‘ప్రేమమ్’.. కథగా చెప్పడానికి వీలు కాని కథ

‘ప్రేమమ్’.. కథగా చెప్పడానికి వీలు కాని కథ

మనసు.. ప్రేమ.. జీవితం.. అన్నీ చిన్న చిన్న పదాలే. కానీ వాటికున్న అర్థాలు చాలా పెద్దవి. మూడూ పరస్పరం ముడిపడి ఉన్నవి. ఒకదానితో ఒకటి పెనవేసుకు పోయినవి. మనసులో ప్రేమ పుట్టాక జీవితం మారిపోతుంది. జీవితంలోకి ప్రేమ వచ్చాక మనసు మురిసిపోతుంది. అందుకే వీటిని విడదీసి చూడలేం. జార్జ్ డేవిడ్ కూడా చూడలేకపోయాడు. ప్రేమ వచ్చి మనసును ఆక్రమించిన క్షణాన జీవితమంటే అదే అనుకున్నాడు. మనసు ముక్కలై అశ్రువులు ధారకట్టిన క్షణాన ప్రేమొక్కటే జీవితం కాదని తెలుసుకున్నాడు. కానీ ప్రేమ వెంటే పయనించాడు. ప్రేమతోనే జీవించాడు. పసితనం నుంచి పరిపక్వతకి, అమాయకత్వం నుంచి పరిణతికి మధ్య అతను ప్రేమతో చేసిన ప్రయాణమే.. ‘ప్రేమమ్’. 

ఇది అతని కథ

జీవితం చాలా చిత్రమైనది. ఎప్పుడెలా మారుతుందో తెలీదు. ప్రేమ అంతకంటే విచిత్రమైనది. జీవితాన్ని ఎప్పుడెలా మారుస్తుందో తెలీదు. ఈ రెండింటికీ రాయబారి.. మనసు. రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఓ పట్టాన అర్థం కాదు. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయగలిగినవాళ్లే సక్సెస్ అవుతారు. ముందుకి వెళ్లగలుగుతారు. అయితే అదంత తేలిక కాదు. ఎందుకంటే.. జీవితంలో ఒక భాగంగా ఇమిడిపోవాల్సిన ప్రేమ, కొన్ని సమయాల్లో జీవితం మీదే పెత్తనం చెలాయిస్తుంది. దాన్ని నిర్దేశించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం కనుక విఫలమైతే జీవితం చెల్లాచెదరైపోతుంది. వీటి మధ్య మనసు నలిగిపోతుంది. విరిగిపోతుంది. జార్జ్ డేవిడ్‌ విషయంలో అదే జరిగింది. అతనీ సినిమా హీరో. ఇది అతని కథ. అతని జీవిత గాథ. ఆ ప్రేమలు అతనివి. ఆ భావోద్వేగాలు అతనివి. ఆ కలలు అతనివి. ఆ కన్నీళ్లూ అతనివే. కానీ వెండితెర ముందు కూర్చుని చూసేవాకిరి అవన్నీ చుట్టుముట్టేశాయి. అదేంటో కానీ.. ఆ సినిమాని ఇప్పుడు చూసినా.. అతని భావనలు మన గుండెని తడుముతాయి. అతని కలలు మనల్ని కలవర పెడతాయి.  

