ప్రజ్ఞానంద అక్క వైశాలికి జీఎం టైటిల్​

ప్రజ్ఞానంద అక్క వైశాలికి జీఎం టైటిల్​

చెన్నై :  ఇండియా చెస్ స్టార్ ఆర్. ప్రజ్ఞానంద  అక్క ఆర్. వైశాలి గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది.  జీఎం హోదా సాధించిన ప్రపంచంలోనే మొదటి అక్క-–తమ్ముడి గా ఈ ఇద్దరూ రికార్డు సృష్టించారు. అలాగే, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తర్వాత గ్రాండ్ మాస్టర్ అయిన ఇండియా మూడో మహిళగా వైశాలి నిలిచింది. స్పెయిన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన లోబ్రెగట్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో రాణించిన 22 ఏండ్ల వైశాలి శుక్రవారం  2500 ఎలో రేటింగ్‌‌‌‌‌‌‌‌ను దాటింది. 

దాంతో ఇండియా తరఫున 84వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో టర్కీకి చెందిన తమర్ తరిక్ సెల్బెస్‌‌‌‌‌‌‌‌ను ఓడించడం ద్వారా చెన్నైకి చెందిన వైశాలి జీఎంకు అవసరం అయిన 2500 ఎలో రేటింగ్ దాటింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఖతార్ మాస్టర్స్‌‌‌‌‌‌‌‌లోనే ఆమె మూడో జీఎం నార్మ్‌‌‌‌‌‌‌‌ అందుకుంది. అప్పటి నుంచి తన ఎలో రేటింగ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్న వైశాలి అనుకున్నది సాధించింది. 

ఆమె తమ్ముడు ప్రజ్ఞానంద 2018లో తన 12వ ఏటనే జీఎం టైటిల్ సాధించాడు. కాగా, వైశాలి, ప్రజ్ఞా ఇప్పటికే క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి క్వాలిఫై అయిన బ్రదర్–సిస్టర్ జోడీగానూ రికార్డు సృష్టించారు. నయా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్ వైశాలిని చెస్‌‌‌‌‌‌‌‌ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ అభినందించాడు. ‘వైశాలి గత కొన్ని నెలలుగా చాలా కష్టపడింది. క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ చెస్ టోర్నీకి సన్నద్ధం అవుతున్న సమయంలో జీఎం హోదా లభించడం మంచి విషయం. ఆమె తల్లిదండ్రులు, తమ్ముడిని కూడా అభినందించాలి’ అని ట్వీట్ చేశాడు.