- డీల్ విలువ రూ.170 కోట్లు
న్యూఢిల్లీ: రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్, సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీతో కలిసి కేసోలార్ ఎనర్జీలో 100 శాతం వాటాను రూ.170 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ జాయింట్ వెంచర్ (జేవీ) లో ప్రీమియర్ ఎనర్జీస్ 51శాతం మెజారిటీ వాటా కలిగి ఉండగా, మిగిలిన 49శాతం సిర్మా ఎస్‌జీఎస్‌కి చెందుతుంది. కేసోలార్ ఎనర్జీ పుణేలో ఉన్న తయారీ కేంద్రం ద్వారా సంవత్సరానికి 5 లక్షల సోలార్ ఇన్వర్టర్లను ఉత్పత్తి చేస్తోంది.
ఇది ప్రధానంగా రెసిడెన్షియల్ మార్కెట్ కోసం ఆన్‌గ్రిడ్, ఆఫ్‌గ్రిడ్, హైబ్రిడ్ మోడళ్లను రూపొందించి, తయారు చేస్తోంది. 2024–25లో కంపెనీ రూ.342 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తాజా డీల్‌తో ప్రీమియర్ ఎనర్జీస్ రెసిడెన్షియల్ సోలార్ ఇన్వర్టర్ విభాగంలోకి ప్రవేశించింది. భవిష్యత్తులో పుణేలో కొత్త బ్రౌన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేసి, సామర్థ్యాన్ని 10 లక్షల ఇన్వర్టర్లకు పెంచే ఆలోచనలో ఉంది. ఇదే వారం, ప్రీమియర్ ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్‌లో 51శాతం వాటాను రూ.500.3 కోట్లకు కొనుగోలు చేసి ట్రాన్స్‌ఫార్మర్ తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.
‘‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ప్రతి రూఫ్‌టాప్‌కు లోకల్‌గా తయారైన నాణ్యమైన ఇన్వర్టర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ చిరంజీవ్ సలూజా అన్నారు. సోలార్ ఎనర్జీలో ప్రీమియర్‌తో కలిసి అఫోర్డబుల్ ధరలో సోలార్ ఇన్వర్టర్లను అందుబాటులోకి తెస్తామని సిర్మా ఎస్‌జీఎస్ డైరెక్టర్ జస్బీర్ గుజ్రాల్ పేర్కొన్నారు.
