పట్వారీ టు ఐపీఎస్​

పట్వారీ టు ఐపీఎస్​

పట్వారీ, అసిస్టెంట్ జైలర్, ప్రైమరీ స్కూల్​టీచర్, సబ్​ఇన్​స్పెక్టర్, హైస్కూల్​టీచర్, కాలేజీ లెక్చరర్, చివరికి ఐపీఎస్. 2010 నుంచి 2016 వరకు ఓ వ్యక్తి సాధించిన ఉద్యోగాలివీ. ఆశ్చర్యంగా ఉందా?  ఆరేళ్లలో ఏడు సర్కారీ కొలువులు.. ఎలా సాధ్యమనిపిస్తుంది కదూ! ఏదో ఒక జాబ్​ వచ్చిందని అక్కడే ఆగిపోకుండా, లక్ష్యం నెరవేరే వరకూ పోరాడితే సాధ్యమేనని నిరూపించాడు రాజస్థాన్​కు చెందిన ఐపీఎస్​ ఆఫీసర్​ ప్రేమ్‌‌​సుఖ్ దేలు. 31 ఏండ్ల ఈ యంగ్​ ఆఫీసర్ ​పట్వారీగా ప్రస్థానం ప్రారంభించి ఐపీఎస్​వరకు ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిని ఇస్తోంది.

ఇదీ ప్రేమ్ సక్సెస్ స్టోరీ..

ప్రేమ్ రాజస్థాన్ బికనీర్​జిల్లాలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. ఏదైనా పెద్ద గవర్నమెంట్​జాబ్​కొట్టాలని అనుకున్న ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు. ఇక ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూడలేదు. ఒకటి తర్వాత ఒకటి ఏడు కొలువులు కొట్టేశాడు. పట్వారీ అయిన ఏడాదే అసిస్టెంట్​జైలర్​గా ఎంపికయ్యాడు. ఈ పరీక్షలో రాష్ట్రంలోనే టాప్​ప్లేస్​లో నిలిచాడు. 2011లో ప్రైమరీ టీచర్​గా, 2013లో సబ్​ఇన్​స్పెక్టర్​గా, హైస్కూల్​టీచర్​గా సెలెక్ట్​ అయ్యాడు. తర్వాత బీఈడీ కంప్లీట్​చేసి, నెట్​(నేషనల్​ఎలిజిబిలిటీ టెస్ట్) సాధించాడు. అనంతరం కాలేజీలో లెక్చరర్​గా ఉద్యోగం. అయినా ప్రేమ్​ ఆగలేదు..  కొలువుల వేట కొనసాగించాడు. స్టేట్​పబ్లిక్​సర్వీస్ కమిషన్​పరీక్షల్లో కొంచెం తేడాతో పోలీస్​ఉద్యోగం చేజారినా, రెవెన్యూ సర్వీస్​లో సెలెక్ట్​ అయ్యాడు. అయితే ఓటమిని అంగీకరించని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్​ రాశాడు. హిందీ మీడియంలో మెయిన్స్​రాసిన ప్రేమ్..170వ ర్యాంక్​సాధించి2016లో ఐపీఎస్​ ఆఫీసర్ అయ్యాడు. ట్రెయినింగ్ పూర్తి చేసుకుని​ గుజరాత్​లోని అమ్రేలి జిల్లాలో ఏఎస్​పీగా ఇటీవల జాయిన్​ అయ్యాడు.

జాబ్ ​చేస్తూనే ప్రిపరేషన్​

ప్రేమ్​ఈ జాబ్​లన్నీ అంత ఈజీగా ఏమీ కొట్టలేదు. ఎంతో కష్టపడ్డాడు. ఓవైపు జాబ్ చేస్తూనే ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అయ్యేవాడు. రోజూ 5 గంటలు ప్రిపరేషన్​కు కేటాయించేవాడు. ‘‘అమ్మానాన్న చదవుకోలేదు. ఇంట్లో చదువుకు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. కానీ కానిస్టేబుల్ అయిన మా అన్న ప్రోత్సాహంతోనే నేను కాంపిటిటివ్ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అయ్యాను” అని ప్రేమ్ ​చెప్పాడు. ‘‘నీ లక్ష్యం చేరే వరకూ ఆగిపోకు” అని చెప్పే ప్రేమ్​… ఐపీఎస్​ ఆఫీసర్​గానూ ప్రతిభ చూపారు. రెండుసార్లు పరేడ్​ కమాండెంట్​గా వ్యవహరించాడు. సర్దార్​వల్లభాయ్ పటేల్​భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని వచ్చిన టైంలో ఈయనే కమాండెంట్. అలాంటి మేజర్ ఈవెంట్​కు గుజరాత్​ పోలీసుల తరఫున రిప్రజెంట్ చేయడం తన అదృష్టమని చెప్పాడు. అయితే ఇంతటితోనే ఆగిపోనని, మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని ప్రేమ్ చెప్తున్నారు.