Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ నుంచి టీమిండియా స్టార్ ఓపెనర్ ఔట్.. వికెట్ కీపర్ డౌట్!

Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ నుంచి టీమిండియా స్టార్ ఓపెనర్ ఔట్.. వికెట్ కీపర్ డౌట్!

మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ కు చేరుకొని ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 30) నవీ ముంబై వేదికగా డివై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ లో పటిష్టమైన ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఈ నాకౌట్ పోరుకు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ప్రతీకా రావల్ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. ఇండియా సెమీస్ గెలిచి ఫైనల్ కు వచ్చినా రావల్ ఈ మెగా ఫైనల్ కు దూరం కానుంది. 

ఆదివారం (అక్టోబర్ 26) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ప్రతీక రావల్ చీలమండ గాయంతో బాధపడింది. మ్యాచ్ తర్వాత 25 ఏళ్ల ఈ  యువ ఓపెనర్ కు స్కానింగ్ తీయగా ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వరల్డ్ కప్ సెమీస్ కు చేరాలంటే న్యూజిలాండ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రావల్ సెంచరీతో చెలరేగింది. ఆస్ట్రేలియా లాంటి పవర్ ఫుల్ జట్టుపై ఈ టీమిండియా ఓపెనర్ దూరం కావడంతో ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ప్రతీక రావల్ స్థానంలో జట్టులో ఇంకా ఎవరిని ప్రకటించలేదు. బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లోనూ ఆమె గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. అమన్ జ్యోత్ కౌర్ తో కలిసి స్మృతి మందాన ఇన్నింగ్స్ ఆరంభించింది.

ఏం జరిగిందంటే..?
 
ఆదివారం (అక్టోబర్ 26) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‎తో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ప్రతీకాకు ఇంజ్యూరీ అయ్యింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఆపబోయే క్రమంలో కాలు మలుసుని కిందపడింది. దీంతో గ్రౌండ్‎లోనే నొప్పితో ప్రతీకా విలవిలలాడింది. నొప్పితో బాధపడుతున్న ప్రతీకా సహాయక సిబ్బంది సహాయంతో మైదానం వీడింది. గాయం తీవ్రతతో ఎక్కువగా ఉండటంతో ప్రతీకా బ్యాటింగ్‎కు కూడా దిగలేదు. దీంతో అమన్ జోత్ కౌర్‎తో కలిసి ఓపెనర్ స్మృతి మందాన ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతీకా గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. 

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ ప్రతీకా రావల్ మోకాలికి, చీలమండలానికి గాయమైందని తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం ఆమెను నిశితంగా పరిశీలిస్తోందని వెల్లడించింది. 

రిచా ఘోష్ ఫిట్ నెస్ పై ఆందోళన:   

టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా సెమీస్ కు ముందు గాయంతో ఇబ్బంది పడుతోంది. ఆమె ఫిట్ నెస్ పై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ వికెట్ కీపర్-బ్యాటర్ వేలికి గాయం కావడంతో బంగ్లాదేశ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఆమెను ఆడించలేదు. సెమీ ఫైనల్ సమయానికి ఆమె ఫిట్ గా ఉండాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. రిచా ఫిట్ నెస్ పై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. మంగళవారం (అక్టోబర్ 28) ఆమె ఫిట్ నెస్ పై ఒక క్లారిటీ వస్తోంది.