ఆ వయసు అలాంటిది

జార్జ్ కేరళలో ఉంటాడు. ఓ చిన్న ఊరు వాళ్లది. పదహారేళ్ల వయసు. ప్రీ డిగ్రీ స్టూడెంట్. తమ ఏరియాలో ఉండే ఓ స్కూల్ గాళ్‌ని ప్రేమిస్తాడు. ఆమె కనిపిస్తే  చాలు.. మనసుకు రెక్కలు వచ్చేస్తుంటాయి. ఊహలు పురివిప్పుకుని పరుగులు తీసేస్తుంటాయి. ప్రతిక్షణం ఆమె గురించిన ఆలోచనలే. తనని చూడాలని ఆరాటపడటం.. కనిపిస్తే కంగారుపడిపోవడం.. వెనకే ఫాలో అవ్వడం.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చాలనుకోవడం.. ఇలా ఏవేవో.  క్రీగంటితో చూసిందో ఇక పరవశమే. కాసిన్ని నవ్వులు రువ్విందో ఆ రాతిరంతా కలవరమే. ఆ వయసు అలాంటిది మరి. సరికొత్త ఆశలు పూస్తాయి. కొంగొత్త కోరికలు కుదురు లేకుండా చేస్తాయి. ఏవేవో ఆరాటాలు. ఎన్నెన్నో ఆతురతలు.  వాటి మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ జార్జ్. వెళ్లి మాట్లాడాలని ఉంటుంది. గొంతు పెగలదు. మనసు తన ముందు పరిచేయాలనిపిస్తుంది. ధైర్యం చాలదు. అయితే ఈ వయసులో కుర్రాళ్లు గుర్తించని విషయం ఒకటుంది. అదేంటంటే.. అతనిలాగే మిగతా కుర్రాళ్లూ ఆలోచిస్తారు. అందుకే ఆ అమ్మాయిని జార్జ్ తో పాటు ఆ ఊళ్లో చాలామంది అబ్బాయిలు ఆరాధిస్తున్నారు. వీరందరిదీ ఒకటే మంత్రం.. ఒన్‌ సైడ్‌ లవ్. అయితే జార్జ్ మాత్రం ఆ అమ్మాయి కూడా తనని ప్రేమిస్తుందనే నమ్మకంతో ఉంటాడు. కానీ ఒకరోజు ఆమె మరో అబ్బాయిని తీసుకొచ్చి తన లవర్ అంటూ పరిచయం చేస్తుంది. అంతే.. ఒక్కసారిగా కొండమీది నుంచి లోయలోకి జారిన ఫీలింగ్.

మరో అమ్మాయి అతని జీవితంలోకి

2000లో జరిగిన ఈ కథని వదిలేసి 2005 నాటికి లైఫ్‌లో మరో దశకు చేరుకుంటాడు జార్జ్. కానీ ఇక్కడ కూడా ప్రేమ అతనిని వెంటపడి తరిమింది. మరో అమ్మాయి అతని జీవితంలోకి వచ్చింది. ఆమె పేరు మలర్. జార్జ్ చదివే కాలేజ్‌కి లెక్చెరర్‌‌గా వచ్చింది. బేసిగ్గా తమిళియన్. చూస్తూనే ప్రేమలో పడిపోయాడు జార్జ్. ఆమె కూడా తనలానే ఫీలయ్యేలా చేయాలనుకున్నాడు. అందుకోసం నానా వేషాలూ వేస్తాడు. ఎట్టకేలకి మనసు గెల్చుకుంటాడు. చాటింగులు.. సీక్రెట్ మీటింగులు.. ఎంతకీ తరగని కబుర్లు.. కాగితాలపై కోకొల్లలుగా వచ్చిపడే కవిత్వాలు.. వలపు పిలుపుల పులకరింతలు.. చిలిపి తలపుల చిత్రవధలు..  ఒకటీ రెండూ కాదు.. ఎన్నో ఎన్నెన్నో. అన్నింటినీ ఆనందంగా ఆస్వాదిస్తున్న సమయంలో మరో షాక్. ఊరు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాదు. మొదట్లో ఓపికగా ఎదురు చూస్తాడు. ఆ తర్వాత చూసి చూసి చిన్నబోతాడు. అప్పటికీ రాకపోవడం, ఫోన్‌కి కూడా దొరక్కపోవడంతో వేదనతో వేగిపోతాడు. తన కోసం ఆమె రావడం లేదు కనుక ఆమె కోసం తానే వెళ్తే మంచిదనుకుంటాడు. వెళ్తాడు కూడా. అయితే అక్కడ కనిపించిన దృశ్యం అతని గుండెను ముక్కలు చేసేస్తుంది. తన మనసులో ప్రేయసిగా కొలువైన ఆమె..  మరొకరి పక్కన భార్యగా కనిపిస్తుంది. ఇలా ఎలా జరిగిందో అర్థం కాదు. ఎందుకు జరిగిందో అంతు పట్టదు. కలలన్నీ కాలిపోతున్న చప్పుడు చెవులకు వినిపిస్తోంది. ఆశలన్నీ ఆవిరైపోతున్న దృశ్యం కళ్లముందే కనిపిస్తోంది. తమాయించుకుంటాడు. తడబడినా పడకుండా నిభాయించుకుంటాడు. అసలు నిజమేంటో తెలుసుకుంటాడు. ఓ యాక్సిడెంట్‌లో గతమంతా మర్చిపోతుందామె. అతనిని.. అతనికిచ్చిన మాటని.. పంచుకున్న మనసుని.. పెంచుకున్న ప్రేమని.. అన్నింటినీ. ఇక ఏం చేయగలడు! తానెవరో ఆమెకి ఎలా చెప్పగలడు! ఏం చెప్పి గుర్తు చేయగలడు! అవకాశమే లేదు. అందుకే తన మనసును చంపేసుకుని, ఆమెను మనస్ఫూర్తిగా దీవించి వచ్చేస్తాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకి మరో అమ్మాయి అతని లైఫ్‌లోకి వస్తుంది. అప్పటికి అతని వయసు ముప్ఫై. సెలిన్‌ని చూడగానే తనకి కావాల్సిన అమ్మాయి ఆమేనని డిసైడ్ చేసుకుంటాడు. స్నేహం చేస్తాడు. ప్రేమను తెలపాలనుకుంటాడు. అంతలో ఆమె మరొకరిని పెళ్లాడబోతోందని తెలుస్తుంది. మరోసారి మనసును చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి. అయితే నిశ్చితార్థం నాడు కాబోయే భర్త అవమానించడంతో పెళ్లి రద్దు చేసుకుంటుంది సెలిన్. ఆ తర్వాత మెల్లగా జార్జ్ కు దగ్గరవుతుంది. అతనికి భార్య అవుతుంది.

