ఆధార్​ లేదా రేషన్​కార్డు చూపిస్తేనే.. ప్రజాపాలన దరఖాస్తు!

ఆధార్​ లేదా రేషన్​కార్డు చూపిస్తేనే..  ప్రజాపాలన దరఖాస్తు!
  •     మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లిలో తేల్చిచెప్పిన అధికారులు
  •     అయోమయంలో గ్రామస్తుడు 

నర్సాపూర్, వెలుగు : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యాంరటీలకు అప్లై చేసుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి కి వింత అనుభవం ఎదురైంది. దరఖాస్తు​ఫారమ్ ఇవ్వాలని అధికారులను అడగ్గా రేషన్​  కార్డు లేదా ఆధార్​ చూపిస్తేనే ఇస్తామని మెలిక పెట్టారు. దీంతో అతడు వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన అబ్బుగారి పోచయ్య ప్రజాపాలనలో భాగంగా గ్రామ పంచాయతీ ఆఫీసుకు వెళ్లి  దరఖాస్తు ఫారమ్​అడిగాడు.  దీనికి అధికారులు ‘నువ్వు ఊర్లో ఉంటున్నావని ఏంటి గ్యారంటీ? ఏదైనా ఒక ప్రూఫ్​ తీసుకువస్తే  ఫారమ్ ​ఇస్తాం’   అని సమాధానమిచ్చారు. తనకు గత బీఆర్ఎస్​సర్కారు రేషన్ కార్డ్ ఇవ్వలేదని, గ్యాస్ సిలిండర్ లేదని, కరెంట్ మీటర్, పట్టాదారు పాసుపుస్తకాలు కూడా లేవని, ఏ ప్రూఫ్ ​తీసుకురావాలని ప్రశ్నించాడు. అయినా వారు వినిపించుకోలేదు. ‘నాకు ఏమీ లేవనే దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన..  దరఖాస్తే ఇవ్వకపోతే ఎట్లా’ అని ఉసూరుమంటూ వెళ్లిపోయాడు.  

రేషన్ కార్డు లేదన్నడు.. దరఖాస్తు ఇయ్యలే 

ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు మొన్నటి వరకు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే దరఖాస్తులు ఇచ్చాం. నిన్నటి నుంచి  రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు తీసుకొని వస్తే దరఖాస్తు ఇస్తున్నాం. పోచయ్యకు రేషన్ కార్డు లేదనే దరఖాస్తు ఇవ్వలే. ఆధార్​కానీ, మరేదైనా ధ్రువీకరణ పత్రం జత చేసి కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి ఇవ్వమని చెప్పాం. కానీ అతను ఇవ్వలేదు.  

శ్వేత, పంచాయతీ సెక్రటరీ, బ్రాహ్మణపల్లి