‘అగ్నిపథ్’పై జేడీయూ, బీజేపీ పోరులో బిజీగా ఉన్నాయి..

‘అగ్నిపథ్’పై జేడీయూ, బీజేపీ పోరులో బిజీగా ఉన్నాయి..

పాట్నా : అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలతో ఒకవైపు బీహార్‌ రాష్ట్రం మండుతుంటే, మరోవైపు అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ తమ మధ్య పోరులో బిజీగా ఉన్నాయని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తప్పుపట్టారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో తీవ్రస్థాయికి చేరిన నిరసనలపై స్పందించారు. అగ్నిపథ్ స్కీమ్‌ హింస, విధ్వంసం కోసం కాదన్నారు. అయితే.. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగాలని చెప్పారు. ‘JDU,BJP మధ్య పోరులో బీహార్ ప్రజలు తీవ్ర భారాన్ని మోస్తున్నారు. రాష్ట్రంలో అగ్నిపథ్ మంటలు చెలరేగుతుండగా..ఇరు పార్టీల నేతలు సమస్యను పరిష్కరించకుండా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, ప్రత్యారోపణలు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు’ అంటూ ట్వీట్ చేశారు. 

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం రేణు దేవి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేసి ధ్వంసం చేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమ ఆస్తులను రక్షించుకోలేకపోతున్నామని బీజేపీ చీఫ్‌ సంజయ్‌ జైస్వాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలను అదుపు చేయడంలో సీఎం నితీశ్‌ కుమార్‌ విఫలమయ్యాయరని ఆరోపించారు. 

మరోవైపు బీజేపీ నేతల కామెంట్స్ ను సీఎం నితీశ్‌ కుమార్ పార్టీకి చెందిన జేడీయూ నేతలు ఖండించారు. రాష్ట్రంలో అధికారం పంచుకున్న బీజేపీ అనవసరంగా జేడీయూపై నిందలు వేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత రంజీవ్ రంజన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న యువత దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని చెప్పారు. హింసను తాము అంగీకరించనప్పటికీ, ప్రజల ఆందోళనను కూడా బీజేపీ గ్రహించాలని కోరారు. దీనికి బదులుగా పరిపాలనా యంత్రాంగంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మీరు (బీజేపీ) తీసుకున్న నిర్ణయానికి అడ్మినిస్ట్రేషన్‌ ఏం చేస్తుంది..? అని ప్రశ్నించారు.