కు పూనకాలు తెప్పించాయి. ఖాన్సార్ సామ్రాజ్యాన్ని, ప్రభాస్ కట్ అవుట్ ను చూపించడంలో.. సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ సూపర్ సక్సెస్ అయ్యారు. నిర్మాత విజయ్ కిరంగదూర్ నిర్మాణ విలువలు.. కథకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి.      

ఇక సలార్ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే..  ప్రభాస్ ఫ్యాన్స్ ను సలార్ ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. యాక్షన్, డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి సలార్ ఖచ్చితంగా నచ్చుతుంది.