గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌‌ వేస్కోవచ్చు

గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌‌ వేస్కోవచ్చు

న్యూఢిల్లీ: గర్భిణులు కరోనా వ్యాక్సిన్‌‌ వేసుకోవచ్చని క్లారిటీ ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిందని ఐసీఎంఆర్‌‌  డీజీ బలరామ్‌‌ భార్గవ చెప్పారు. ప్రెగ్నెంట్లకు వ్యాక్సిన్‌‌ వల్ల ఉపయోగం ఉందన్నారు. 18 ఏండ్ల లోపు వాళ్లకు మాత్రం ఇప్పుడు ఒక దేశమే వ్యాక్సిన్‌‌ వేస్తోందని, చిన్నారుల్లో ఎవరికి వ్యాక్సిన్‌‌ ఇవ్వాలో సరైన ఇన్ఫర్మేషన్‌‌ వచ్చే వరకు వాళ్లకు పెద్ద స్థాయిలో వ్యాక్సిన్‌‌ వేయలేమని వివరించారు. 2 ఏండ్ల నుంచి 18 ఏండ్ల మధ్య పిల్లలకు టీకా వేయడంపై ఐసీఎంఆర్‌‌ స్టడీ ప్రారంభించిందని, దీని ఫలితాలు సెప్టెంబర్ నాటికి వస్తాయని చెప్పారు. ప్రెగ్నెంట్లు వైరస్‌‌ బారిన పడే అవకాశం ఎక్కువనే ఆందోళన వ్యక్తమవుతున్న టైమ్​లో కేంద్రం ఈ గైడ్‌‌లైన్స్‌‌ విడుదల చేసింది. ఇంతకుముందు వరకు పాలిచ్చే తల్లులకే వ్యాక్సిన్‌‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గర్భిణులపై ట్రయల్స్‌‌కు సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్‌‌ అందుబాటులో లేకపోవడంతో వాళ్లను వ్యాక్సినేషన్‌‌లో చేర్చలేదు.    

మే నెలలోనే చెప్పిన ఎన్‌‌టీఏజీఐ

గర్భిణులకు వ్యాక్సినేషన్‌‌పై నేషనల్‌‌ టెక్నికల్‌‌ అడ్వైజరీ గ్రూప్‌‌ ఆన్‌‌ ఇమ్యూనైజేషన్‌‌(ఎన్‌‌టీఏజీఐ) మే నెలలో చర్చ జరిపింది. కరోనా బారిన పడే చాన్స్‌‌ ఎక్కువున్న వాళ్లలో వీళ్లూ ఉన్నారని, కాబట్టి వ్యాక్సిన్‌‌ వేయాల్సిన అవసరముందని చెప్పింది. వ్యాక్సిన్‌‌ వేస్తే తల్లీపిల్లలకు ప్రమాదం ఎక్కువనే ప్రచారాన్ని కొట్టిపారేసింది. ప్రమాదం కన్నా ఉపయోగమే ఎక్కువని వివరించింది. వ్యాక్సిన్‌‌ వేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాలు గర్భిణులకు వివరించాలని చెప్పింది.  

పిల్లలపై భారత్‌‌ బయోటెక్‌‌ ట్రయల్స్‌‌ స్టార్ట్

భారత్‌‌ బయోటెక్‌‌ సంస్థ 2 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలు 525 మందిపై వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ చేస్తోంది. రెండు, మూడు నెలల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సీరమ్‌‌ కూడా కొవొవ్యాక్స్‌‌ వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌ను పిల్లలపై చేయాలని ప్లాన్‌‌ చేస్తోందని తెలిసింది. మున్ముందు పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువుంటుందని ఆందోళన వ్యక్తమవుతుండగా కేంద్రం అదేంలేదని చెప్పింది. అయితే వచ్చే నెలలో చేసే సీరో సర్వేలో 6 ఏండ్లు పైబడిన పిల్లలు 14 వేల మందిపై సర్వే చేయాలంది.

దేశంలో 40 కోట్ల టెస్టులు చేసిన్రు

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టెస్ట్‌‌లు చేశారు. ఇప్పటివరకు 40 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌‌‌‌ వెల్లడించింది. జూన్‌‌ నెలలో అత్యధికంగా రోజుకు 18 లక్షల టెస్టులు చేసినట్లు చెప్పింది. శుక్రవారం వరకు దేశంలో 40 కోట్ల 18 లక్షల 11 వేల 892 కరోనా శాంపిల్స్‌‌ను టెస్ట్‌‌ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌‌ 1 వరకు 35 కోట్ల టెస్టులు చేశారంది. ‘‘దేశంలో టెస్టులు చేయడానికి అవసరమైన సౌలతులు పెరగడంతో రోజూవారి టెస్టుల సంఖ్య పెరిగింది. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోవడం, అవసరమైన డయాగ్నస్టిక్‌‌ కిట్ల తయారీతో టెస్టులు చేసే కెపాసిటీ పెరిగింది’’ అని పేర్కొంది. దేశంలో ‘టెస్ట్‌‌, ట్రాక్‌‌, ట్రేస్‌‌, ట్రీట్‌‌, టెక్నాలజీ’ని మెరుగ్గా అమలుచేయడం వల్లే ఇది సాధ్యమైందని ఐసీఎంఆర్‌‌‌‌  డీజీ బలరాం భార్గవ చెప్పారు.