Mega Star vs Prabhas : సంక్రాంతి బరిలో 'రాజా సాబ్' vs ' మన శంకరవరప్రసాద్ గారు'.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

Mega Star vs Prabhas : సంక్రాంతి బరిలో 'రాజా సాబ్' vs ' మన శంకరవరప్రసాద్ గారు'..  థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పండుగకు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయడం దశాబ్దాల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ పండుగ సీజన్‌ను దర్శక నిర్మాతలు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ సీజన్‌లో విడుదలైన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఆగ్ర హీరోలకు సెంటిమెంటు కూడా. ఈ సారీ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సమరమే జరగనుంది.  తమ అభిమాన హీరో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  చిత్రం ‘ది రాజా సాబ్’ . ఈ మూవీ విడుదల తేదీలో మార్పు చోటు చేసుకుంది. మొదట డిసెంబర్ 5, 2025న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఒక నెల ఆలస్యంగా, జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ సజ్జ ‘మిరాయి’ ట్రైలర్ లాంచ్‌లో ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ స్వయంగా ధృవీకరించారు. ఇప్పుడు సంక్రాంతి బరిలో  ‘ది రాజా సాబ్’ నిలవడంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయింది.

అయితే, ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధమే జరగనుంది. ఎందుకంటే ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంతో నేరుగా తలపడనుంది. చిరంజీవి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి సినిమాకి ఉన్న మాస్ అప్పీల్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజ్ అపారం. మరోవైపు, ప్రభాస్ సినిమా అంటే పాన్-ఇండియా స్థాయిలో ఉండే అంచనాలు గురించి చెప్పాల్సిన పని లేదు. 'బాహుబలి' తర్వాత ఆయన ప్రతి సినిమా భారీ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాల చిత్రాలు ఒకే సీజన్‌లో విడుదల కావడం సినిమా చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం కానుంది. ఇది ప్రేక్షకులకు థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది.

►ALSO READ | Singha : రియల్ సింహంతో 'సింఘా'.. సినీ చరిత్రలో తొలి సారిగా భారీ ప్రయోగం!

‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. చిరుకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. చిరంజీవితో కలిసి నయనతార నటించడం ఇది మూడోసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే, మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలో సినిమాను సంక్రాంతి 2026కి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.  భీమ్స్ సంగీతం అందిస్తున్న మూవీని, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పండుగ సీజన్‌కు ఉండే భారీ వసూళ్లను సాధించే దిశగా అనిల్ అడుగెలుస్తున్నారు.

ఇక మారుతి దర్శకత్వం వహించిన ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతుండగా, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక వృద్ధ రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ వంటి భారీ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ‘ది రాజా సాబ్’  సినిమా ఒక వివాదంలో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తమ ఒప్పందాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ తమ రూ. 218 కోట్ల పెట్టుబడిని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం చిత్రం విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఏదేమైనా, సంక్రాంతికి ఈ రెండు భారీ చిత్రాల రాకతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు.