- భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో ఘటన
గుండాల, వెలుగు : ఓ గర్భిణి గుండెపోటుతో హాస్పిటల్‌లో చనిపోయింది. అంత్యక్రియల కోసం డెడ్‌బాడీని గ్రామానికి తీసుకొస్తుండగా.. ఊరికి కీడు జరుగుతుందంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని లింగగూడెం గ్రామానికి చెందిన బొమ్మెర్ల మహేందర్ గుండాల పీఏసీఎస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ భార్య లలిత (35)తో కలిసి అక్కడే ఉంటున్నాడు.
లలిత తొమ్మిది నెలల గర్భిణి. బుధవారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో... ఆమెను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు లలితను పరీక్షించి ఇల్లందుకు రెఫర్ చేయగా.. అక్కడి నుంచి ఖమ్మం సర్కార్ హాస్పిటల్‌కు పంపించారు. అక్కడ లలితను పరీక్షించిన డాక్టర్లు రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి ట్రీట్‌మెంట్‌కు సిద్ధం అవుతుండగానే...లలిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పరీక్షించిన డాక్టర్లు లలిత చనిపోయినట్లు నిర్ధారించారు.
దీంతో అంత్యక్రియల కోసం లలిత డెడ్‌బాడీని లింగగూడెం గ్రామానికి తీసుకొస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ లీడర్ జాడి ప్రభాకర్‌తో పాటు మరికొందరు గ్రామస్తులు లలిత కుటుంబ సభ్యులను గ్రామ శివారులోనే అడ్డుకున్నారు. గర్భిణి అయిన లలిత డెడ్‌బాడీని గ్రామంలోకి తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తే గ్రామానికి కీడు జరుగుతుందంటూ, ఎక్కడో చనిపోయిన తర్వాత గ్రామానికి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు.
డెడ్‌బాడీని గ్రామంలోకి తీసుకురావద్దని చెప్పడంతో గ్రామ శివారులోనే టెంట్ వేసి డెడ్‌బాడీని అక్కడే ఉంచారు. తర్వాత మల్లన్న వాగు బ్రిడ్జి సమీపంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, డెడ్‌బాడీని గ్రామంలోకి తీసుకురాకుండా అడ్డుకున్న ప్రభాకర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
