వేసవిలో పిల్లల కోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే

వేసవిలో పిల్లల కోసం  ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే

నీళ్లలో ఆడుకోవడం అంటే పిల్లలకి భలే సరదా. సెలవులొస్తాయని.. ఆటలు, ఈత వంటి బోలెడన్ని యాక్టివిటీస్‌‌ ఉంటాయని వేసవిని ఇష్టపడతారు పిల్లలు. అయితే, ఇంత హ్యాపీనెస్‌‌ను ఇచ్చే సమ్మర్‌‌‌‌... కాస్త జాగ్రత్తగా లేకపోయినా పిల్లలకు కొన్ని రకాల సమస్యల్ని తెచ్చిపెడుతుంది. పైగా కరోనా కారణంగా ఇప్పుడు స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో ఇంట్లోనే ఉంటారు. ఇలాంటప్పుడు పిల్లలపై దృష్టి పెట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

సమ్మర్‌‌‌‌లో పిల్లలు ఎక్కువగా ఎండ బారిన పడతారు. ఎండ తగలడం వల్ల ‘విటమిన్‌‌–డి’ వస్తుంది. అది మంచిదే. కానీ... ఉదయం, సాయంత్రం కాకుండా, మిగతా టైంలో వచ్చే ఎండ హాని చేస్తుంది. ఈ టైంలో అల్ట్రావయొలెట్‌‌ కిరణాల (యూవీ రేస్‌‌) ప్రభావం ఉంటుంది. అందువల్ల మధ్యాహ్నం పూట ఎండలోకి వెళ్లనీయొద్దు. ఈ టైంలో వాళ్లను వీలైనంతవరకు ఇంట్లోనే ఉంచాలి. ఎండ ప్రభావం పడకుండా ఉండేందుకు కొన్ని అలవాట్లు కూడా చేసుకోవాలి. 

సన్‌‌స్క్రీన్‌‌ లోషన్‌‌

ఎండాకాలంలో పిల్లలకు కచ్చితంగా సన్‌‌స్క్రీన్‌‌ లోషన్‌‌ రాయాలి. ఎండలో ఎక్కువసేపు ఆడుకోవడం వల్ల పిల్లల చర్మం పాడవుతుంది. యూవీ కిరణాల ప్రభావం చర్మం మీద పడకుండా ఉండేందుకు సన్‌‌స్క్రీన్‌‌ లోషన్‌‌ రాసుకోవాలి. ఇది రాసుకుంటే చర్మం కమిలిపోకుండా ఉంటుంది. ఎండలొకి వెళ్లడానికి కనీసం అరగంటముందు సన్‌‌స్క్రీన్‌‌ లోషన్ రాయాలి. అయితే, ఎంత మొత్తంలో వాడాలో ముందే తెలుసుకోవాలి. దీనికోసం ప్యాకెట్‌‌పైన రాసిన విషయాల్ని చదివి. ఫాలో కావాలి. ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ టైంలో ఎండకు ఎక్స్​పోజ్​ కాకుండా పిల్లల్ని నీడపట్టున ఉంచాలి.

కాటన్​కే ఓటు

వేసవిలో పిల్లలకు వేసే బట్టలు చాలా ముఖ్యం. కాటన్‌‌ బట్టలు మాత్రమే వేయాలి. వదులుగా ఉండి, చెమట ను పీల్చే డ్రెస్​లు వాడాలి. ఈత కొట్టేటప్పుడు  స్విమ్‌‌ సూట్స్‌‌ తప్పనిసరి. అలాంటివి వేసుకున్నప్పుడు సన్‌‌ ప్రొటెక్షన్‌‌ ఉన్నవే వాడాలి. ఈమధ్య ప్రత్యేకంగా సన్‌‌ ప్రొటెక్షన్‌‌ స్విమ్‌‌ సూట్స్‌‌ దొరుకుతున్నాయి. ఇవి ఎండ వేడిమి ప్రభావాన్ని తగ్గిస్తాయి.

కళ్లద్దాలు

పిల్లలకు సన్‌‌గ్లాసెస్‌‌ పెట్టుకోవడం అలవాటు చేయాలి. సమ్మర్‌‌‌‌లో డే టైమ్‌‌లో బయటకు వెళ్లాల్సి వస్తే, కచ్చితంగా కూల్‌‌ షేడ్‌‌ సన్‌‌గ్లాసెస్‌‌ వాడాలి. అవి కూడా యూవీ కిరణాల ప్రభావాన్ని తగ్గించేవి వాడితే చాలా మంచిది. ఇప్పుడు ఇవి అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. వీటితోపాటు తలకు క్యాప్‌‌ పెట్టుకోవాలి. దీనివల్ల ఎండ ప్రభావం తగ్గుతుంది.

డీ హైడ్రేషన్‌‌ డ్రింక్స్‌‌

అవసరం ఉన్నా, లేకపోయినా ఇంట్లో కచ్చితంగా డీ హైడ్రేషన్‌‌ డ్రింక్స్‌‌ తెచ్చిపెట్టుకోవాలి. గ్లూకోజ్‌‌, ఓఆర్‌‌‌‌ఎస్‌‌ పౌడర్‌‌‌‌ అందుబాటులో ఉంచుకోవాలి. వీటితోపాటు మజ్జిగ, షర్బత్‌‌, ఫ్రూట్‌‌జ్యూస్‌‌లు రోజూ తాగించాలి. బయట ఆడుకునే పిల్లలకు ఓఆర్‌‌‌‌ఎస్‌‌ పౌడర్‌‌‌‌ కలిపిన వాటర్‌‌‌‌ బాటిల్స్‌‌ ఇచ్చి పంపించాలి. ఎండలో ఆడుకుని, ఇంటికి రాగానే, చల్లని నీళ్లు పిల్లల మీద చిలకరించాలి.

హెల్మెట్స్‌‌

ఎండలో పిల్లల్ని బయటకు తీసుకెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. టూవీలర్‌‌‌‌పై వెళ్తే హెల్మెట్‌‌ పెట్టాలి. రోలర్‌‌‌‌ స్కేట్స్‌‌, సైకిల్‌‌, స్కూటర్స్‌‌పై ఆడుకుంటున్నా సరే హెల్మెట్‌‌ తప్పనిసరి. కనీసం క్యాప్‌‌ అయినా పెట్టాలి. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తే సాయంత్రాలు చేయడం బెటర్​. 

కరోనా సేఫ్టీ

ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌‌ తప్పకుండా వాడేలా చూడాలి. శానిటైజర్‌‌‌‌ వాడాలి. రెగ్యులర్‌‌‌‌గా హ్యాండ్‌‌వాష్‌‌ చేసుకునే అలవాటు చేయాలి. రద్దీ ఎక్కువగా ఉండే ప్లేస్​లకు పంపకూడదు. పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాడాలి. పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాడితే జాగ్రత్తలు తప్పనిసరి.

ఈత కొడుతుంటే...

ఈ సీజన్‌‌లో పిల్లలు ఎక్కువగా ఎంజాయ్‌‌ చేసేది ఈత. అయితే, ఈత సరదా కొన్నిసార్లు సమస్యగా కూడా మారుతుంది. ముఖ్యంగా ఈత రాని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈత కొట్టేటప్పుడు పిల్లల్ని ఒంటరిగా పంపకూడదు. ఎంతలోతుకు వెళ్లి ఈతకొట్టాలో ముందే జాగ్రత్తలు చెప్పాలి. వాళ్లు స్విమ్మింగ్ పూల్​లో ఉన్నంతసేపు జాగ్రత్తగా గమనించడం పెద్దల బాధ్యత.

హెల్దీ ఫుడ్‌‌

మామూలుగానే పిల్లలకి ఐస్‌‌క్రీమ్స్‌‌, చాక్లెట్స్, కూల్‌‌డ్రింక్స్‌‌, ప్యాకేజ్డ్‌‌ ఫుడ్‌‌ అంటే ఇష్టం ఉంటుంది. అది ఈ సీజన్​లో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. వీటిని వీలైనంత వరకు తగ్గించి, హెల్దీ ఫుడ్‌‌ తినిపించాలి. ముఖ్యంగా వడగాలులు ఎక్కువగా ఉన్న టైంలో ఆయిల్‌‌ ఫుడ్‌‌, స్పైసీ ఫుడ్‌‌ పూర్తిగా మానేయాలి. మజ్జిగ, అంబలి వంటివి తాగించాలి. పుచ్చకాయ, దోసకాయ వంటి సీజనల్‌‌ ఫ్రూట్స్‌‌ రోజులో ఏదో ఒక టైంలో తినిపించాలి.