మార్చి 28న గోవాలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

మార్చి 28న గోవాలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

పనాజీ : గోవాలో కొత్త సర్కారు ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 28న ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, 7 బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఆయుర్వేద వైద్యుడైన ప్రమోద్ సావంత్.. ఇప్పటికి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  గోవా ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. 2019లో మనోహర్ పారికర్ మరణంతో సావంత్ తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టారు. 

సోమవారం ప్రమోద్ సావంత్ గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైను కలిసి 25మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కొత్త సర్కారు ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఉండటంతో శ్రీధరన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకుగానూ బీజేపీ 20 సీట్లలో గెలుపొందింది. మేజిక్ ఫిగర్కు కేవలం ఒక్క సీటు దూరంలో నిలిచిన బీజేపీకి ముగ్గురు ఇండిపెండెంట్లతో పాటు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

For more news..

వరంగల్ మార్కెట్ లో మిర్చికి భారీ ధర

టెంపరరీ ఉద్యోగులకు పంజాబ్ సీఎం గుడ్ న్యూస్