 ప్రతి కుర్రాడికీ ఓ ప్రేమకథ ఉంటుంది

ప్రేమ పుట్టడాన్ని ఎవ్వరూ ఆపలేరు. దానికి ఎవరి అనుమతులూ అవసరం లేదు. రావాలి అనుకుంటే నేరుగా గుండెల్లోకి చొరబడిపోతుంది. ముఖ్యంగా కౌమారంలో ప్రతి కుర్రాడికీ జార్జ్ కు ఉన్నట్టే ఓ ప్రేమకథ ఉంటుంది. పక్క బెంచీ అమ్మాయి మీద చెప్పలేనంత ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. పక్కింట్లోకి వచ్చిన కొత్తమ్మాయితో మనసు అర్జంటుగా లవ్‌లో పడిపోతుంది. అందరూ ఈ స్టేజ్ దాటి వచ్చేవాళ్లే. జీవితం మీద తమకే అవగాహన లేని ఈ వయసులో పుట్టే ఇష్టానికి ఆయుష్షు చాలా తక్కువ. వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయితే అది ఉన్నట్టుండి మాయమైపోవచ్చు. ఇంట్లోవాళ్లు ఆంక్షలు విధిస్తే ఎదిరించే తెగువ లేక ఆ ప్రేమకథ అక్కడే ఆగిపోవచ్చు. లేదా మేరీలా మరో వ్యక్తిని చూపించి నా మనసులో ఉన్నది అతను అని చెబితే అప్పటి వరకు కుదురు లేకుండా చేసిన ప్రేమ పుటుక్కున తెగిపోవచ్చు. కారణం ఏమైనా.. వయసు ఏదైనా.. డిస్టర్బ్ అవడమైతే కామన్. దాని నుంచి బైటపడిపోవడమూ కామన్. అందుకే జార్జ్ కు మేరీని మర్చిపోవడానికి పెద్ద సమయం పట్టలేదు. 

