Adhira First Look : 'అధీర' ఫస్ట్‌లుక్ రిలీజ్.. ప్రశాంత్ వర్మ మూవీలో సూపర్ హీరో ఎవరంటే?

Adhira First Look : 'అధీర' ఫస్ట్‌లుక్ రిలీజ్.. ప్రశాంత్ వర్మ మూవీలో సూపర్ హీరో ఎవరంటే?

టాలీవుడ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు తన సొంత సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి మరో సూపర్ హీరో సినిమాను పరిచయం చేశారు. ఆ చిత్రమే 'అధీర'. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రశాంత్ వర్మ సోమవారం విడుదల చేశారు.  అది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే, ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో విలన్‌గా స్టార్ డైరెక్టర్, నటుడు ఎస్.జె. సూర్య నటిస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. 

పోస్టర్ లో ఉత్కంఠభరితమైన లుక్

'అధీర' పోస్టర్ లో కల్యాణ్, ఎస్.జె. సూర్య ఇద్దరూ శక్తివంతమైన లుక్‌లో కనిపించారు. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ అగ్నిపర్వతం, లావా, మెరుపులు, శిధిలాలతో చాలా శక్తివంతంగా ఉంది. కల్యాణ్ సూపర్ హీరో సూట్‌లో పవర్‌ఫుల్ పోజులో ఉండగా, ఎస్.జె. సూర్య బ్లాక్ సూట్, కొమ్ముల హెడ్‌గేర్‌తో భయంకరమైన విలన్‌గా కనిపించారు. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ ప్రశాంత్ వర్మ, "చీకటి ప్రపంచాన్ని కమ్మేసినప్పుడు, ఆశ అనే మెరుపు ఉద్భవిస్తుంది" అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'అధీర' చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్.కె. డుగ్గల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు, రివాజ్ రమేష్ డుగ్గల్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీని శివేంద్ర అందిస్తున్నారు. 'అధీర' సినిమా 2022లోనే ప్రకటించినప్పటికీ, 'హను-మాన్' సినిమా విజయం తర్వాత దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.

 

'హనుమాన్' నుంచి 'జై హనుమాన్'

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రాలు 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. కానీ, 'హనుమాన్' సినిమాతో ఆయన పాన్ ఇండియా దర్శకుడిగా పేరు పొందారు. ఇప్పుడు ఆయన తన సినిమాటిక్ యూనివర్స్‌ను 'అధీర'తో విస్తరిస్తున్నారు. 'హనుమాన్' సినిమా సీక్వెల్ అయిన 'జై హనుమాన్'ను కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

 కలియుగంలో శ్రీరాముడికి ఇచ్చిన వాగ్దానం కారణంగా అజ్ఞాతవాసంలో ఉన్న హనుమంతుడి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హను-మాన్'తో తెలుగు సినీ పరిశ్రమకు కొత్త దారి చూపించిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు తన సినిమాటిక్ యూనివర్స్‌లో మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతున్నారు.