వరండాలో వాకింగ్ చేస్తూ.. కళ్లు తిరిగి కిందపడి గర్భిణి మృతి

 వరండాలో వాకింగ్ చేస్తూ.. కళ్లు తిరిగి కిందపడి గర్భిణి మృతి

గచ్చిబౌలి, వెలుగు: రెండో అంతస్తులో వాకింగ్ చేస్తూ కళ్లు తిరిగి కింద పడి గర్భిణి చనిపోయిన ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లిలోని వెంకట్​రెడ్డి కాలనీలో ఉండే శ్రీనిక(23) తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోయారు. దీంతో ఆమెను  పిన్ని, బాబాయి చక్రాల స్వప్న, కృష్ణ దంపతులు పెంచి పెద్ద చేశారు. పటాన్ చెరులోని రుద్రారానికి చెందిన శ్రవణ్​కుమార్​కు ఇచ్చి పెండ్లి చేశారు. 

ప్రస్తుతం శ్రీనిక 5 నెలల గర్భిణి. మెడికల్ చెకప్ కోసం ఈ నెల 15న ఆమె లింగంపల్లిలోని పిన్ని స్వప్న ఇంటికి వచ్చింది. బుధవారం స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంది. గురువారం ఉదయం 7.30 గంటలకు బిల్డింగ్ రెండో అంతస్తు వరండాలో ఆమె వాకింగ్ చేస్తోంది. అదే టైమ్​లో కళ్లు తిరిగి ప్రమాదవశాత్తు రెండో ఫ్లోర్ ర్యాంప్​పై నుంచి గ్రౌండ్ ఫ్లోర్​లో పడిపోయింది. తీవ్రంగా గాయపడ్డ శ్రీనికను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ 11.43 గంటలకు మృతి చెందింది. శ్రీనిక అప్పుడప్పుడు కళ్లు తిరిగి పడిపోయేదని కుటుంబసభ్యులు తెలిపారు. పిన్ని స్వప్న ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు.