ప్రాంక్ వీడియోస్.. దారి తప్పిన సరదా!

ప్రాంక్ వీడియోస్.. దారి తప్పిన సరదా!

ప్రాంక్ వీడియోలు ఈ మధ్యకాలంల చాలా వైరల్ అయితున్నయ్‌‌. ‘నడిరోడ్డుపై ఊహించని చేష్టలు.. అట్ల చేసేటోళ్లను చూసి బిత్తరపోయే జనాలు’.. ఎటొచ్చి ఈ ప్రాంక్‌‌ వీడియోలు ఇంటర్నెట్‌‌లో మస్తుమజా పంచుతున్నయ్‌‌.  సోషల్‌‌ మీడియాలో వీటికి లైక్‌‌ కొట్టనోళ్లు తక్కువ మందే ఉంటరు. అయితే ఫన్‌‌ పంచే క్రమంలో చేస్తున్న ఫీట్లు ఒక్కోసారి వికటిస్తున్నయ్‌‌. సరదా కోసం చేస్తున్న  ప్రాంక్‌‌ వీడియోలు రాంగ్‌‌టర్న్‌‌ తీసుకుంటున్నయ్‌‌.

కొంత కాలం దాకా విదేశాలకే పరిమితమైన ‘ప్రాంక్‌‌ కల్చర్‌‌’.. ఇప్పుడు మన దేశంలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రాంక్‌‌ వీడియోలు తీసేవాళ్లని ‘ ప్రాంక్‌‌స్టర్లు’  అంటారు. ప్రాంక్ వీడియోలు తీసి జనాలను  వెర్రోళ్లను చేయడం, ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియా నెట్‌‌వర్క్‌‌లలో పోస్ట్‌‌ చేయడం ప్రాంక్‌‌స్టర్లు చేసే పని. జనాలు ఆ వీడియోలను ఎంతలా చూస్తే.. అంతలా వైరల్‌‌ అవుతాయి. అప్పుడు ప్రాంక్‌‌స్టర్లకు పాపులారిటీ వచ్చేసినట్లే. తద్వారా యాడ్ల రూపంలో డబ్బులు సంపాదించుకుంటున్నారు కొందరు. అయితే ఆ వీడియోలు ఎంత సరదాగా ఉన్నప్పటికీ.. ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి.  స్వీయ తప్పిదాలతో చిక్కుల్లోపడుతున్న ప్రాంక్‌‌స్టర్లు కొందరైతే.. జనాల ఆగ్రహానికి గురై తన్నులు తింటున్న వాళ్లు ఇంకొందరు.

ఇరిటేషన్‌‌.. ఎటాక్‌‌

ఏదైనా పని జనాలకు ఇబ్బంది కలిగిస్తేనే అసలు సమస్య. కానీ, ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రాంక్‌‌ వీడియోలు చేయడం మాత్రం కుదరని పని. ‘నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం’. ప్రాంక్‌‌స్టర్లు పాటించే మొదటి సూత్రం ఇది. కానీ, కొందరు  ప్రాంక్‌‌స్టర్లు ఇదేం పట్టించుకోరు. ‘మోర్‌‌ ఫన్‌‌’ పేరిట జుగుప్సాకరమైన పనులు చేస్తుంటారు. ఆ టైంలో జనాలు ప్రాంక్‌‌ని తేలికగా తీసుకోకుండా తగిన బుద్ధి చెబుతుంటారు. ఒక్కోసారి కోపంతో ప్రాంక్‌‌స్టర్లపై ఎదురుదాడులకు దిగిన సందర్భాలున్నాయి. హిందీ బుల్లితెర కమెడియన్‌‌ దీపక్‌‌ కలాల్‌‌ చేసే ప్రాంక్‌‌ వీడియోలు అభ్యంతరకరంగా ఉండి వివాదాస్పదం అవుతుంటాయి. ఆ మధ్య ఢిల్లీలో ఒక ప్రాంక్‌‌ వీడియో చేస్తూ.. ఒక వ్యక్తి చేతిలో తన్నులు కూడా తిన్నాడు. దీపక్‌‌ ఏడుస్తూ క్షమాపణలు చెబుతున్న వీడియోను సదరు వ్యక్తి వైరల్ చేశాడు. అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఆ తర్వాత కూడా దీపక్‌‌ తన ప్రాంక్‌‌ వీడియోల పరంపర కొనసాగిస్తున్నాడు.  కాంట్రవర్సీలతో పాపులర్‌‌ అయ్యే కేటగిరీకి చెందిన ప్రాంక్‌‌స్టర్లు ప్రపంచవ్యాప్తంగా బోలెడంత మంది ఉన్నారు.

సెల్ఫ్‌‌ డ్యామేజ్‌‌

ప్రాంక్‌‌ వీడియోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం. మొన్నీమధ్యే ఇంగ్లాండ్‌‌లో ఒక వ్యక్తి తన గర్ల్‌‌ఫ్రెండ్‌‌ని ఆటపట్టించేందుకు జీన్స్‌‌ ప్యాంట్‌‌తో  ‘హ్యాంగింగ్‌‌’ (ఉరి) ప్రాంక్‌‌ ప్లే చేశాడు. పొరపాటున ఉరి నిజంగానే బిగుసుకుంది. ఆవిషయాన్ని అతని గర్ల్‌‌ఫ్రెండ్‌‌ ఆలస్యంగా గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ ‘డిజాస్టర్‌‌ ప్రాంక్‌‌’కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌‌లో వైరల్‌‌ అయ్యింది. ఇలా సేఫ్టీ చర్యలు తీసుకోకుండా తమకు తాము నష్టం చేసుకున్న వాళ్లు ఎందరో.

మరోవైపు ప్రాంక్‌‌స్టర్ల చేష్టల వల్ల జనాల ప్రాణాలు పోయిన కేసులు ఉన్నాయి. ముంబైలో పోయిన నెలలో ‘డేర్‌‌ స్టంట్‌‌’ యూట్యూబ్‌‌ చానెల్‌‌ ‘ఘోస్ట్‌‌ ఫీస్ట్‌‌’ పేరిట ఒక ప్రాంక్‌‌ వీడియో చిత్రీకరించింది. ఆ సమయంలో అటుగా వస్తున్న ఒక వృద్ధుడు భయంతో గుండెపోటుకి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ప్రాంక్‌‌స్టర్‌‌తో పాటు అతని టీంను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సరదా వీడియోలతో కటకటాల పాలయ్యేవాళ్లు కొందరైతే.. వార్నింగ్‌‌ అందుకునేవాళ్లు మరికొందరు.

పిల్లల్ని ఇన్‌‌వాల్వ్‌‌ చేయొద్దు

ప్రాంక్స్ ఏ మాత్రం వికటించినా, ఫలితాలు దారుణంగా ఉంటాయని తెలిసిందే. అయితే చిన్న పిల్లలను ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంచడమే మంచిదని మానసిక నిపుణులు చెప్తున్నారు. ‘ఇటువంటి చర్యలు పిల్లల మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాళ్లలో  అభద్రతా భావం, ఆత్మన్యూనత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పిల్లలతో ఆడుకోవచ్చు, కానీ అది శ్రుతి మించకూడదు. వాళ్ల  మానసిక స్థితిపై ప్రభావం చూపేవిధంగా ఉండకూడద’ని చెప్తున్నారు మానసిక నిపుణులు.