
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు బాణసంచా కూర్చిన పండు ఇవ్వడంతో అది మరణించిన ఘటనపై ప్రముఖులు నుంచి సామాన్యులు వరకు సోషల్ మీడియా వేదికగా అందరూ ఖండించారు. ఆ ఘటనకు పాల్పడిన వాళ్లు మనుషులే కాదని, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే… హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో అచ్చం అలాంటి ఘటనే మరోకటి జరిగింది. గర్భంతో ఉన్న ఓ ఆవు నోటిలో బాంబు పేలింది. బిలాస్‌పూర్‌లోని ఝాందూత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. పొలంలోని గడ్డిలో దాచిన పేలుడు పదార్థాన్ని తినడంతో ఆవు దవడలు మొత్తం పగిలి.. నోటి నుంచి వేలాడుతున్నాయి.
ఆవు యజమాని గురుదయాళ్ సింగ్ ఈ దారుణంపై మాట్లాడుతూ….తన ఇంటి పొరుగున ఉన్న నందలాల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడదని ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత నందలాల్ పారిపోయాడని తెలిపాడు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఈ ఘటనకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తనకు న్యాయం చేయాలని తెలిపాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.