
- అవసరాలు గుర్తించి అభివృద్ధి చెందే అనుకూల వాతావరణం సృష్టించడానికే ఈ ప్రయత్నం
- బీఓసీఐ అధ్యక్షుడు ప్రసన్న పట్వర్ధన్
హైదరాబాద్: బస్ & కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఓసీఐ) హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్లాగ్‌షిప్ ప్యాసింజర్ మొబిలిటీ ఈవెంట్ ‘ప్రవాస్3.0’ శనివారం ముగిసింది. ఈ మూడు రోజుల ఈవెంట్‌లో భారతదేశం అంతటా ఉన్న ప్రముఖ బస్సు & కార్ ఆపరేటర్‌లు ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ, స్కూల్ బస్, ఎంప్లాయీ ట్రాన్స్‌పోర్ట్, టూర్ ఆపరేటర్లు, టూరిస్ట్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌ల తయారీ కంపెనీలు, డీలర్లు, ఆపరేటర్లు పాల్గొన్నారు.
బస్సులు, రవాణా రంగంలోని ముఖ్యమైన 8 విభాగాల కీలక ప్రతినిధులంతా ఒకేచోట చేరారు. ఇదే వేదికపై టాటా తన కొత్త బస్సులను, అశోక్ లేలాండ్ చాసిస్‌ను ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖలు మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా బీఓసీఐ అధ్యక్షుడు ప్రసన్న పట్వర్ధన్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి లక్షలాది మంది జీవితాలను అస్తవ్యస్తం చేసిందని గుర్తు చేస్తూ.. కరోనా కాటుకు రవాణా రంగం కూడా క్రూరంగా దెబ్బతిందన్నారు. టూరిజం, బస్సులు, రవాణా రంగంపై ఆధారపడి ఉన్న దేశంలోని వేలాది మంది ఆపరేటర్ల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని.. చాలా గడ్డు రోజులను ఎదుర్కొన్నామని చెప్పారు. నిరంతర లాక్‌డౌన్‌లు, రవాణా ఆంక్షలతో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం నుండి ఇంకా కోలుకుంటున్నామని చెప్పారు. ఈ రంగంలో ఉన్న వారంతా ఒకేచ్ోట చేరి కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడానికి, ప్రదర్శించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రోత్సహించాలని కోరారు.
‘ప్రజా రవాణా ప్రతిరోజూ 32కోట్ల మంది ప్రయాణికులను చేరవేస్తోందని.. ఇది దేశంలోని ఇతర రవాణా మార్గాలకంటే చాలా ఎక్కువ. ఇందులో 85 శాతం బీఓసీఐ ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా సేవలు అందిస్తోంది. ఈ రంగంలో అవసరాలు గుర్తించి అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి కృషి చేయడానికే ఈ ప్రయత్నం’ అని ప్రసన్న పట్వర్ధన్ వివరించారు.