పెబ్బేరు/వంగూరు, వెలుగు : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన సభలు పలుచోట్ల రసాభాసగా మారాయి. పెబ్బేరు పట్టణంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ముందే వార్డు సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పట్టణంలో మురుగు కాలువలు, విద్యుత్ స్తంభాలు, యువత డ్రగ్స్‌కు బానిసవడం వంటి సమస్యలపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించగా, ఈ సమస్యలన్నీ బీఆర్ఎస్ హయాంలోనివేనంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవం, ఇంకుడు గుంతలు, ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మరోవైపు, వంగూరు మండలం చౌదర్‌పల్లి గ్రామసభలో ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామంలోని సమస్యలపై మంద ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వినతిపత్రం ఇచ్చి సభలో వివరిస్తుండగా, సర్పంచ్ భర్త ఎద్దుల నరేందర్ రెడ్డి ఆగ్రహంతో అతనిపై కుర్చీతో దాడికి యత్నించాడు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని గొడవను సద్దుమణి గేలా చేశారు. దాంతో అధికారులు సభను ముగించుకుని వెళ్లిపోయారు.