యుక్త వయసులో పుట్టే ప్రేమ

ఇక యుక్త వయసులో పుట్టే ప్రేమ. ఇది చాలా బలంగా ఉంటుంది. గెలిస్తే జీవిత భాగస్వామి రూపమంలో జీవితాంతం వెంటే ఉంటుంది. ఓడిపోతే బరువైన జ్ఞాపకంగా బతుకంతా వెంటపడి వేధిస్తుంది. అందుకే ఆ స్టేజ్‌ని దాటడానికి చాలా కష్టపడ్డాడు జార్జ్. మేరీని మర్చిపోయినంత వేగంగా మలర్‌‌ని మర్చిపోలేకపోయాడు. ఆమె స్మృతుల్లో పడి కొట్టుమిట్టాడాడు. మరిచిపోలేక మథనపడిపోయాడు. ప్రేమ బలమైనదే కావచ్చు. కానీ కాలం అంతకంటే బలమైనది. అది దేన్నయినా వెనక్కి నెట్టేస్తుంది. అందుకే జార్జ్ ను తనతో పాటు లాక్కుపోయింది. మరో అమ్మాయి ముందు నిలబెట్టింది. అతని లైఫ్‌లో మరోసారి ప్రేమకి చోటిచ్చింది. అప్పటికే అతనికి జీవితమంటే ఏమిటో అర్థమై ఉండటంతో ఆచితూచి అడుగులు వేశాడు. ఈసారి ప్రేమని చేజార్చుకోకుండా ఒడిసి పట్టుకున్నాడు.

దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?

ఈ మొత్తం ప్రయాణంలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? జీవితాన్ని మనం శాసించలేం, అది మనల్ని శాసిస్తుందనా? కోరుకున్నది దక్కదు, దక్కినదాన్నే అంగీకరించమనా? ఆశపడటంలో తప్పు లేదు కానీ నిరాశపడటంలో అర్థం లేదనా? కలలు అందంగానే ఉంటాయి కానీ కఠినంగా ఉండే వాస్తవాన్నే అనుసరించాలనా? అందని దాని కోసం అర్రులు చాచకుండా అందినదాన్ని అందిపుచ్చుకుని ఆనందపడాలనా? ఎన్ని ఆటంకాలైనా రానియ్.. ఎన్ని అవరోధాలైనా ఆపనియ్.. ఆగకుండా సాగుతూనే పోవాలనా? 

సింపుల్‌గా కనిపించే ఈ ప్రేమకథ ఇన్ని ప్రశ్నలు వేస్తుందా! ఇన్ని సందేశాలు ఇచ్చిందా! అవును ఇచ్చింది. సినిమా ఒక కల్పనే కావచ్చు. కానీ అది జీవితం నుంచే పుడుతుంది. అందుకే దర్శకుడు అల్ఫాన్స్ పుత్రన్‌ ఈ చిత్రాన్ని జీవితానికి అతి దగ్గరగా తీశాడు. అత్యంత సహజంగా చూపించాడు. జార్జ్ గా నివిన్‌ పాలీలో ఒక నటుణ్ని ఎవరూ చూడలేదు. తమని తాము చూసుకున్నారు. అతని మనసును స్పృశించే అమ్మాయిలుగా అనుపమ పరమేశ్వరన్, సాయిపల్లవి, మెడొన్నా సెబాస్టియన్‌లని అందంగా చూపించాడు. ప్రేమలోని పారవశ్యాన్ని ప్రతి పాత్రతో పలికించాడు. యెడబాటులోని ఆవేదనని అంతే పర్‌‌ఫెక్ట్ గా ఒలికించాడు. అందుకే ఒక సింపుల్‌ కథని సెన్సేషనల్ హిట్ చేయగలిగాడు.

ఇది కథ కాదు.. జీవితం

నిజానికి కొన్ని కథల్ని నోటితో చెప్పలేం. ‘ప్రేమమ్’ కూడా అంతే. కథగా చెప్పడానికి వీలు కాని కథ ఇది. కానీ సెల్యులాయిడ్‌ పైకి  వచ్చి సంచలనాలు సృష్టించింది. ఇతర భాషల్లోకి డబ్‌ అయ్యి అక్కడా సక్సెస్ సాధించింది. అందుకు కారణం ఒక్కటే. ఇది కథ కాదు.. జీవితం. ప్రతి మనిషి లైఫ్‌లోనూ ఈ దశలుంటాయి. వాటన్నింటినీ ఈ సినిమా గుర్తు చేసింది. మనల్ని మనలా ఉండనివ్వలేదు. మనమే జార్జ్ అనుకునేలా చేసింది. అతని ఫీలింగ్స్ ను మనం అనుభవించేలా చేయగలిగింది. అందుకే అందరికీ అంతగా నచ్చింది.