
- 250 మంది రైతు కుటుంబాల ఆవేదన
- ఎవుసం సాగక అప్పుల పాలైనం
- ఇంటి పెద్దను కోల్పోయి అనాథలమైనం
- సర్కార్ సాయం లేదు..
- ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకుంటలె
- ధర్నాచౌక్ ప్రజావేదికలో కన్నీళ్లు పెట్టుకున్న రైతు కుటుంబాలు
హైదరాబాద్, వెలుగు: ఆరెకరాల పొలం కౌలుకు పట్టుకొని వరి, పత్తి పెడితే దిగుబడి రాలే.. రూ. 6.70 లక్షల అప్పులైనయ్.. ఆ బాధతో రైతన్న ఆత్మహత్య చేసుకున్నడు. అప్పులు తీర్చేందుకు ముందుకు వచ్చిన బామ్మర్ది కూడా అప్పులకే బలైండు. ఇటు భర్తను, అటు తమ్ముడ్ని కోల్పోయి ఓ ఇంటి మహిళ గోసపడుతున్నది. పంట పండక లక్షల అప్పులు మీద పడి.. ఇంటి పెద్ద ఆత్మహత్య చేసుకున్నడు. ఆ అప్పుల తిప్పలతోటే ఆయన కొడుకూ ఆత్మహత్య చేసుకున్నడు. ఇటు భర్తను.. అటు కొడుకును కోల్పోయి మరో ఇల్లాలు ఒంటరైంది. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌కు వచ్చిన ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా ఇలాంటి కన్నీటి గాథలే వినిపించాయి. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఆదుకునే దిక్కు లేదని, ప్రభుత్వం నుంచి ఏ సాయం లేదని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో 250 మంది రైతు కుటుంబాలు పాల్గొని తమ గోస చెప్పుకున్నాయి. దిక్కులేని పక్షులమయ్యామని కన్నీళ్లు పెట్టుకున్నాయి.
సర్కారు సాయం ఏది?
సాయం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నలుగురికి అన్నం పెట్టే తమ కుటుంబాలు రోడ్డునపడ్డాయని వాపోయాయి. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కౌలు రైతు మరణిస్తే, ఆ కుటుంబానికి సొంత భూమి లేదనే సాకుతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అప్పులిచ్చినోళ్లు ఎప్పుడు బాకీ తీరుస్తారా అని ఇంటి మీదికి వస్తున్నారని, ఇల్లు గడువడం కూడా కష్టంగా మారిందని రైతు కుటుంబాలు తమ బాధను వెలిబుచ్చాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి , పీఓడబ్ల్యూ సంధ్య , దళిత స్త్రీ శక్తి కన్వీనర్ గడ్డం ఝాన్సీ పాల్గొని.. 250 మంది రైతుల కుటుంబాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి , కొండల్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. జీవో నంబర్ 194ను అమలు చేసి బాధిత కుటుంబాలకు రూ. 6 లక్షల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఢిల్లీ తరహాలో ఉద్యమం తప్పదు: కవిత
‘‘ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు 194 జీవో ఉంది. దాని ప్రకారం రూ. 6 లక్షలు వెంటనే ఇవ్వాలి. జీవోను అమలు చేయాలి” అని జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి డిమాండ్ చేశారు. భర్త చనిపోతే భూమి హక్కులు భార్యకు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించక పోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
కేసీఆర్‌కు రైతుల బాధ కనిపిస్తలేదా?: ఝాన్సీ
‘‘ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి రావడం లేదు. అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు” అని దళిత స్త్రీ శక్తి కన్వీనర్ గడ్డం ఝాన్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ కు రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వడ్లు కొనే దిక్కు లేదన్నారు. 194 జీవో అమలైతే రాష్ట్రంలో 7 వేల మందికి పరిహారం అందుతుందన్నారు.
కౌలుదారులకు రైతు బంధు ఇవ్వాలి: హరగోపాల్
వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. కౌలు దారులకు రైతుబంధు ఇవ్వాలని, నష్ట పరిహారమూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెద్ద ఎత్తున పోరాడాలి: అద్దంకి దయాకర్
రైతుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రాజకీయాల కోసం రైతులను రచ్చకీడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం
ఉందన్నారు.
నా భర్త, కొడుకు చనిపోయిన్రు
ఉన్న పొలంతో పాటు కౌలుకు తీసుకొని సాగుచేసేవాళ్లం. లక్షలు పెట్టి రెండు ఎడ్లు కొన్నం. పంట పండక రూ. 6 లక్షల అప్పులు మీద పడ్డయ్. ఎడ్లకు మేత కూడా పెట్టే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో నా భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఆ అప్పుల బాధతోటే నా కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నడు. మేం రోడ్డునపడ్డం. సర్కారు సాయం అందలే.
- సావద పద్మ, మాదారం గ్రామం, వికారాబాద్ జిల్లా
నా భర్త, తమ్ముడు బలైన్రు
మాకు అర ఎకరమే ఉంది. ఆరెకరాల కౌలు పట్టినం. అప్పులు తీసుకొని వరి, పత్తి పెట్టినం. పంట పండక రూ. 6.70 లక్షలు అప్పులైనయ్. అప్పుల బాధ భరించలేక నా భర్త ఆత్మహత్య చేసుకున్నడు. నా తమ్ముడు అప్పులు కడుతానని, నన్ను మా తల్లిగారింటికి తీస్కపోయిండు. ఇద్దరం కౌలుకు పట్టుకుని మూడెకరాల వరి వేసినం. పంట 27 సంచులే వచ్చింది. ఇవి సరిపోక దుబాయి పోదామని తమ్ముడు పాస్‌పోర్టుకు అప్లయ్ చేసిండు. అది రాకపోయేసరికి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నడు.
- సూర రాధ, ఆగపేట గ్రామం, కటంటూరు మండలం, జనగామ జిల్లా
భూమి అమ్ముకున్నం
సొంత భూమిలో మూడు బోర్లు వేసి అప్పులపాలైనం. అవి తీర్చేందుకు కౌలుకు తీసుకుని పత్తి పంటేసినం. దిగుబడి రాలేదు. అప్పుల బాధకు సొంత భూమి అమ్ముకున్నం. అయినా అప్పులు తీరలేదు. నా భర్త పురుగుల మందు తాగి చనిపోయిండు. బీడీలు చుట్టి బతుకుతున్న. ఏ సాయమూ లేదు.
- గీత, సిరిసనగండ్ల , సిద్దిపేట జిల్లా