గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం

గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. చెస్ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్కు ఈ ఏడాదిలో రెండోసారి దిమ్మదిరిగే షాకిచ్చాడు. చెస్ బుల్ మాస్టర్స్ ఆన్ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత్కు చెందిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద దెబ్బకు కార్ల్సన్ చిత్తయ్యాడు. శుక్రవారం జరిగిన ఐదో రౌండ్లో కార్ల్సన్తో తలపడ్డ ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్పై విజయం సాధించాడు. 40వ మూవ్లో కార్ల్సన్ చేసిన తప్పుతో ప్రజ్ఞానంద గెలుపు సులువైంది. నిజానికి ఇరువురు ఆటగాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేయడంతో ఒక దశలో మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు కనిపించినా చివరకు కార్ల్సన్కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో టోర్నీలో ప్రజ్ఞానంద 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. 15 పాయింట్లతో కార్ల్ సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. జ్ఞానానంద చేతిలో కార్ల్సన్ ఓటమి పాలవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో 39 ఎత్తుల్లో కార్ల్‌సన్‌ను చిత్తుగా ఓడించిన ప్రజ్ఞానంద సంచ‌ల‌నం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన‌ ప్రజ్ఞానంద12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు. భారత చెస్ దిగ్గజ‌ం విశ్వనాథన్‌ ఆనంద్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డు సాధించిన ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.