రోడ్డు లేదు..అంబులెన్స్ రాలేదు.. అర్థరాత్రి గర్బిణీని 3 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు..

రోడ్డు లేదు..అంబులెన్స్ రాలేదు.. అర్థరాత్రి గర్బిణీని 3 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు..

 తెలంగాణలో మారుమూల గ్రామాలకు రోడ్డు మార్గం కూడా లేని దుస్థితి. తెలంగాణలో ప్రజల చెంతకు అన్ని సౌకర్యాలు చేరుతున్నాయి...అని గొప్పలు చెప్పుకునే అధికార పార్టీ నాయకులు..ములుగు జిల్లా ఏటూరు నాగారంలో  ఓ గర్బిణీ.. ప్రసవం పడిన కష్టాలను  కళ్లారా వీక్షిస్తే వారికి అసలు విషయం తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే..
 
ములుగు జిల్లా  ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి సెప్టెంబర్ 24వ తేదీ ఆదివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశా కార్యకర్తకు తెలియజేశారు. ఆశా కార్యకర్త 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. అయితే  రాయబంధం గొత్తికోయగూడేం గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేదు. దీంతో  అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పడంతో  కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

 ప్రస్తుతం గర్భిణి సోది పోసి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమెకు వైద్యులు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. గర్బిణీ సోదిపోసికి ఎలాంటి అపాయం కలగకపోవడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read :- ఏంటీ వర్షం..బీభత్సం కాదు కాదు..అతి బీభత్సమైన వాన

తెలంగాణ వచ్చి 10 ఏండ్లు అవుతున్నా..తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదని రాయబంధం గొత్తికోయగూడేం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తితే..దేవుడి మీద భారం వేసి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు. ప్రస్తుతం గర్బిణీ సోదిపోసికి గండం తప్పిందని..లేదంటే..పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు.