మక్తల్ 6వ వార్డు ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్

మక్తల్ 6వ వార్డు ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్

నారాయణపేట, వెలుగు : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాల్టీలోని 6వ వార్డు ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ను విడుదల చేసిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. నారాయణపేట కలెక్టరేట్​​లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఎన్నిక షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 2వ నుంచి 6వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 7న నామినేషన్ పరిశీలన, 8న  అప్పీల్​, 10న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉందన్నారు. ఈ నెల 18న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితం వెల్లడించనున్నట్లు ఎన్నికల అధికారి ఫణీంద్రారెడ్డి తెలిపారు. అనుకోని కారణాలతో 18న పోలింగ్ జరగకపోతే 19 న పోలింగ్, 20 న కౌంటింగ్ ఉంటుందన్నారు. గురువారం నుంచి పోలింగ్ జరిగే వరకు మక్తల్ మున్సిపాల్టీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ప్రకటించారు. 

భూవివాదాల పరిష్కారమే లక్ష్యం  

 కోస్గి :   భూవివాదాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోస్గి మండలంలో పైలెట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’ పోర్టల్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కోస్గి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కొత్త విధానం ద్వారా రైతులు భూమి కొనుగోలు లేదా విక్రయాల కోసం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత, ముందుగా సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తారని వివరించారు. అనంతరం రైతుకు కేటాయించే ప్రత్యేక నంబర్ ఆధారంగా సమస్యలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.