
వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆరోగ్యం గురించి సమాచారం వచ్చింది. ప్రేమానంద్ మహారాజ్ చాలా కాలంగా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నారు. ఆయనకు 2006 నుంచే ఈ సమస్య ఉంది, అలాగే ఆయన రెండు కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి.
గతంలో అయన వారానికి ఐదు రోజులు డయాలసిస్ చేయించుకునేవారు, కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి తీవ్రమవడంతో ప్రతిరోజూ డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుంది. డయాలసిస్ అంటే కిడ్నీలు చేయాల్సిన శుద్ధి పనిని వైద్య పరికరాల ద్వారా చేయించడం. ప్రేమానంద్ తన నివాసం అయిన శ్రీ కృష్ణ శరణం సొసైటీలోనే ఒక ప్రత్యేక గదిలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన గుండె వైద్యుడితో సహా ఆరుగురు డాక్టర్ల బృందం ఆయనను చూసుకుంటోంది.
తన ఆరోగ్యం గురించి భక్తులు బాధపడుతున్నారని తెలుసుకుని, మహారాజ్ వారికి ఓ మాట చెప్పారు. నొప్పి, కష్టంగా ఉన్నా, భగవంతుడి దయ చాలా ఉంది. నేను చాలా బాగానే ఉన్నాను. అందరూ సంతోషంగా ఉండండి. త్వరలో కలుద్దాం. మీరందరూ మీ ఆందోళనను పక్కనపెట్టి, ఆనందంతో రాధారమని నామాన్ని జపించండి అని చెప్పారు. ఆయన చెప్పిన ఈ మాటలు తనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన దృష్టి అంతా భక్తిపైనే ఉందని తెలియజేస్తుంది.
ప్రేమానంద్ మహారాజ్ ప్రతి రోజు ఉదయం 2 గంటలకు శ్రీ కృష్ణ శరణం సొసైటీ నుండి దాదాపు 2 కిలోమీటర్లు నడిచి కాళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లేవారు. అతనిని చూడటానికి వేల మంది భక్తులు వస్తు గంటల తరబడి వేచి ఉండేవారు. డయాలసిస్ కారణంగా ఇప్పుడు నడకను ఆపేశారు.
ప్రేమానంద్ మహారాజ్ పై భక్తులకు ఎంత భక్తి, గొరవం ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన కిడ్నీని ప్రేమానంద్ మహారాజ్ గారికి దానం చేస్తానని చెప్పారు. రాజ్ కుంద్రాతో పాటు మరో ఇద్దరు భక్తులు ఆరిఫ్ ఖాన్ చిష్తి, దినేష్ ఫల్హారీ బాబా కూడా వారి కిడ్నీలను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ప్రేమానంద్ మహారాజ్ అందుకు తిరస్కరించారు.
ప్రేమానంద్ మహారాజ్ అసలు పేరు అనిరుద్ధ కుమార్ పాండే. కాన్పూర్ దగ్గరలోని అకారి గ్రామంలో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే ఇంటిని వదిలిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టారు. ఆయన కాశీలో గురు గౌరీ శరణ్ జీ మహారాజ్ సమక్షంలో దాదాపు 15 నెలలు సాధన చేశారు. ఇప్పటికి అనారోగ్యంతో ఉన్న కూడా అతను బృందావనానికి వచ్చి రాధ నామాన్ని జపిస్తుంటారు.