అప్పుడే పుట్టిన బిడ్డ‌ను ఎత్తుకుని 150కి.మీ న‌డిచిన బాలింత

అప్పుడే పుట్టిన బిడ్డ‌ను ఎత్తుకుని 150కి.మీ న‌డిచిన బాలింత

భోపాల్‌ : వ‌ల‌స కార్మికుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. ఇటీవ‌ల కాలిన‌డ‌క‌న స్వ‌స్థ‌లానికి వెళ్తున్న నిండు గ‌ర్భిణీ రోడ్డు ప‌క్క‌నే బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. మ‌రి కొంత మంది ఎండ‌కు భ‌రించ‌క‌.. న‌డ‌వ‌లేక మ‌ధ్య‌లోనే ప్రాణాలు విడిచిన సంఘ‌ట‌న‌లు కూడా చూస్తున్నాం. తాజాగా ఓ బాలింత 150 కిలోమీట‌ర్లు న‌డిచింది. ఈ సంఘ‌ట‌న ‌మధ్యప్రదేశ్ లో జ‌రిగింది.

సాత్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రాకేశ్‌ కౌల్‌, శకుంతల దంపతులు.. కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌కు వలస వెళ్లారు. ప్రస్తుతం లాక్ ‌డౌన్‌ అమల్లో ఉండటంతో వారికి ఉపాధి కరువైంది. దీంతో తమ సొంతూరుకు వెళ్లాలని రాకేశ్‌ దంపతులు నిర్ణయించుకున్నారు. శంకుతల నిండు గర్భిణి. అయినప్పటికీ తమ నడకను నాసిక్‌ నుంచి మే 5వ తేదీన సాత్నాకు ప్రారంభించారు. 70 కిలోమీటర్ల నడక త‌ర్వాత‌.. ఆగ్రా – ముంబయి జాతీయ రహదారి పక్కన శకుంతల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుని.. మళ్లీ నడక ప్రారంభించింది శకుంతల. తన పసిబిడ్డను ఎత్తుకుని.. ఎర్రటి ఎండలో 150 కిలోమీటర్లకు పైగా నడిచింది ఆ బాలింత.

మార్గమధ్యలో బాలింతను గమనించిన ఓ సిక్కు కుటుంబం వారిని ఆదరించింది. పసిపాపకు దుస్తులు ఇచ్చి.. ఆహారం అందించారు. ఇక మహారాష్ట్ర – మధ్యప్రదేశ్‌ సరిహద్దులోని బిజాసాన్‌ చెక్ ‌పోస్టు వద్ద బాలింతను పోలీసులు గుర్తించారు. బాలింత తన బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ఉన్న దృశ్యాలను చూసి పోలీసులు చలించిపోయారు. పోలీసులు.. బాలింతను సురక్షితంగా వారి సొంతూరుకి చేర్చారు. బిడ్డ జన్మించిన తర్వాత సుమారు 150 కిలోమీటర్లు నడక సాగించినట్లు శకుంతల చెప్పడంతో పోలీసులు ఉద్వేగానికి లోనయ్యారు. వెంట‌నే స్థానిక హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు డాక్ట‌ర్లు.