హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తో పాల తయారీ

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తో పాల తయారీ

ఈ మధ్య ప్రతీది కల్తీ అవుతోంది. దీంతో బయట ఏది కొనాలన్నా భయం వేస్తుంది. ముఖ్యంగా నిత్యావసరాలు పాలు, నూనె, కూరగాయలు ఇలా నిత్యావసర వస్తువులు కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా మనం రోజు ఉదయన్నే తాగే పాలు, టీ కల్తీ అవుతున్నాయి. పాలల్లో నీళ్లు కలిపితే ఏం కాదు కానీ.. కెమికల్స్ కలుపుతున్నారు. ఈ కెమికల్స్ కలిపిన పాలు తాగితే క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

 

కల్తీ పాలకు అడ్డాగా యాదాద్రి భువనగిరి జిల్లా 



తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి మండలం భీమనపల్లిలో  హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, పాల పొడితో కల్తీ పాలు తయారుచేస్తున్న పాల వ్యాపారిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. కందాల బుచ్చిరెడ్డి కొంత కాలంగా పాలవ్యాపారం చేస్తున్నాడు. స్థానికంగా రైతుల నుంచి పాలను సేకరిస్తుంటాడు. ప్రతి రోజూ పాలను హోటళ్లు, పలు స్వీట్‌ హౌస్‌లకు, ప్రజలకు  విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో రైతుల నుంచి సేకరించగా తక్కువైన మొత్తానికి, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, పాల పౌడర్‌ను ఉపయోగించి కల్తీ పాలను తయారుచేస్తుంటారు. పాలు చిక్కగా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. కొన్నాళ్లుగా ఈ కల్తీపాల దందా కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు కందాల బుచ్చిరెడ్డి  ఇంటిపై  సోదాలు నిర్వహించి, 110 లీటర్ల కల్తీపాలు, 100 మిల్లీ లీటర్ల  హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 3 కిలోల సిమ్మద్ పాలపౌడర్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కందాల బుచ్చిరెడ్డిని  స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇలాంటి రసాయనాలు వినియోగించడం వల్ల అనారోగ్యం పాలు కావడం ఖాయమంటున్నారు వైద్యులు. డిటర్జెంట్‌, రసాయనాలు కలపడం వల్ల పాలు తెల్లగా, స్వచ్ఛంగా కనిపిస్తాయి. వీటిని తాగడం వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు, విరేచనాలు అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన పాలు తాగడం వల్ల మూత్రపిండాల పనితీరులో మార్పు కనిపిస్తుందంటున్నారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను పాల స్వచ్ఛతను ఎక్కువ కాలం కాపాడేందుకు కలుపుతారు. దీనివల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అల్సర్‌ సమస్య తీవ్రమై కడుపులో మంట మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. స్టార్చ్‌ కలపడం వల్ల పాలు చిక్కగా కనిపిస్తాయని, ఈ పాలను ఎక్కువగా తాగడం వల్ల డయేరియా బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.