చెరకు రైతులు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

చెరకు రైతులు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

ఎండాకాలం వచ్చిదంటే  చాలామంది రైతులు చెరకు పంటను పండిస్తారు.  దీని కాల పరిమితి ఎక్కువ అయినా... రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటి సౌలభ్యం.. నేల నాణ్యత..వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుంటే  చెరకు పంటలో అధిక లాభాలు వస్తాయి. సమ్మర్​ సీజన్​ లో చెరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . . 

 చెరకు కాల పరిమితి ఎక్కువగా ఉండడం వల్ల సాగుకు అవసరమయ్యే నీరు కూడా ఎక్కువే. 125 నుండి 200 టన్నుల నీరు ఉంటేనే  ఒక టన్ను చెరకు  ఉత్పత్తి అవుతుంది. అదే ఒక టన్ను పంచదార తయారుకావడానికి సుమారు 1350 టన్నుల నీరు అవసరముంటుంది. చెరకు పంట 12- నుంచి 18 నెలలు కాల పరిమితి కలిగి ...  1800 నుండి 2000 మి.మీ. నీటిని వినియోగించుకుంటుంది. నీరు లభ్యత బాగా ఉంటేనే  చెరకు  పంటలో ఆశించిన దిగుబడులు వస్తాయి. కాని ప్రస్తుత  పరిస్థితుల్లో అడుగంటుతున్న భూగర్భజలాలను దృష్టిలో ఉంచుకొని చెరకు పంటకు నీరు తక్కువగా ఇవ్వవలసిన పరిస్తితి ఏర్పడింది. తక్కువ నీటితో అధిక దిగుబడులు రావాలి అంటే నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచవలసి ఉంటుంది.

 సాధారణంగా చెరకు పంటకు కేవలం 40 నుంచి -60 శాతం నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది. దీనికి గాను రైతు సరైన సమయంలో అవసరం మేరకు సరైన విధానంలో నీటిని ఇచ్చినట్లైతే తక్కువ నీటితో కూడా చెరకు లో మంచి దిగుబడులు సాధించవచ్చు. కావున రైతులు పైరు దశను బట్టి నీరు ఇవ్వాలి.  చెరకు పైరు నాటిన రోజు నుండి 45 రోజుల వరకు (మొలక దశ) 300 మి.మీ. నీరు అవసరం అవుతుంది.  45 నుండి 120 రోజుల వరకు (పిలకలు పెట్టే దశ) 550 నుండి 600మీ.మీ. నీరు అవసరం అవుతుంది.  4 నెలల వయసు వరకు సుమారు 800-నుంచి 900 మి.మీ. నీరు అవసరం అవుతుంది. ఆ తరువాత 1000 మీ.మీ నీరు అవసరమౌతుంది.

 పంట దశను బట్టి నీరు సరైనా మోతాదులో అందించడానికి నేల స్వభావాన్ని బట్టి 7-10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. పంట నాటేటప్పుడు నీరు అధికమైతే బూజు పట్టే అవకాశం ఉన్నందున నీరు అధికం కాకుండా జాగ్రత్త వహించాలి. పిలకలు పెట్టె దశలో నీతి ఎద్దడికి గురైనట్లైతే పిలకల సంఖ్య తగ్గే  అవకాశం ఉన్నందున నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి 4-5 రోజుల  వరకు పంట నీటి ఎద్దడికి గురికాకుండా తేలికపాటి తడులు 7 నుండి 10 రోజుల వ్యవధిలో అవసరానికి సరిపడ అందివ్వాలి.

చెరకు పెరుగుదల దశలో ఆకుల సంఖ్య, పరిమాణం...  గడల సంఖ్య ... పెరగడం జరుగుతుంది. ఈ దశలో పంట ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడికి గురి కాకూడదు. లేదంటే ఆకుల సంఖ్య ....  పరిమాణం తగ్గిపోవడంతో పాటు పంట ఎదుగుదల తగ్గి కణుపులు దగ్గర దగ్గరగా వుండి, గడలపొడవు, చెఱకు బరువు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కణుపుల మధ్య దూరం తగ్గడం వలన పంచదార శాతం తగ్గి నార శాతం పెరుగుతుంది. దీనివలన రసనాణ్యత కుంటుపడుతుంది. కనుక గడ ఏపుగా పెరిగే దశలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి.

చెరకు పంట పక్వదశకు చేరుకున్న తర్వాత కొద్దిపాటి నీటి ఎద్దడికి గురైనట్లైతే పంచదార శాతం పెరిగే అవకాశం ఉన్నందున నీటి తడుల మధ్య వ్యవధి పెంచవలసి ఉంటుంది. కాని నీటి ఎద్దడి మరీ ఎక్కువగా ఉన్నట్లైతే గడలు చీలి రసం  నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. పక్వదశలో భూమిలో లభ్యమయ్యే తేమ 75 శాతమునకు తగ్గినప్పుడు తడులు ఇవ్వటం మంచిది. అంటే తేలిక భూముల్లో 15 రోజుల కొకసారి, బరువు నేలల్లో 3 వారాల కొకసారి చొప్పున వక్వదశలో తడులు ఇవ్వటం వలన మంచి దిగుబడి వస్తుంది.

 తక్కువ నీటి వసతి  ప్రాంతాల్లో చెరకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు:

రైతులు  పొలం మాత్రమే దున్నడం వల్ల పంట వేర్లు పై భాగంలోకి మాత్రమే ఉండి అక్కడి నీటిని ఉపయూగించుకుంటాయి. లోపలి పొరల్లో  నీటిని వినియోగించుకోలేవు. కావున లోతు దుక్కి చేసి భూమిని బాగా గుల్లపరచాలి. దీని వలన వేళ్ళు బాగా లోతుకు చొచ్చుకొనిపోయి లోపలి పొరల నుండి తేమను గ్రహించి వంట కీలకదశలో నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.  అవసరం మేరకు నీరు అందించలేని పరిస్థితుల్లో కీలక దశల్లో మాత్రమే నీరు అందించి మిగిలిన దశల్లో తడికి తడికి మధ్య వ్యవధి ని పెంచాలి.  ఎదిగిన పంట నీటి ఎద్దడికి తట్టుకోగలదు కాబట్టి వీలైనంత త్వరగా నాట్లు పూర్తి చేసి నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొనే లోపల వంట త్వరగా ఎదిగేలా చూడాలి.

చెరకు పంట నాటిన తరువాత ఒక తడి మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే నాటిన 30 రోజులకు....  రెండు తడులు ఇచ్చే అవకాశం ఉంటే నాటిన 20 మరియు 60 రోజులకు తడి ఇస్తే   తేమ ఎక్కువ రోజులు నిలువ వుంటుంది.   మొలక...  పిలక శాతం కూడా పెరుగుతుంది. నీటి వసతి తక్కువగా వున్నప్పుడు ప్రతి కాలువకు నీరు పెట్టి ఒక తడి ఇచ్చేకంటే, కాలువ వదిలి కాలువకు నీరు పారించి రెండు తడులు పెట్టడం మంచిది. అలాగే కాలువ చివరి వరకు నీరు పెట్టడం కంటే కాలువలో మూడవ వంతు వరకు మాత్రమే నీరు పారించాలి. దీని వలన  26 శాతం నీరు ఆదా అవుతుంది. తక్కువ నీటి లభ్యత ఉన్న చోట బిందు సేద్యం ద్వారా పొదుపుగా వాడుకోవడం లాభదాయకంగా వుంటుంది. సేంద్రియ ఎరువులను సమృద్ధిగా వాడి భూమిలో నీరు విలువ వుండే శక్తిని పెంచాలి.