
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ది రాజా సాబ్'. సినిమా ట్రైలర్ వచ్చేంది. రొమాంటిక్ హారర్ జానర్‌లో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. సోమవారం (సెప్టెంబర్ 29, 2025) సాయంత్రం 6 గంటలకు విడుదలైన 'ది రాజా సాబ్' ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్శకుడు మారుతి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ తనదైన శైలిలో రొమాంటిక్ హీరోగా కనిపిస్తూనే, భయంకరమైన సన్నివేశాల్లో తన భుజాలపై భారం మోసినట్లుగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా, బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.
అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
'ది రాజా సాబ్' ట్రైలర్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు నిర్మాతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాంధ్ర,బెంగళూరు వంటి ప్రాంతాలలో ఎంపిక చేసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రత్యేక స్క్రీనింగ్ పై ఈ ట్రైలర్ ప్రదర్శించడంతో అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా సినిమాలోని హారర్, కామెడీ, యాక్షన్ కలయిక, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ , ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. అటు సోషల్ మీడియాలో క్షణాల్లోనే ఈ ట్రైలర్ ట్రైండింగ్ లో నిలిచింది.
వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే టీజర్‌కు వచ్చిన మంచి స్పందనతో, ఇప్పుడు ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ప్రభాస్ అభిమానులంతా ఈ రొమాంటిక్ హారర్ విందు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.