
గత నెల రూ.రూ. 38,958 కోట్ల రాబడి
హైదరాబాద్, వెలుగు: జీవిత బీమా సంస్థల ప్రీమియం ఆదాయం గత నెల 22.4 శాతం పెరిగింది. ప్రైవేట్ కంపెనీలతోపాటు ఎల్ఐసీలోనూ వృద్ధి కారణంగా రూ. 38,958 కోట్లకు చేరుకుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటా ప్రకారం.. జులై 2024లో ప్రీమియం వసూళ్ల విలువ రూ. 31,822 కోట్లు . మొత్తం సంవత్సరానికి పరిశ్రమ వృద్ధి అంచనా 10–-12 శాతం ఉంది.
ఈ ఏడాది జులైలో జీవిత బీమా రంగం వ్యక్తిగత సింగిల్ ప్రీమియాల విలువ సంవత్సరానికి 19.44 శాతం పెరిగి రూ. 5,506.81 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వృద్ధి (వైటీడీ) 14.09 శాతంగా ఉంది. వ్యక్తిగత, నాన్-సింగిల్ ప్రీమియాల విలువ జులై 2025లో 9.6 శాతం పెరిగి రూ. 10,051.05 కోట్లకు చేరుకుంది. వీటి వైటీడీ వసూళ్లు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 6.02 శాతం పెరిగాయి.
జీవిత బీమా సంస్థలు 3,47,561 కంటే ఎక్కువ మందిని వ్యక్తిగత జీవిత బీమా ఏజెంట్లుగా చేర్చుకున్నాయి. మొత్తం ఏజెంట్ల సంఖ్యలో 2.27 శాతం పెరుగుదల ఉంది. ఈ ఏడాది ఏప్రిల్–-జులై మధ్య ప్రీమియాల విలువ 9 శాతం పెరిగి రూ. 1.32 లక్షల కోట్లకు చేరుకుంది. బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం 22 శాతం పెరిగి రూ. 16,340 కోట్లకు చేరుకుంది.